“నేను గజల్ శ్రీనివాస్ కాదు..” అని పోస్ట్ పెట్టిన ప్రముఖ సింగర్…అసలేమైందో తెలుసా.?

ఓ న్యూస్ వెబ్‌సైట్‌పై చెన్నైకి చెందిన ప్రముఖ గాయకుడు, వ్యాఖ్యాత శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లైంగిక ఆరోపణలతో అరెస్టైన గజల్ గాయకుడు కేసిరాజు శ్రీనివాస్ బదులు తన ఫోటో పెట్టి వార్త రాయడంపై ఆయన మండిపడ్డారు. ఓ జాతీయ స్థాయి మీడియా సంస్థ నిర్వహిస్తున్న సదరు వెబ్‌సైట్లో.. ‘‘గిన్నిస్ వరల్డ్ రికార్డు విజేత గజల్ సింగర్ శ్రీనివాస్ లైంగిక ఆరోపణలతో అరెస్టు’’ అన్న శీర్షికన వార్త ప్రచురించారు. అయితే గజల్ శ్రీనివాస్ ఫోటో బదులు శ్రీనివాస్ ఫోటోను వార్తలో ఉపయోగించారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన సదరు వెబ్‌సైట్‌ను కోర్టుకీడుస్తానంటూ ఫేస్‌బుక్ వేదికగా విరుచుకుపడ్డారు. ‘‘కొన్నేళ్ల క్రితం ప్రముఖ గాయకుడు పీబీ శ్రీనివాస్ చనిపోయినప్పుడు కూడా కొంతమంది పాత్రికేయులు నా బయోడేటాతో వార్తలు రాశారు. ఇప్పుడు ఎవరో సింగర్ శ్రీనివాస్ లైంగిక ఆరోపణల మీద హైదరాబాద్‌లో అరెస్టైతే… దానికి వీళ్లు నా ఫోటో పెట్టి ప్రచురించారు. నా పరువుకు భంగం కలిగించినందుకు ఈ సారి నేను కోర్టుకు వెళ్లాలనుకుంటున్నాను. న్యాయ నిపుణులెవరైనా నాకు సాయం చేయగలరా? ఈ విషయంపై నేను నిజంగా చాలా ఆగ్రహంతో ఉన్నాను…’’ అని ఆయన పోస్టు చేశారు.

ట్విటర్‌లో కూడా ఓ జర్నలిస్టును ఉటంకిస్తూ… ‘‘నా పేరు శ్రీనివాస్… నేను చెన్నైలో ఉంటాను.. ఇదే పేరుతో ఎవరో శ్రీనివాస్ హైదరాబాద్‌లో అరెస్టైతే… మీ వెబ్‌సైట్ నా ఫోటో ప్రచురించింది. ఇందుకు మీరు నాకు క్షమాపణ చెప్పి నష్టపరిహారం చెల్లించాలి..’’ అని పేర్కొన్నారు. కాగా కేసు పెట్టడం వల్ల తనకు ఏం జరగదనీ.. అయితే ఏదో ఒకటి చేయాలి కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నానని శ్రీనివాస్ ఓ మీడియా ప్రతినిధితో పేర్కొన్నారు. ముందు ముందే వార్త రాయాలన్న సెన్సేషలిజం వల్ల చాలా తప్పులు వస్తున్నాయనీ.. దీని స్థానంలో మళ్లీ పాత జర్నలిజంలోని మంచిరోజులు రావాలన్నారు. కాగా శ్రీనివాస్ ఫోటోతో వార్తరాసిన సదరు జాతీయ మీడియా సంస్థ ఆయనకు ఫేస్‌బుక్ వేదికగా క్షమాపణ చెప్పంది. ఆయన ఫోటోతో ఉన్న వార్తను తొలగించింది.

Comments

comments

Share this post

scroll to top