“హైదరాబాద్” కు ప్రపంచవ్యాప్తంగా 139 వ రాంక్!.. భారత దేశంలో నెం. “1”.. ఇంతకీ ఎందులో?

ఢిల్లీ, బెంగుళూరు, ముంబై, కోల్‌క‌తా, చెన్నై… ఇవ‌న్నీ మ‌న దేశంలో ఉన్న మెట్రోపాలిట‌న్ న‌గ‌రాలు. వాటిలో మ‌న హైద‌రాబాద్ కూడా ఒక‌టి. అయితే మీకు తెలుసా..? మ‌న దేశంలో ఉన్న మ‌హా న‌గ‌రాల‌న్నింటిలోనూ ప్ర‌జ‌లు నివాసం ఉండేందుకు అత్యంత అనుకూలంగా ఉన్న న‌గ‌రం ఏదో..? అదేనండీ… మన భాగ్య‌న‌గ‌ర‌మే ఆ ఖ్యాతిని ద‌క్కించుకుంది. దేశ రాజ‌ధాని ఢిల్లీ, వాణిజ్య రాజ‌ధానిగా పిల‌వ‌బ‌డే ముంబైల‌ని కూడా కాద‌ని, ఆ పేరును మ‌న హైద‌రాబాద్ న‌గ‌రానికి క‌ట్ట‌బెట్టింది ఓ సంస్థ‌.

న్యూయార్క్‌కు చెందిన మెర్స‌ర్ అనే సంస్థ ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న న‌గ‌రాల‌ల్లో ల‌భిస్తున్న ర‌వాణా, విద్యా వ్య‌వ‌స్థ‌, మౌలిక వ‌స‌తులు, వైద్యం, తాగునీరు, శాంతి భ‌ద్ర‌త‌లు వంటి అనేక అంశాల‌ను ప‌రిశోధిస్తుంది. చివ‌ర‌కు ఆ అంశాల‌న్నింటినీ ప్రాతిప‌దిక‌గా చేసుకుని ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న న‌గరాల‌కు ర్యాంకింగ్‌లు ఇస్తుంది. అలా ఆ సంస్థ గ‌త 18 సంవ‌త్స‌రాలుగా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న న‌గ‌రాల‌కు ర్యాంక్‌లు ఇస్తూ వ‌స్తోంది. అయితే ఈ ఏడాది కూడా ఆ సంస్థ‌కు చెందిన లిస్ట్ విడుద‌లైంది. అందులో మ‌న హైద‌రాబాద్ న‌గ‌రానికి ప్ర‌పంచ వ్యాప్తంగా 139వ ర్యాంక్ వ‌చ్చింది. కానీ మ‌న దేశవ్యాప్తంగా చూసుకుంటే మాత్రం ఆ సంస్థ హైద‌రాబాద్‌కు నంబ‌ర్ వ‌న్ స్థానాన్ని క‌ట్ట‌బెట్టింది. ఇక్క‌డ ల‌భిస్తున్న అన్ని స‌దుపాయాలు దేశంలో ఏ ఇత‌ర న‌గ‌రంలోనూ లేవ‌ని తేల్చి చెప్పింది. మ‌న దేశంలో ప్ర‌జ‌లు నివాసం ఉండేందుకు అత్యంత అనువైన న‌గ‌రంగా హైద‌రాబాద్‌ను పేర్కొంది. ఆ త‌రువాతి స్థానాల్లో వ‌రుస‌గా పూణె, బెంగుళూరులు నిలిచాయి.

ఇక ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉత్త‌మ సిటీల్లో చూసుకుంటే మొద‌టి స్థానాన్ని వియన్నా కైవ‌సం చేసుకుంది. ఆ త‌రువాతి స్థానాల్లో జ్యురిచ్‌, మ్యునిచ్‌, ఫ్రాంక్‌ఫ‌ర్ట్‌, జెనీవా, కోపెన్‌హాగ‌న్‌లు నిలిచాయి. ఇవ‌న్నీ యురోపియ‌న్ న‌గ‌రాలు. నాన్ యురోపియ‌న్ న‌గ‌రాల్లో టాప్ 10 స్థానాల్లో ఉన్న‌వి రెండే రెండు న‌గ‌రాలు. అవి ఆక్‌లాండ్‌, వాంకోవ‌ర్ సిటీలు. ఈ క్ర‌మంలో వియ‌న్నా వ‌రుస‌గా 8వ ఏడాది కూడా మొద‌టి స్థానాన్ని కైవ‌సం చేసుకోగా, మ‌న దేశ వ్యాప్తంగా హైద‌రాబాద్ 3వ సారి అత్యుత్త‌మ న‌గ‌రంగా నిలిచింది. ఏది ఏమైనా… షాన్ హై హ‌మారా హైద‌రాబాద్‌..!

Comments

comments

Share this post

scroll to top