ఐఐటీ.. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. మన దేశంలో ఐఐటీలు పలు ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఉన్నాయి. వీటిల్లో సీట్ రావాలంటే విద్యార్థులు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎంతో కఠినంగా ప్రశ్నలు ఉండే ఎంట్రన్స్ ఎగ్జామ్‌లను క్లియర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఐఐటీల్లో సీటు సంపాదించడం ఒకెత్తయితే వాటిల్లో చేరి కోర్సులను అభ్యసించడం మరొక ఎత్తు. ఎందుకంటే ఐఐటీల్లో సీటు సంపాదించగానే కాదు, అక్కడ ఉండే ఎంతో మంది ప్రతిభావంతమైన విద్యార్థులతో చదువుల్లో పోటీ పడాలి. నిత్యం కొన్ని గంటల పాటు తీవ్రంగా శ్రమించి చదవాల్సి ఉంటుంది. దీనికి తోడు ల్యాబ్ వర్క్‌లు, ప్రాజెక్టులు అదనంగా ఉంటాయి. అన్నింటిలోనూ ఉత్తీర్ణత సాధిస్తూ మంచి మార్కులు తెచ్చుకుంటేనే క్యాంపస్ ప్లేస్మెంట్లలో మంచి ప్యాకేజీతో ఉద్యోగాలు వస్తాయి. ఈ క్రమంలోనే ఇలాంటి అనేక అంశాల్లో ఐఐటీ విద్యార్థులు ఒత్తిడిని ఎదుర్కొంటూ తీవ్రమైన డిప్రెషన్‌కు లోనవుతున్నారట. దీంతో సూసైడ్లు పెరుగుతున్నాయి. ఒక్క ఐఐటీ ఖరగ్‌పూర్‌లోనే గత జనవరి నుంచి ఏప్రిల్ నెలల మధ్యలో ఏకంగా ముగ్గురు విద్యార్థులు డిప్రెషన్‌తో సూసైడ్ చేసుకున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే విద్యార్థులలో పెరుగుతున్న ఈ ధోరణిని తగ్గించేందుకు గాను ఐఐటీ ఖరగ్‌పూర్ అధికారులు ఓ వినూత్న నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేస్తున్నారు. అదేమిటంటే…
క్యాంపస్‌లో రోజూ సాయంత్రం పూట 10 నిమిషాల పాటు పూర్తిగా పవర్ కట్ చేస్తున్నారు. దీంతో విద్యార్థులు ఒంటరిగా ఉండకుండా అందరితోనూ కలసిపోయి తమ సమస్యల గురించి చర్చిస్తారని, తద్వారా డిప్రెషన్ నుంచి కొంత వరకు డైవర్ట్ అయ్యేందుకు అవకాశం కూడా ఉంటుందని వారు అంటున్నారు. ఇక ఆ సమయంలో క్యాంపస్‌లోని ప్రధాన ప్రాంతాల వద్ద లెక్కకు మించిన టీ, కాఫీ మిషన్లను కూడా పెడుతున్నారట. దీంతో టీ, కాఫీ సేవిస్తూ ముచ్చటలాడుకోవచ్చని అధికారుల ప్లాన్. మరి ఈ ప్లాన్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
అయితే ఐఐటీ ఖరగ్‌పూర్ క్యాంపస్‌లో రోజూ అలా పవర్ కట్ చేసే కార్యక్రమంతోపాటు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా షార్ట్ టర్మ్ కోర్సులను కూడా పెట్టనున్నారట. ఓ సంస్థ ఆధ్వర్యంలో వాటిని నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో విద్యార్థులు డిప్రెషన్ నుంచి బయట పడి ఆత్మహత్య చేసుకోకుండా ఉంటారని వారి ప్లాన్. అయినా… విద్యార్థులపై ఒత్తిడి లేకుండా చేయాలి కానీ ఇలాంటి కార్యక్రమాలు చేపడితే ఎంత వరకు సక్సెస్ అవుతాయో వారికే తెలియాలి. ఇప్పటికే కొన్ని ప్రముఖ కాలేజీల్లో ఇలాంటి కోర్సులు ఉన్నాయి. అయినా అవి అంతగా సత్ఫలితాలను ఇచ్చిన దాఖలాలు లేవు. మరి ఐఐటీ ఖరగ్‌పూర్ వారు పెట్టే కోర్సులు ఏ మేరకు ప్రభావం చూపుతాయో వేచి చూస్తే తెలుస్తుంది.