మనుషులకు అత్యంత విశ్వాసపూరితంగా ఉండే జంతువుల్లో ముఖ్యమైనవి ఏమిటో మీకు తెలుసు కదా..? అవేనండీ, కుక్కలు. అవును, అవే. ఎన్నో వేల సంవత్సరాల నుంచి కుక్కలు మనుషులకు అత్యంత దగ్గరైన స్నేహితుల్లా ఉంటూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే చాలా మంది కుక్కలను పెంచుకునేందుకు కూడా ఆసక్తి చూపుతుంటారు. వాటిలోనూ అనేక రకాల జాతులు కూడా ఉన్నాయి. కేవలం పోలీసు విభాగంలోనే కాదు, మిలటరీలోనూ కుక్కలకు ట్రెయినింగ్ ఇచ్చి వాటితో నిరంతరం పనులు కూడా చేయించుకుంటూ ఉంటారు. బాంబులను పసిగట్టడంలో వీటికి మించినవి మరిక లేవు. అయితే పోలీసు విభాగమైనా, ఆర్మీ అయినా అవీ జీవాలే కదా. వాటికీ వయస్సు అయిపోతుంటుంది కదా. అలాంటప్పుడు వాటిని ఎక్కువ రోజులు పని కోసం వినియోగించుకోలేరు. అలా అని చెప్పి వాటి సంరక్షణ కూడా అధికారులకు కష్టమే. అందుకే ఇప్పుడు వారు ఓ సరికొత్త ఐడియాతో ముందుకు వస్తున్నారు. అదే పెట్ అడాప్టేషన్.
లాబ్రడార్, జర్మన్ షెపర్డ్ వంటి అనేక రకాలైన, వయస్సు మీరిన కుక్కలతోపాటు, ఇతర కుక్కలను అధిక సంఖ్యలో ప్రదర్శనకు ఉంచనున్నారు. అయితే ఈ కుక్కలన్నీ మిలటరీ ట్రెయినింగ్ తీసుకున్నవే. వాటన్నింటినీ న్యూఢిల్లీలోని సాకేత్ అనే ప్రాంతంలో ఉన్న సెలెక్ట్ సిటీ వాక్ మాల్ వద్ద ప్రదర్శించనున్నారు. పెట్ ఫెడ్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నెల 5,6 తేదీల్లో ఈ ప్రదర్శన జరగనుంది.
ఔత్సాహికులు ఎవరైనా అందులో పాల్గొని సదరు మిలటరీ ట్రెయిన్డ్ కుక్కలను అడాప్ట్ చేసుకోవచ్చు. ఆ తేదీల్లో సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు కుక్కలను ప్రదర్శించనున్నారు. అందులో పాల్గొనే ఎవరైనా తమకు నచ్చిన కుక్కలను తీసుకెళ్లవచ్చు. ఇంకెందుకాలస్యం, మీకూ శునకాలంటే ఆసక్తి ఉంటే వెంటనే ఢిల్లీ వెళ్లండి మరి. ఎంచక్కా మిలటరీ ట్రెయిన్డ్ కుక్కలను తెచ్చుకోవచ్చు. ముందే చెప్పాం కదా, బాంబులను అవి సులభంగా పసిగడతాయని, కనుక మీకు ఆ భయం ఉండదు గాక ఉండదు. దీంతోపాటు మీకు, మీ ఇంటికీ చాలా సేఫ్టీ కూడా ఉంటుంది..!
goo.gl/9WT9Gj అనే సైట్ను సందర్శించి వివరాలు నింపితే ఆ ప్రదర్శనలో మీరూ సులభంగా పాల్గొనవచ్చు..!