ఈ వెబ్‌సైట్‌లో బైక్‌ల‌ను అద్దెకు ఇస్తారు తెలుసా..? చార్జి ఎంత ఉంటుందంటే..?

ఒక‌ప్పుడు మ‌నం సైకిళ్ల‌ను గంట‌కు రూ.2 ఇచ్చి అద్దెకు తెచ్చుకునే వాళ్లం గుర్తుంది క‌దా. దాంతో కొంద‌రు రోజంతా అలా సైకిళ్ల‌ను తెచ్చుకుని వాటిపై తెగ తిరిగేవారు. అయితే ఇప్పుడు అలా సైకిళ్లు అద్దెకు ఇచ్చే వారు దాదాపుగా క‌నుమ‌రుగ‌య్యార‌నే చెప్ప‌వ‌చ్చు. వాటి స్థానాన్ని కార్లు ఆక్ర‌మించాయి. అయితే కారు అంటే మ‌రీ చార్జి ఎక్కువ అవుతుంది క‌దా. బైక్ అయితే ఓకే..! త‌క్కువ చార్జితోనే బైక్ లేని వారు వాటిని అద్దెకు తెచ్చుకుని తిర‌గ‌వ‌చ్చు. ఇదిగో… స‌రిగ్గా ఇలా ఆలోచించారు కాబ‌ట్టే వారికి ఆ ఐడియా వ‌చ్చింది. ఇప్పుడ‌దే ఐడియా వారి బిజినెస్‌ను ముందుకు తీసుకెళ్తోంది. ఇంత‌కీ వారు ఎవ‌రు..? ఏం చేశారో తెలుసా..?

వారి పేర్లు ప్ర‌ణ‌య్ శ్రీ‌వాస్త‌వ‌, మోక్ష శ్రీ‌వాస్త‌. ఇద్ద‌రూ ఫౌండ‌ర్లుగా మారి వీల్‌స్ట్రీట్ (www.wheelstreet.com) అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ సైట్ ద్వారా బైక్‌ల‌ను అద్దెకు ఇవ్వ‌డం మొద‌లు పెట్టారు. తొలుత ఒక్క‌టిగా ప్రారంభ‌మైన వీరి బ్రాంచ్‌లు ఇప్పుడు దేశంలోని 26 న‌గరాల్లో ఉన్నాయి. హైద‌రాబాద్‌తోపాటు ఢిల్లీ, బెంగుళూరు, కోల్‌క‌తా, చెన్నై వంటి న‌గ‌రాల్లో వీల్ స్ట్రీట్ బైక్ పాయింట్లు ఉన్నాయి. హైద‌రాబాద్‌లో హైటెక్ సిటీ, గచ్చిబౌలి (2), పంజాగుట్ట, ఏఎస్‌రావు నగర్, బంజారాహిల్స్, ఎస్‌ఆర్ నగర్, మాదాపుర్ (2) ల‌లో వీల్ స్ట్రీట్ బైక్ పాయింట్లు ఉన్నాయి. వీటి ద్వారా ఎవ‌రైనా త‌మ‌కు న‌చ్చిన బైక్‌ను అద్దెకు తెచ్చుకోవ‌చ్చు.

వీల్‌స్ట్రీట్ ఏర్పాటు చేసిన ఈ బైక్ పాయింట్ల‌కు వెళ్లి డ్రైవింగ్ లైసెన్స్, ఇత‌ర ప్రూఫ్‌లు చూపి కొంత సొమ్ము చెల్లిస్తే ఎవ‌రికైనా కోరుకున్న బైక్‌ను అద్దెకు ఇస్తారు. బైక్ ను బ‌ట్టి గంట‌కు క‌నీసం రూ.13 ఆపైన చార్జి చేస్తారు. వీరి వ‌ద్ద స్కూటీ పెప్, హోండా యాక్టివా, రాయల్ ఎన్‌ఫీల్డ్, బజాజ్ పల్సర్, టీవీఎస్ అపాచే , నావీ, డ్యూక్, థండర్ బర్డ్, డియో వంటి వివిధ ర‌కాల బైక్‌లు ఉన్నాయి. వీటిలో ఏది కావాల‌న్నా బైక్ పాయింట్ వ‌ద్ద‌కు వెళ్ల‌వ‌చ్చు. లేదంటే ఆన్‌లైన్‌లోనూ బుక్ చేసుకుంటే డెలివ‌రీ ఇస్తారు. అయితే 20 సంవ‌త్స‌రాల‌కు పైబ‌డిన వారికే ఇలా బైక్‌ల‌ను అద్దెకు ఇస్తారు. బైక్‌ను అద్దెకు తీసుకునే స‌మ‌యంలో ఎంత స‌మ‌యం పాటు అద్దెకు కావాలో చెప్పాలి. అదేవిధంగా ఒక వేళ నిర్ణీత స‌మ‌యం క‌న్నా ఎక్కువ సేపు వాడుకుంటే అప్పుడు రిక్వెస్ట్ పంపాల్సి ఉంటుంది. అలా పంప‌క‌పోతే ఎక్కువ చార్జి వేస్తారు.

ప్ర‌ణ‌య్ శ్రీ‌వాస్త‌వ‌, మోక్ష శ్రీ‌వాస్త‌లు స్టార్టప్‌గా ఏర్పాటు చేసిన ఈ సైట్‌కు ఇప్పుడు జ‌నాల్లో మంచి ఆద‌ర‌ణే ల‌భిస్తోంది. లాంగ్ డ్రైవ్‌కు మంచి ల‌గ్జ‌రీ బైక్‌పై వెళ్లాల‌నుకునే వారు ఈ సైట్ ద్వారా బైక్‌ల‌ను అద్దెకు తీసుకుని హాలి డేస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో వీరు త్వ‌ర‌లోనే మ‌రిన్ని న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో త‌మ సేవ‌ల‌ను విస్త‌రించ‌నున్నారు. ఏది ఏమైన‌ప్ప‌టికీ ఒక‌ప్ప‌టి అద్దె సైకిళ్ల‌లా ఇప్పుడీ అద్దె బైక్‌ల ఐడియా బాగుంది క‌దా..!

Comments

comments

Share this post

scroll to top