ఈ నాలుగు ప్ర‌శ్న‌ల‌కు క‌రెక్ట్‌గా జ‌వాబు చెబితే… ఇంట‌ర్వ్యూలో జాబ్ మీదే..!

ఏ రంగానికి చెందిన అభ్య‌ర్థులైనా జాబ్ రావాలంటే క‌చ్చితంగా ఇంట‌ర్వ్యూను ఎదుర్కోవాల్సిందే. అయితే కొంద‌రికి మొద‌టి ప్ర‌య‌త్నంలోనే జాబ్ వ‌స్తుంది. అలాంటి వారు తేలిగ్గా ఇంట‌ర్వ్యూల‌ను క్లియర్ చేసి జాబ్ కొట్టేస్తారు. కానీ కొంద‌రు మాత్రం ఎన్ని ఇంట‌ర్వ్యూల‌కు వెళ్లినా అక్క‌డి వారిని మెప్పించ‌లేక‌పోతారు. అందుకు కార‌ణాలు అనేకం ఉంటాయి. వాటిలో ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం స‌రిగ్గా చెప్ప‌క‌పోవ‌డం కూడా ఒక‌టి. అయితే స‌బ్జెక్ట్‌కు సంబంధించిన ప్ర‌శ్న‌లైతే ఎవ‌రైనా కొంచెం క‌ష్ట‌ప‌డితే ఆన్స‌ర్ చేయ‌వ‌చ్చు. కానీ అలా కాకుండా కొన్ని కామ‌న్ ప్ర‌శ్న‌ల‌కు మాత్రం స‌మాధానాలు చెప్ప‌డంలో చాలా మంది విఫ‌ల‌మ‌వుతుంటారు. ఈ క్ర‌మంలో అలాంటి కామ‌న్ ప్ర‌శ్న‌లు ఏమిటో, వాటికి ఏ జ‌వాబులు చెప్పాలో ఇప్పుడు తెలుసుకుందాం.

job-interview

మీ గురించి చెప్పండి..?
ఇంట‌ర్వ్యూ చేసే వారు ఈ ప్ర‌శ్న వేశారంటే… వారి కంపెనీకి మీరు ఏ ప‌ని చేసి పెడ‌తారు? మీలో ఏమేం నైపుణ్యాలు ఉన్నాయి? వాటిని కంపెనీ కోసం ఎలా ఉప‌యోగిస్తారు? అనే అర్థం. అందుక‌నే ఈ ప్ర‌శ్న వేయ‌గానే మీకున్న నైపుణ్యాల‌ను వివరిస్తూనే వాటిని వారి కంపెనీ కోసం ఎలా ఉప‌యోగిస్తారో, మీరు వారి కంపెనీకి ఏవిధంగా ఉప‌యోగ‌ప‌డ‌తారో చెప్పాలి. దీంతో ఇంట‌ర్వ్యూ చేసే వారు ఇంప్రెస్ అవుతారు.

ఇంత‌కు ముందు చేసిన ఉద్యోగాన్ని ఎందుకు మానేశారు..?
ఇది రోటీన్ ప్ర‌శ్నే. కానీ దీనికి కూడా బాగా ఆలోచించే స‌మాధానం చెప్పాలి. మీరు ఉద్యోగం మాని వేసుంటే మంచి అవ‌కాశం కోస‌మ‌ని చెప్పాలి. అదే మీరు ఉద్యోగం చేస్తూ కూడా ఇంట‌ర్వ్యూకు హాజ‌రైతే కొత్త అవ‌కాశాల కోసం ఎదురు చూస్తున్నాననో, ఉన్న‌త ల‌క్ష్యాల‌కు చేరుకోవాల‌ని ఉంద‌నో లేదంటే మీరు సాధించిన విజ‌యాల‌ను, సాధించ‌బోయే విజ‌యాల‌ను చెప్పాల్సి ఉంటుంది.

మీరెంత జీతం ఆశిస్తున్నారు..?
ఇంట‌ర్వ్యూల‌లో చాలా మంది ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పాలంటే త‌డ‌బ‌డుతుంటారు. కానీ అలా కాకుండా ధైర్యంగా మీకు ఎంత కావాలో చెప్పాల్సిందే. అయితే అలాగ‌ని అత్యాశ‌కు పోయి ఆ స్థాయి క‌న్నా ఎక్కువ జీతం అడ‌గ‌కూడ‌దు. అలాగ‌ని త‌క్కువ కూడా అడ‌గ‌వ‌ద్దు. నెగొషియెబుల్ శాల‌రీ అని చెప్పాలి. లేదంటే ఆ పోస్టుకు ఎంత ఇస్తున్నారో ముందుగానే తెలుసుకుని చెప్ప‌డం ఉత్త‌మం.

మీ భ‌విష్య‌త్ గోల్స్ ఏమిటి..?
ఈ ప్ర‌శ్న‌కు మీరిచ్చే స‌మాధానాన్ని బ‌ట్టి మీరు త‌మ కంపెనీకి స‌రిపోతారా, లేదా అని ఇంట‌ర్వ్యూ చేసే వారు నిర్దారించుకుంటారు. క‌నుక‌, దీనికి ఆలోచించి స‌మాధానం చెప్పాలి. మీకున్న స్కిల్స్‌ను, వాటిని ముందు ముందు పెంచుకోబోతున్నారు, వాటి వ‌ల్ల కంపెనీలో ఎలా రాణిస్తారు, త‌ద్వారా వ‌చ్చే ఫ‌లితాలు, ఉన్న‌త ల‌క్ష్యాలు వంటి వాటిని చెప్పాలి.

పైన చెప్పిన నాలుగు ప్ర‌శ్న‌ల‌కు మేం చెప్పిన విధంగా స‌మాధానాలు ఆలోచించి చెబితే ఇంటర్వ్యూలో మీరే విజేత‌లు. దీంతో జాబ్ కూడా మీ సొంతమ‌వుతుంది.

Comments

comments

Share this post

scroll to top