జైలు జీవితాన్ని ప్ర‌త్య‌క్షంగా చూడాల‌ని ఉందా..? అయితే 500/- చెల్లించి ఈ జైలుకు వెళ్లండి.!

జైలు జీవితం ఎలా ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. నిత్యం రొటీన్ అయిన జీవితం. ఒకే గ‌దిలో ఉండ‌డం, తిండి, ప‌ని, నిద్ర‌… నాలుగు గోడ‌ల మ‌ధ్య బందీత‌నం. దీని గురించి ఎవ‌రికీ చెప్పాల్సిన ప‌నిలేదు. కావాల‌ని కూడా ఎవ‌రూ జైలుకు వెళ్లాల‌ని కోరుకోరు. ఏదైనా అనుకోని ప‌రిస్థితుల్లోనో, ఆవేశ పూరితంగానో, యాక్సిడెంట‌ల్‌గానో నేరం చేస్తే త‌ప్ప, ఎవ‌రూ జైలు ముఖం చూడాల‌ని కూడా భావించ‌రు. అయితే తెలంగాణ రాష్ట్రంలోని మెద‌క్ జిల్లాలో ఉన్న సంగారెడ్డి జైలుకు మాత్రం మీరు ఏ నేరం చెయ్య‌కుండానే వెళ్ల‌వ‌చ్చు. ఏంటీ, ఆశ్చ‌ర్యంగా ఉందా..! మేం చెబుతోంది నిజ‌మే..!

jail-life

సంగారెడ్డిలో గ‌త 220 ఏళ్ల కింద నిర్మించిన చారిత్రాత్మ‌క‌మైన జైలు ఉంది. ఇది ఇటీవ‌లే మ్యూజియంగా కొత్త రూపు రేఖ‌లు పొందింది. అయితే ఇందులో భాగంగా సంబంధిత అధికారులు ఒక వినూత్న‌మైన కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. అదేమిటంటే, ఫీల్ ది జెయిల్ పేరిట ఎవ‌రైనా ఈ జైలులో ఉండ‌వ‌చ్చు. అందుకోసం రోజుకు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లించిన వారికి ఖైదీ దుస్తుల‌తోపాటు సాధార‌ణ ఖైదీల‌కు ఇచ్చిన‌ట్టుగానే ఇత‌ర వ‌స్తువులు ఇస్తారు. ఒక రోజు పాటు జైలులో ఖైదీలా గ‌డ‌పాల్సి ఉంటుంది. అయితే సాధార‌ణ ఖైదీలు ప‌నిచేస్తారు క‌నుక సంద‌ర్శ‌కులు కూడా త‌మ‌కు వీలైతే ఏదైనా ప‌నిని చేయ‌వ‌చ్చు. సాధార‌ణంగా ఎవ‌రైనా మొక్క‌లు నాటేందుకు ఆస‌క్తి చూపుతార‌ని జైలు అధికారులు చెబుతున్నారు.

సాధార‌ణ పౌరుల‌కు జైలు జీవితం ఎలా ఉంటుందో ప్ర‌త్య‌క్షంగా చూపాల‌నే ఉద్దేశంతోనే ఇలాంటి కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించామ‌ని స‌ద‌రు జైలు అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు ఎంతో చారిత్రాత్మ‌క నేప‌థ్యం ఉన్న జైలు క‌నుక దాని ప్రాధాన్య‌త‌ను గురించి అందరికీ తెలియ‌జేయాల‌నే ఉద్దేశం కూడా దీని వెనుక ఉంద‌ని అంటున్నారు. ఏది ఏమైనా ఇదొక వినూత్న‌మైన కార్య‌క్ర‌మ‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. జైలు జీవితం ఎలా ఉంటుందో ప్ర‌త్యక్షంగా అనుభ‌వించాల‌నుకునే వారికి ఇలాంటి కార్య‌క్ర‌మాలు ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఇంకెందుకాల‌స్యం, మీక్కూడా ఆ అనుభ‌వం కావాలంటే రూ.500 చెల్లించి ఎంచ‌క్కా ఒక రోజు జైలుకెళ్లి రండి మ‌రి..!

Comments

comments

Share this post

scroll to top