మోసం చేయాల‌ని చూసిన పెద్ద పెద్ద సంస్థ‌ల‌కు దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చిన సామాన్యులు.!

ఒక‌ప్పుడంటే వ్యాపారులు, కంపెనీలు, బ్యాంకులు, దుకాణాలు, మాల్స్‌… ఇలా ఏ రంగానికి చెందిన వారు అయినా మోసం చేస్తే ఎవ‌రికి ఫిర్యాదు చేయాలో ప్ర‌జ‌ల‌కు తెలిసేది కాదు. వినియోగ‌దారుల ఫోరం అంటూ ఒక‌టి ఉంటుంద‌ని, వారికి కంప్లెయింట్ ఇస్తే స‌మ‌స్య‌కు పరిష్కారం ల‌భిస్తుంద‌ని చాలా మందికి తెలియ‌దు. దీంతో ఏదైనా ఇబ్బంది వ‌స్తే ఎవ‌రైనా చూసీ చూడ‌న‌ట్టు ఉండేవారు. ఏ ఒక్క‌రో ఇద్ద‌రో వినియోగ‌దారుల ఫోరంలో కంప్లెయింట్ చేసి త‌మ స‌మ‌స్య‌ల‌ను తొల‌గించుకునేవారు. అయితే ఇప్పుడ‌లా కాదు. కాలం మారింది. అర‌చేతిలో ప్ర‌పంచాన్ని చూపే టెక్నాల‌జీ అందుబాటులోకి వ‌చ్చింది. దీంతో ఆన్‌లైన్ ద్వారానే ప్ర‌జ‌లు ఎప్పుడైనా, ఎక్క‌డైనా త‌మ‌కు క‌లిగిన ఇబ్బందుల‌పై, జ‌రిగిన మోసాల‌పై చాలా సుల‌భంగా ఫిర్యాదు చేసేందుకు వీలు క‌లిగింది. ఈ క్ర‌మంలోనే హైద‌రాబాదీ ప్ర‌జ‌లు అలా వినియోగ‌దారుల ఫోరంలో ఫిర్యాదులు చేయ‌డంలో ముందున్నారు. అందుకు తాజాగా వారు సాధించిన ఈ 5 విజ‌యాలే కార‌ణం…

1. ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ఓ వ్య‌క్తి ఇటీవ‌లే చార్జ‌ర్ కొనుగోలు చేయ‌గా, ఆ చార్జ‌ర్‌తో ఫోన్‌కు చార్జింగ్ పెడితే ఆ ఫోన్ పేలి పోయింది. ఈ క్ర‌మంలో ఆ వ్య‌క్తి ఫ్లిప్‌కార్ట్‌ను సంప్ర‌దించినా ఫ‌లితం లేదు. దీంతో అత‌ను వినియోగ‌దారుల ఫోరంలో ఫిర్యాదు చేసి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకున్నాడు. పేలిన ఫోన్‌ ఖ‌రీదు రూ.15వేలను ఇవ్వ‌డంతోపాటు కొత్త చార్జ‌ర్‌ను కూడా ఫ్లిప్‌కార్ట్ అత‌నికి ఇవ్వాల‌ని వినియోగారుల ఫోరం తీర్పు చెప్పింది.

2. షా గౌస్ అనే రెస్టారెంట్‌లో ఓ వ్య‌క్తి కూల్‌డ్రింక్‌ను కొన‌గా అందుకు ఆ రెస్టారెంట్ వారు రూ.4 ఎక్కువ చార్జిని కూల్ డ్రింక్‌కు వసూలు చేశారు. దీంతో ఆ వ్య‌క్తి వినియోగ‌దారుల ఫోరంను ఆశ్ర‌యించాడు. ఈ క్ర‌మంలో ఫోరం ఆ రెస్టారెంట్‌కు రూ.10వేల ఫైన్ వేసింది.

3. ఆరోగ్య‌శ్రీ కింద ఓ వ్య‌క్తికి ఉచితంగా చికిత్స చేయాల్సిన హాస్పిట‌ల్ అలా చేయకుండా రోగి నుంచి పెద్ద మొత్తంలో డ‌బ్బులు వ‌సూలు చేసింది. దీంతో ఆ వ్య‌క్తి ఫోరంను ఆశ్ర‌యించాడు. ఈ క్ర‌మంలో ఆ వ్య‌క్తికి రూ.75వేల న‌ష్ట ప‌రిహారం చెల్లించాల‌ని, అత‌ని వైద్యానికైన ఖ‌ర్చుల‌ను భ‌రించాల‌ని ఫోరం హాస్పిట‌ల్ ను ఆదేశించింది.

4. మొన్నా మ‌ధ్యే 64 ఏళ్ల ఓ వృద్ధుడు త‌న‌కు టీఎస్ఆర్‌టీసీలో సీనియ‌ర్ సిటిజెన్ సీటు ఇప్పించ‌నందుకు గాను ఆర్టీసీపై ఫిర్యాదు చేయ‌గా, ఆ వ్య‌క్తికి రూ.10వేల న‌ష్ట ప‌రిహారం చెల్లించాల‌ని ఫోరం ఆర్టీసీని ఆదేశించింది. అంతేకాదు, బ‌స్సుల్లో సీనియ‌ర్ సిటిజెన్ సీట్ల‌ను క‌చ్చితంగా వారికే కేటాయించాల‌ని ఆర్‌టీసీకి ఆదేశాలు జారీ చేసింది.

5. ఇటీవ‌లే ఓ వ్య‌క్తి త‌న కారు లోన్ మొత్తాన్ని చెల్లిస్తానంటూ ఓ ఫైనాన్స్ సంస్థకు విన్నపం పెట్టుకున్నాడు. త‌న‌కు మ‌రోచాన్స్ ఇవ్వాల‌ని లెట‌ర్‌లో కోరాడు. అయినా ఆ ఫైనాన్స్ సంస్థ విన‌లేదు. ఆ వ్య‌క్తికి ఎలాంటి నోటీస్ ఇవ్వ‌కుండానే అత‌ని కారును విక్ర‌యించింది. దీంతో ఆ వ్య‌క్తి వినియోగ‌దారుల ఫోరం ను ఆశ్ర‌యించ‌గా, ఫోరం ఆ ఫైనాన్స్ సంస్థ‌కు జ‌రిమానా వేసింది. రూ.50వేల న‌ష్ట ప‌రిహారంతోపాటు ఆ వ్య‌క్తికి అయిన రూ.5వేల కోర్టు ఖ‌ర్చుల‌ను కూడా క‌ట్టాల‌ని ఫోరం ఫైనాన్స్ సంస్థ‌కు ఆదేశ‌మిచ్చింది.

పైన చెప్పిన సంఘ‌ట‌న‌లు ఈ మ‌ధ్య కాలంలో జ‌రిగిన‌వే. వినియోగ‌దారులు ఒక‌ప్ప‌టిలా లేరు, న‌ష్టం చిన్న‌దైనా, పెద్ద‌దైనా ఫిర్యాదు చేసేందుకు వెనుకాడ‌డం లేదు… అనేది చెప్పేందుకు ఇవి జ‌స్ట్ చిన్న ఉదాహ‌ర‌ణ‌లు మాత్ర‌మే. మీకు కూడా ఏ చిన్న స‌మ‌స్య వ‌చ్చినా నిర్మొహ‌మాటంగా ఫిర్యాదు చేయండి. మీ హ‌క్కుల‌ను మీరు తెలుసుకోండి.

Comments

comments

Share this post

scroll to top