త్వ‌ర‌లో ఆలిండియా రేడియో యాప్‌లోనూ క్రికెట్ కామెంట‌రీ విన‌వ‌చ్చు..!

ఇప్పుడంటే స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు రాబ‌ట్టి క్రికెట్ అభిమానులు ప్ర‌పంచంలో ఎక్క‌డ ఉన్నా ఆన్‌లైన్ స్ట్రీమింగ్‌లో క్రికెట్ మ్యాచ్‌ల‌ను చూస్తున్నారు. కానీ ఒక‌ప్పుడు అలా కాదుగా. చూస్తే టీవీలోనే. లేదంటే ఇక రేడియోనే గ‌తి. దీంతో అప్ప‌ట్లో ఒక చిన్న రేడియో దొరికినా చాలు, క్రికెట్ ప్రేమికులంతా సంబ‌ర‌ప‌డిపోతూ కామెంటరీని ఆస‌క్తిగా వినేవారు. బ్యాట్స్‌మెన్ సిక్స్ కొట్టినా, బంతిని బౌండ‌రీ దాటించినా చ‌ప్ప‌ట్లు కొట్టేవారు. ఈల‌లు వేసే వారు. ఔట్ అయితే అయ్యో… అని విచారం వ్యక్తం చేసే వారు. అయితే ఇప్పుడదే క్రికెట్ కామెంట‌రీ మళ్లీ అభిమానుల కోసం రాబోతోంది.

all-india-radio

అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. 2012-13 సంవత్స‌రంలో భార‌త్ ఆస్ట్రేలియాతో ఓ సిరీస్ ఆడింది. ఆ స‌మ‌యం త‌రువాత నుంచి రేడియోలో క్రికెట్ కామెంట‌రీ రావ‌డం లేదు. ఎందుకంటే బీసీసీఐ, ఆలిండియా రేడియోల మ‌ధ్య ఆదాయంలో వ‌చ్చిన కొన్ని వివాదాలే అందుకు కార‌ణం. అయితే ఇప్పుడు చాలా మంది స్మార్ట్‌ఫోన్లు వాడుతుండ‌డంతో రెండు సంస్థ‌ల ప్ర‌తినిధులు క‌లిసి మ‌ళ్లీ రేడియో కామెంట‌రీని తీసుకొచ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌.

listening-commentary

మొబైల్స్‌లో సాధార‌ణంగా మ‌న‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ఇంట‌ర్నెట్ లేదా యాప్స్ ద్వారా క్రికెట్ స్కోర్స్‌, లైవ్ అప్‌డేట్స్‌, వీడియో స్ట్రీమింగ్ వ‌చ్చేవి క‌దా. అయితే వాటికి తోడు కామెంట‌రీ మాత్ర‌మే కావాల‌నుకునే వారి కోసం బీసీసీఐ, ఆలిండియా రేడియో క‌లిసి ఓ యాప్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్టు తెలిసింది. దీనికి గాను ఆ రెండు సంస్థ‌లు ఇప్ప‌టికే ఓ ప్యానెల్ ఏర్పాటు చేయాల‌ని భావిస్తున్నాయి. అది గ‌న‌క ఓకే అయి యాప్ అందుబాటులోకి వ‌స్తే ఇక క్రికెట్ ప్రేమికుల‌కు పండ‌గే. ఎందుకంటే అటు రేడియోలో, ఇటు యాప్ ద్వారా రెండింటిలోనూ ఎంచ‌క్కా కేవలం క్రికెట్ కామెంట‌రీ విని ఆనందించ‌వ‌చ్చు. చాలా మంది ప‌నిచేస్తూ కూడా కామెంట‌రీ వింటారు క‌దా. అలాంటి వారికి ఇది ఎంత‌గానో ఉప‌యుక్తంగా ఉంటుంది. ఇక యాప్ ఎప్పుడు వ‌స్తుందో వేచి చూడాలి..!

Comments

comments

Share this post

scroll to top