టిక్కెట్ బుక్ చేసుకున్నా రైలులో ప్ర‌యాణికుడికి సీట్ ఇవ్వ‌నందుకు రైల్వేకు రూ.75వేల ఫైన్ వేసిన కోర్టు

అస‌లే రైలులో సుదీర్ఘ ప్ర‌యాణం. కొన్ని గంట‌ల పాటు ప్ర‌యాణించాలి. అందుకోసం మీరు ముందుగానే టిక్కెట్ కూడా రిజ‌ర్వ్ చేసుకున్నారు. విజ‌య‌వంతంగా ట్రెయిన్‌ను అంది పుచ్చుకుని ఎక్కారు కూడా. మ‌ధ్య‌లో ఎవ‌రో వ్య‌క్తి (టిక్కెట్ కూడా లేకుండా) మీ సీట్‌ను ఆక్ర‌మించాడ‌నుకుందాం. అప్పుడు మీరైతే ఏం చేస్తారు..? ఏముందీ.. ఎవ‌రైన ద‌బాయిస్తారు. మ‌రి అవ‌తల ముగ్గురు వ్య‌క్తులు ఉండి, మీరు ఒక్క‌రే ఉంటే.. అప్పుడు..? ఏం చేస్తారు..? ఏం చేస్తారు.. ఎవ‌రైనా ఏమీ చేయ‌లేక స‌ర్దుకుని ప్రయాణం చేస్తారు. ఇది మ‌న దేశంలో న‌డుస్తున్న రైళ్ల‌లో చాలా మంది ఎదుర్కొంటున్న స‌మ‌స్యే. అయితే స‌రిగ్గా ఇలాంటి స‌మ‌స్య‌నే అత‌ను కూడా ఎదుర్కొన్నాడు. అయితే అత‌ను చూస్తూ ఊరుకోలేదు. రైల్వే శాఖ‌ను కోర్టుకు ఈడ్చాడు. దీంతో కోర్టు రైల్వేకు మొట్టికాయ‌లు వేసింది. బాధిత వ్య‌క్తికి రూ.75వేల న‌ష్ట ప‌రిహారం అందించాలని తీర్పు ఇచ్చింది.

అతని పేరు విజ‌య్‌కుమార్‌. 2013లో ఇత‌ను విశాఖ‌ప‌ట్నం నుంచి న్యూఢిల్లీ ప్ర‌యాణించేందుకు గాను ద‌క్షిణ్ ఎక్స్‌ప్రెస్‌లో టిక్కెట్ బుక్ చేసుకున్నాడు. అత‌నికి మోకాళ్ల నొప్పులు ఉండ‌డంతో లోయ‌ర్ బెర్త్ బుక్ చేశాడు. ఈ క్ర‌మంలో ప్ర‌యాణించే తేదీన ట్రెయిన్ ఎక్కాడు. అంతా సాఫీగానే సాగుతుంది. అయితే మార్గమ‌ధ్య‌లో మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఉన్న బినా అనే స్టేష‌న్ వ‌ద్ద అనుకోకుండా అత‌ని సీట్‌ను ముగ్గురు వ్య‌క్తులు ఆక్ర‌మించారు. వారికి అస‌లు రిజ‌ర్వేష‌న్ కాదు క‌దా, క‌నీసం టిక్కెట్లు కూడా లేవు. ఈ క్ర‌మంలో సీట్ వ‌దిలిపెట్టాల‌ని విజ‌య్ అడగ్గా వారు అందుకు నిరాక‌రించారు. పైగా విజ‌య్‌ను దుర్భాష‌లాడారు.

ఈ క్ర‌మంలో విజ‌య్ టిక్కెట్ క‌లెక్ట‌ర్ కోసం వెళ్లాడు. కానీ అతనికి టీసీ ఎక్క‌డా క‌నిపించ‌లేదు. మళ్లీ వ‌చ్చి వేరే సీట్‌లో కూర్చుని ఎలాగో ప్ర‌యాణం చేశాడు. అయితే ప్ర‌యాణం సాగినంత సేపు సీట్ ఎటూ లేదు, క‌నీసం ప్ర‌శాంతంగా ప‌డుకుందామ‌న్నా ఆ ముగ్గురు వ్య‌క్తులు నిద్ర‌పోనివ్వ‌లేదు. కేవ‌లం విజ‌య్‌నే కాదు, తోటి ప్ర‌యాణికుల‌కు కూడా వారు న్యూసెన్స్ క‌లిగించారు. అయితే ఢిల్లీలో ఎట్ట‌కేల‌కు ట్రెయిన్ దిగిన విజ‌య్ చూస్తూ ఊరుకోలేదు. వెంట‌నే స్థానికంగా ఉన్న వినియోగ‌దారుల ఫోరం కోర్టులో కేసు పెట్టాడు. దీంతో కేసు విచారించిన కోర్టు విజ‌య్‌కు రైల్వే వారు రూ.75వేల నష్ట‌ప‌రిహారం ఇవ్వాల‌ని, అంతేకాకుండా, ఆ ట్రెయిన్‌లో విధులు నిర్వహించాల్సిన టీసీ జీతం నుంచి 3వ వంతు జీతం క‌ట్ చేయాల‌ని కోర్టు ఆదేశించింది. ఇలాంటి చ‌ర్య‌లు పున‌రావృతం కాకుండా చూసుకోవాల‌ని రైల్వే వారికి కోర్టు మొట్టికాయ‌లు వేసింది. టిక్కెట్ బుక్ చేసుకున్న‌వారికి ట్రెయిన్‌లో క‌చ్చితంగా సీట్ ఇవ్వాల్సిందేన‌ని, అలా ఇవ్వ‌క‌పోతే జ‌రిమానా చెల్లించాల్సిందేన‌ని కోర్టు స్ప‌ష్టంగా చెప్పింది..!

Comments

comments

Share this post

scroll to top