కేంబ్రిడ్జి రాణి కేట్ మిడిల్‌టన్ డ్రెస్‌ను రూపొందించింది మన భారతీయ మహిళే… ఆ డ్రెస్ విలువ ఎంతో తెలుసా..?

కేంబ్రిడ్జి రాణి కేట్ మిడిల్‌టన్ తెలుసుగా? భారత్‌లో ఇటీవలే ఈమె తన భర్త ప్రిన్స్ విలియమ్స్‌తో కలిసి పలు ప్రాంతాల్లో కూడా పర్యటించింది. ఈ క్రమంలో ఇటీవలే ఆమె మన దగ్గర వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. అయితే ఆమె తన పర్యటనలో భాగంగా ముంబై ఓవల్ మైదాన్ రిక్రియేషన్ గ్రౌండ్‌లో క్రికెట్ కూడా ఆడింది. ఈ వార్త కూడా అన్ని మీడియా చానళ్లు, పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది. ఇప్పుడక్కడికే వస్తున్నాం. మైదానంలో క్రికెట్ ఆడుతున్నప్పుడు కేట్‌ను జాగ్రత్తగా గమనించారా? అదేనండీ ఆమె డ్రెస్‌ను గమనించారా అని. అవును, ఆమె వేసుకున్న డ్రెస్ గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోయేది. అయితే ఏమంటారు, రాణి కాబట్టి కొన్ని లక్షల్లోనో, కోట్లలోనో డ్రెస్ ఉందనుకుంటున్నారా? అయితే మీరు పొరపాటు పడినట్టే! ఎందుకంటే ఆ డ్రెస్ విలువ 140 బ్రిటిష్ పౌండ్లు మాత్రమే. అంటే భారత మార్కెట్ ప్రకారం ఆ డ్రెస్ విలువ రూ.13వేలు. ఈ విలువ సాధారణ మధ్యతరగతి వారికి ఎక్కువగానే కనిపించినా, సాక్షాత్తూ రాణిగా ఉన్న కేట్‌కు మాత్రం చాలా తక్కువే. ఇంతకీ ఆమె ధరించిన ఈ డ్రెస్‌ను కుట్టింది ఎవరో తెలుసా? మన భారతీయ మహిళే. ముంబైకి చెందిన రోజువారీ కార్మికురాలు బబితనే కేట్ డ్రెస్‌ను కుట్టింది.

kate middleton

ముంబైకి చెందిన అనితా డోంగ్రే (53) ఫ్యాషన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ శ్రీమతి నతీబాయ్ దామోదర్ థాకర్‌సే వుమెన్స్ యూనివర్సిటీలో ఫ్యాషన్ డిజైన్ విద్యను అభ్యసించింది. ఈమె 1995లో తన పేరిట ఓ సొంత ఫ్యాబ్రిక్ కంపెనీని సోదరి మీనా సెహ్రా, సోదరుడు ముకేష్ సావ్లానీలతో కలిసి ఏర్పాటు చేసింది. కాగా ప్రారంభంలో ఆమె కేవలం 2 కుట్టుమిషన్‌లతో ఓ చిన్నరూమ్‌లో తన వ్యాపారం చేసేది. కాగా కాలక్రమంలో అదే కంపెనీ పెరిగి పెరిగి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం నవీ ముంబైలో లక్షా 80 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అనితా డోంగ్రే కంపెనీ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఆమె వద్ద దాదాపు 2600 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అలాంటి వారిలో బబిత కూడా ఒకరు.

