బ్రిటిష్ వారు మన దేశాన్ని దాదాపుగా 200 సంవత్సరాల పాటు పాలించారు. భారతీయులను బానిసల కన్నా హీనంగా చూశారు. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలపై దాడి చేశారు. మన దేశంలో ఉన్న ఎన్నో సహజ వనరులను కొల్లగొట్టారు. ముఖ్యంగా ఎంతో విలువైన బంగారు, వజ్రాభరణాలు, మణులను దొంగిలించి బ్రిటన్‌కు తరలించారు. అయితే మన దేశంలో బ్రిటిష్ వారు టచ్ చేయని అలాంటి సంపద ఇంకా 1/3 వ వంతు వరకు ఉంటుందట. అవును, మీరు విన్నది నిజమే. బ్రిటిష్ వారు మన దేశంలోని ఎన్నో విలువైన నిధులను తమ దేశానికి తరలించారు. కానీ వారు తరలించిన మొత్తం సంపద కేవలం 66 శాతమేనట. ఇక్కడ ఇంకా 1/3వ వంతు (33 శాతం) వరకు సంపద మిగిలే ఉందట. దాంతో మన దేశ ప్రజలంతా రాత్రికి రాత్రే కోటీశ్వరులవుతారట. ఆ సంపద విలువ ఎన్నో లక్షల కోట్లు ఉంటుందట. అయితే బ్రిటిష్ వారు ఆ సంపదను దోచుకోకపోవడానికి కారణం.. ఆ సంపద వారి కంట కనబడలేదట. అవును మరి. అందుకే వారికి ఆ సంపద దక్కలేదు. మరి వారికి దొరకని ఆ సంపద వివరాలను ఇప్పుడు తెలుసుకుందామా..!
1. మొఘల్ ట్రెజర్ ఆఫ్ అల్వార్, రాజస్థాన్
మొఘల్ చక్రవర్తి జహంగీర్ రాజ్యాధికారం కోల్పోయినప్పుడు ఢిల్లీకి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్వార్ కోటలో శరణార్థిగా దాక్కున్నాడట. ఆ సమయంలో అతను ఎంతో విలువైన సంపదను ఆ కోటలో దాచాడట. అయితే ఇప్పటి వరకు ఆ నిధి బయట పడలేదు.
2. సోన్భందర్ గుహలు, బీహార్
ఈ గుహలన్నీ కేవలం ఒకే రాయి కింద ఉన్నాయి. ఇవి క్రీస్తు శకం 3 లేదా 4వ శతాబ్దంలో ఏర్పడినట్లు చెబుతారు. ఇక గుహలన్నీ ఒక రక్షణ ద్వారానికి దారి తీస్తాయట. ఆ ద్వారం గుండా ప్రధాన గుహకు దారి ఉంటుందట. అయితే ఆ దారి తెరుచుకోవాలంటే ఆ ద్వారం వద్ద ఉండే సంఖలిపిలో ఉన్న అక్షరాలను చదవాల్సి ఉంటుంది. కానీ ఆ లిపి ఇప్పటికీ ఎవరికీ అర్థం కాలేదు. అయితే ప్రధాన ద్వారం గుండా లోపలికి గనక వెళ్లగలిగితే అందులో బింబిసారుడనే రాజుకి చెందిన లక్షల కోట్ల విలువై సంపద లభిస్తుందట.
3. చార్మినార్ సొరంగం, హైదరాబాద్
హైదరాబాద్‌లో ఉన్న చార్మినార్‌లో ఓ సొరంగం ఉందట. అందులో నుంచి వెళితే నేరుగా గోల్కొండ కోటకు చేరుకోవచ్చని చెబుతారు. అప్పట్లో కులీ కుతుబ్ షా ప్రమాదకర పరిస్థితుల్లో రాజ కుటుంబీకులు తప్పించుకునేందుకు ఈ సొరంగాన్ని నిర్మించాడని చెబుతారు. కానీ అందులో ఎంతో విలువైన నిధిని కూడా అతను దాచాడని ప్రచారంలో ఉంది.
4. మాన్ సింగ్ 1 నిధి, జైపూర్
అక్బర్ రాజ్యానికి సైన్యాధిపతిగా పనిచేసిన మాన్ సింగ్ 1 ఆఫ్గనిస్తాన్‌లో 1580లలో రాజ్యాలను గెలిచాక అక్కడ దోచుకున్న సంపదను అక్బర్‌కు ఇవ్వలేదట. దాన్ని జైపూర్ కోట ఆవరణలో భూగర్భంలో దాచాడని చెబుతారు. అయితే ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు ఆ నిధి కోసం అన్వేషణ కొనసాగించాలని ప్రధాని ఆఫీస్ నుంచి ఆదేశాలు వచ్చాయట.
