ప్రస్తుతం ఇన్స్టాంట్ మెసెంజర్ల యుగం నడుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ఆయా ఇన్స్టాంట్ మెసెంజర్ కంపెనీలు కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. పోటీ పెరగడంతో వైవిధ్యభరితమైన ఫీచర్లను స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు అందించేందుకు ఆయా కంపెనీలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫేస్బుక్ మెసెంజర్ కూడా ఓ సరికొత్త గేమ్‌తో యూజర్లను ఆకట్టుకుంటోంది. అదేంటి? ఫేస్బుక్ మెసెంజర్లో గేమ్ ఎలా ఉంటుంది? అని ఆశ్చర్యపోతున్నారా? అయితే అలా అవడం మానేసి, ఆ గేమ్‌ను ఎలా ఆడాలో ఇప్పుడు తెలుసుకోండి.

ముందుగా ఫేస్బుక్ మెసెంజర్‌లోకి వెళ్లి ఆన్లైన్లో ఉన్న మీ స్నేహితుడితో కొత్త చాట్ ప్రారంభించండి. అయితే ఇద్దరూ ఆన్లైన్లో ఉంటేనే ఈ గేమ్ ఆడేందుకు సాధ్యపడుతుంది సుమా! చాట్ ఓపెన్ చేశాక ఎమోజీలలోకి వెళ్లి వాటిలో ఉండే బాస్కెట్‌బాల్ ఎమోజీని ఎంపిక చేసుకుని దాన్ని మీ స్నేహితునికి పంపండి. దీంతో వెంటనే బాస్కెట్‌బాల్ గేమ్ ప్రారంభం అయినట్టుగా ఒక మెసేజ్ చాట్ విండోలో దర్శనమిస్తుంది.

అవతల లైన్లో ఉన్న మీ ఫ్రెండ్ ఆ బాల్‌ను ట్యాప్ చేస్తే చాలు గేమ్ షురూ అవుతుంది. అయితే సాధారణ బాస్కెట్‌బాల్‌లో లాగే ఇందులోనూ బంతిని బాస్కెట్లోకి పడేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక కమాండ్లను ఎంటర్ చేయాలి.
ఈ క్రమంలోనే స్కోర్ పెరుగుతూ ఉంటుంది. అంతేకాదు, లెవల్స్ కూడా మారుతుంటాయి. లెవల్ పెరిగిన కొద్దీ గేమ్ ఆడడం మరింత కష్టతరమవుతుంది. ఇలా మీ స్నేహితులతో పోటీ పడుతూ వారి స్కోర్ కన్నా ఎక్కువ చేస్తే చాలు, మీరు గేమ్‌లో విన్ అయినట్టే.