ఇతను మొక్కలను నాటడు.. చెట్లను తరలిస్తాడు.. మరి ఎందుకు అలా చేస్తున్నాడో తెలుసా ??

ఈమధ్యే పద్మశ్రీ పురస్కారం అందుకున్న వనజీవి రామయ్య గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. పుడమి తల్లికి నిత్య పత్రాభిషేకం చేస్తున్న వనపూజారి ఆయన. పచ్చదనం కోసం జీవితాన్నే త్యాగం చేశాడు. రామయ్యలాంటి కమిట్మెంట్ ఎంతమందికి ఉంటంది చెప్పండి. అలాంటివారి కోవలోకే వస్తారు అప్పారి రామచంద్ర. కోటి మొక్కలు నాటిన రామయ్య అభినవ అశోకుడైతే.. అతని అడుగుజాడల్లో నడుస్తున్న రామచంద్ర మరో హరితస్వాప్నికుడు.

హైదరాబాదుకి చెందిన అప్పారి రామచంద్ర మస్తిష్కంలో ఇవే ఆలోచనలు. చేస్తున్న ఉద్యోగం సంతోషాన్నివ్వడం లేదు. కళ్లు మూసినా తెరిచినా చెట్టే కనిపిస్తుంది. వటవృక్షాలు పటపటా నేలరాలిపోతుంటే, మనసు తట్టుకోలేకపోయింది. రోడ్డేయాలంటే అడ్డంగా ఉన్న చెట్టుకుని ఖండఖండాలుగా నరకడమొక్కటే పరిష్కారమా? వందల ఏళ్ల నాటి వృక్షాన్ని మరోచోట నాటలేమా? ఈ ఆలోచనలు రామచంద్రను ఒకపట్టాన ఉండనీయలేదు. ప్రకృతి కోసం, పచ్చదనం కోసం ఉద్యోగాన్ని వదిలేశాడు.

ఏ చెట్లయితే అభివృద్ధికి అడ్డుగా ఉన్నాయని భావిస్తున్నారో, అవే చెట్లకు ప్రాణప్రతిష్ట చేసే మహాయాగాన్ని తలకెత్తుకున్నాడు. గ్రీన్ మార్నింగ్ హార్టికల్చర్ సర్వీసెస్ ప్రై. లిమిటెడ్ పేరుతో వటవృక్షాలను ఒడుపుగా పట్టుకుని మళ్లీ నేలతల్లి ఒడిలో నిలబెడుతున్నాడు.

ఈజిప్టులో ఈ తరహా ఉద్యమం ఏనాడో వచ్చింది. రామచంద్ర లాంటి పర్యావరణ ప్రేమికుల పుణ్యమాని మన దగ్గర కూడా ఇప్పుడిప్పుడే రీప్లాంటేషన్లో చైతన్యం వస్తోంది. ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ ఉద్యోగాన్నే వదిలేశాడంటే అతని సంకల్పం ఎంత గొప్పగా నాటుకుందో అర్ధం చేసుకోవచ్చు. ఆస్ట్రేలియాలో చెట్లను ఒకచోటి నుంచి మరోచోటికి తరలించి ఎలా పున:ప్రతిష్టిస్తారో ఒక స్నేహితుడి ద్వారా తెలుసుకుని, గ్రీన్ మార్నింగ్ సంస్థను నెలకొల్పాడు.

ఒక్క హైదరాబాద్ చుట్టుపక్కలే కాదు.. గుజరాత్, బెంగళూరులోని కొన్నిప్రాంతాల్లో కూడా ట్రీ ట్రాన్స్ లొకేషన్ చేశారు. మెట్రోతో కలుపుకుని ఇప్పటిదాకా సుమారు 5వేల చెట్లదాకా పున:ప్రతిష్ట చేశారు. అందులో సక్సెస్ రేట్ 80 శాతం ఉంది. అనుకున్నంత వేగంగా జరిగే ప్రక్రియ కాదు కాబట్టి, కొద్దిగా సమయం పడుతుందంటారు రామచంద్ర.

Comments

comments

Share this post

scroll to top