kate dress

డిజైన్ ప్యాటర్న్ దగ్గరి నుంచి ఫ్యాబ్రిక్ క్లాత్, దారం వరకు అన్నింటినీ అనితా డోంగ్రేనే స్వయంగా చూసుకుంటుంది. ఆమె అనుమతి లభించాకే కార్మికులు ఆయా ప్యాటర్న్‌లకు అనుగుణంగా ఫ్యాబ్రిక్‌తో డిజైన్లు వేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే అనిత వేసిన ఓ ప్యాటర్న్, డిజైన్‌తో బబిత స్వయంగా ఓ డ్రెస్‌ను కుట్టింది. కాగా అనుకోకుండా ఆ డ్రెస్‌ను కేంబ్రిడ్జి రాణి కేట్ మిడిల్‌టన్ తన ఇండియా పర్యటనలో ధరించింది. అయితే కేట్ ధరించిన డ్రెస్ తాము తయారు చేసిందేనని ముందుగా అనిత గుర్తించలేదు. అయితే మీడియాతోపాటు తన ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌లో ఒక్కసారిగా ఆ ఫొటోలు కనిపించడంతో వాటిని ఆమె గుర్తు పట్టి అది తాను డిజైన్ చేసిన డ్రెస్సే అని నిర్దారించుకుంది.

ఇలా ఓ సాధారణ ఫ్యాబ్రిక్ కంపెనీలో తయారైన డ్రెస్‌ను కేట్ లాంటి అత్యున్నత స్థాయి గల వ్యక్తి ధరించడం పట్ల కేవలం అనితే కాదు, దాన్ని కుట్టిన బబిత కూడా ఎంతో సంతోషంగా ఉంది. తాను కుట్టిన డ్రెస్‌ను ఓ అసాధారణ మహిళ ధరించడం తనకెంతో సంతోషంగా ఉందని, ఇది తమలాంటి వారికి ఇంకా గుర్తింపునిస్తుందని బబిత చెప్పింది. అయితే అనితా డోంగ్రే పలువురు బాలీవుడ్ హీరో హీరోయిన్లకు కూడా ఎప్పటి నుంచో డ్రెస్‌లు డిజైన్లు చేస్తూ వస్తోంది. 2014 అక్టోబర్‌లో జరిగిన హీరోయిన్ దియా మీర్జా వివాహానికి కూడా అనితే వెడ్డింగ్ డ్రెస్‌ను డిజైన్ చేసింది. ఫ్యాషన్ రంగంలో దాదాపు 20 ఏళ్లకు పైగా అనుకోని రీతిలో ప్రగతి సాధిస్తున్న అనితకు ఫోర్బ్స్ ఇండియా, ఫార్చూన్ ఇండియా, బిజినెస్ టుడే, బ్లాక్‌బుక్ మ్యాగజైన్లు అత్యంత శక్తివంతమైన 50 మంది మహిళల్లో ఒకరిగా గుర్తింపునిచ్చాయి. అయితే ఇంత సాధించినా ఆమె మనసులో ఉన్నది మాత్రం ఒక్కటే. దేశంలో ఆర్థికంగా వెనుకబడ్డ మహిళలకు ఈ రంగం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తేవడం. అందుకోసం 2017లో ఓ వినూత్న ప్రణాళికతో ముందుకు వస్తానని, అమెరికా, ఆస్ట్రేలియా వంటి అగ్రశ్రేణి మార్కెట్లలో ప్రవేశిస్తామని అనితా డోంగ్రే ధీమాగా చెబుతోంది. మనం కూడా ఆమె ప్రణాళిక సక్సెస్ కావాలని విష్ చేద్దాం.

చివరిగా ఒక్క విషయం… కేట్ మిడిల్‌టన్ ఆ డ్రెస్‌ను ధరించడం ఏమో గానీ ఇప్పుడు అలాంటి డ్రెస్ కోసమే అనితా డోంగ్రే కంపెనీకి లెక్కకు మించి ఆర్డర్లు వస్తున్నాయట. ఓ క్రమంలో వారు నిర్వహిస్తున్న ఓ వెబ్‌సైట్ ఈ ఆర్డర్ల కారణంగా హ్యాంగ్ కూడా అయిందట. అంతేలే! సెలబ్రిటీలు ఏం చేసినా వారిని అనుకరించడం మనకు పరిపాటే. అందుకే అలా పెద్ద సంఖ్యలో డ్రెస్ కోసం ఆర్డర్లు వస్తున్నాయి. అయితేనేం ఎంతో మంది కార్మికులకు ఉపాధి దొరుకుతుంది కదా!

Comments

comments

Share this post

scroll to top