5. శ్రీ మూకాంబికా ఆలయం, కర్ణాటక
కర్ణాటకలోని కొల్లూర్ వద్ద పర్వత శ్రేణుల కింది భాగంలో ఉన్న శ్రీ మూకాంబికా ఆలయం కింది భాగంలో ఎంతో విలువైన సంపద ఉందట. అయితే ఆ సంపదను కాపాడుతూ ఎప్పుడూ ఓ పాము రక్షణగా ఉంటుందని అక్కడి వారు చెబుతారు.
6. మీర్ ఉస్మాన్ అలీ నిధి, హైదరాబాద్
1937లలో ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన వ్యక్తిగా మీర్ ఉస్మాన్ అలీ పేరుగాంచారట. అందుకు టైమ్ మ్యాగజైన్ కూడా ఓ కథనాన్ని ప్రచురించిందట. ఇతను 1911లో రాజుగా వచ్చాక 37 ఏళ్ల పాటు అంతులేని సంపదను పోగు చేశాడట. కానీ దాని గురించిన వివరాలు మాత్రం ఎవరికీ తెలియవు.
7. శ్రీ పద్మనాభ స్వామి ఆలయం, కేరళ
2001 జూన్ నెలలో కేరళలోని తిరువనంతపురం పద్మనాభ స్వామి ఆలయంలో నేలమాళిగలలో ఉన్న గదులను తెరవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆ గదుల్లో కొన్నింటిని తెరవగా ఎన్నో కోట్ల కోట్ల విలువైన సంపద బయట పడింది. ఆభరణాలు, కిరీటాలు, విగ్రహాలు, ఇతర బంగారు వస్తువులు లభించాయి. ఇక మరో గదిలోనూ 22 బిలియన్ డాలర్ల (2200 కోట్ల డాలర్ల) విలువైన సంపద ఉంటుందని భావిస్తున్నారు. కానీ ఆ గదికి నాగ బంధం ఉన్నందున ఎవరూ ఆ గదిని తెరిచే ధైర్యం చేయడం లేదు. తెరిస్తే ఏదైనా ఉపద్రవం సంభవిస్తుందేమోనని అందరూ భయపడుతున్నారు.
8. కృష్ణా నది నిధి, ఆంధ్రప్రదేశ్
ఒకప్పుడు కృష్ణా, గోదావరి జిల్లాలు కూడా గోల్కొండ సామ్రాజ్యంలో అంతర్భాగాలుగా ఉండేవి. అప్పట్లో ఆ నదుల తీరాల్లో వజ్రాలు దొరికేవట. ఇప్పటికీ అలా వజ్రాలు దొరికే ప్రాంతాలు ఆ నదీ తీరాల్లో కొన్ని ఉన్నాయని చెబుతారు.
9. రెక్ ఆఫ్ ది గ్రోస్వెనార్
1782వ సంవత్సరంలో మద్రాస్ నుంచి గ్రోస్వెనార్ అనే పేరున్న ఓ షిప్ ఇంగ్లండ్‌కు బయల్దేరింది. అందులో 26 లక్షల బంగారు పగోడా నాణేలు, 1400 బంగారు దిమ్మలు, వజ్రాలు, పచ్చలు, కెంపులు, నీలం మణులు ఉన్న 19 పెట్టెలు ఉన్నాయట. అయితే మార్గమధ్యలో ఆ షిప్ సౌతాఫ్రికాలోని కేప్‌టౌన్‌కు 700 మైళ్ల దూరంలో సముద్రంలో మునిగిపోయింది. ఆగస్టు 4, 1782వ తేదీన షిప్ మునగగా అందులోని కొంత సంపదను వెలికి తీశారు. కానీ ఇంకా పెద్ద మొత్తంలో సంపద మాత్రం సముద్రంలోనే ఉందట.
10. నాదిర్ షా నిధి
పర్షియా రాజు నాదిర్ షా 1739వ సంవత్సరంలో తన 50వేల మంది సైనికులతో ఢిల్లీపై దాడి చేశాడు. అనంతరం ఆ రాజ్యంలో ఉన్న సంపదను దోచుకున్నాడు. ఆ దాడిలో 30వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఆ ప్రజలకు చెందిన నెమలి సింహాసనం, రాజు ఆభరణాలు తదితర విలువైన వస్తువులను నాదిర్ షా దొంగిలించాడు. అయితే హిందు కుష్ పర్వతాల్లో నాదిర్ షాపై గుర్తు తెలియని వారు అటాక్ చేసి అతని వద్ద ఉన్న సంపదను దోచుకున్నారు. అతన్ని హత్య చేశారు. అయితే ప్రస్తుతం సదరు నెమలి సింహాసనం మాత్రం ఇరాన్లో ఉంది.