దేశంలో రక్షణ పరంగా హైద‌రాబాదే బెట‌రంటున్న ఐటీ కంపెనీలు… ఇదిగో లెక్కలు.

అనేక జాతీయ‌, అంత‌ర్జాతీయ ఐటీ, కార్పొరేట్ సంస్థ‌ల‌కు నెల‌వు… ఐటీ రంగంలో దేశంలోనే టాప్ పొజిష‌న్‌లో కొన‌సాగుతున్న మ‌హా న‌గరం… అదేనండీ బెంగళూరు… ఐటీ సిటీగా పేరు గాంచింది. అభివృద్ధిలో అన్ని మెట్రో న‌గ‌రాల‌తోనూ శ‌ర‌వేగంగా దూసుకెళ్తోంది. కానీ అభివృద్ధే కాదు, ఇంకో విష‌యంలోనూ బెంగళూరు అప్ర‌తిహ‌తంగా ముందుకు వెళ్తూనే ఉంది. అదే… నేరాల్లో..! బెంగ‌ళూరు న‌గ‌రంలో గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా నేరాల సంఖ్య పెరిగింద‌ట‌. అన్ని త‌ర‌హా నేరాల్లోనూ ఇప్పుడు బెంగళూరు దేశంలోనే టాప్ 3 పొజిషన్‌లో ఉంద‌ట‌.

bangalore

నేష‌న‌ల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) వారి నివేదిక ప్ర‌కారం గ‌త 2015వ సంవ‌త్సరంలో దేశంలో అత్యధికంగా నేరాలు జ‌రిగిన మెట్రో న‌గ‌రాలుగా న్యూ ఢిల్లీ, ముంబైలు మొద‌టి రెండు స్థానాల్లో నిలిచాయి. 1.73 ల‌క్ష‌ల నేరాల‌తో ఢిల్లీ మొద‌టి స్థానంలో ఉండ‌గా, 42,940 నేరాలతో ముంబై రెండో స్థానంలో నిలిచింది. వీటి త‌రువాత ఆశ్చ‌ర్య‌క‌రంగా బెంగ‌ళూరు న‌గ‌రం నిలవ‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురి చేస్తోంది. 2015వ సంవ‌త్స‌రంలో బెంగుళూరులో రికార్డు స్థాయిలో 35,576 నేరాలు జ‌రిగాయ‌ట‌. ఇవి అంత‌కు ముందు ఏడాది జ‌రిగిన నేరాలతో పోలిస్తే చాలా ఎక్కువేన‌ట‌.

బెంగళూరు న‌గ‌రం దొంగ‌త‌నాల‌కు 4వ స్థానంలో, హ‌త్య‌ల‌కు 3వ స్థానంలో, కిడ్నాప్‌లు, విడాకుల హ‌త్య‌లు, అల్ల‌ర్ల‌కు రెండో స్థానంలో, అట్రాసిటీలు, విడాకుల కేసుల‌కు మొద‌టి స్థానంలో ఉంద‌ట‌. తాజాగా కావేరీ జలాల వివాదంలో త‌మిళ‌నాడుకు, క‌ర్ణాట‌క‌కు మ‌ధ్య జ‌రుగుతున్న ర‌చ్చ‌లో బెంగళూరు న‌గ‌రంలో ఎంత‌టి తీవ్ర‌మైన అల‌ర్లు జ‌రుగుతున్నాయో అంద‌రికీ తెలిసిందే. ఈ అల్ల‌ర్లు ఆ న‌గ‌రంలో ఉన్న నేర తీవ్ర‌త‌కు ప్ర‌త్య‌క్ష సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. రాను రాను బెంగ‌ళూరు న‌గ‌రంలో నేరాల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని కూడా స‌ర్వేలు చెబుతున్నాయి. ఈ క్ర‌మంలో ప‌లు ఐటీ దిగ్గ‌జ సంస్థ‌లు బెంగళూరును విడిచి హైద‌రాబాద్‌కు మ‌కాం మార్చాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం. ఇన్ఫోసిస్ చైర్మ‌న్ నారాయ‌ణ మూర్తి ఇటీవ‌ల జ‌రుగుతున్నబెంగ‌ళూరు అల్ల‌ర్ల‌ను దృష్టిలో ఉంచుకుని ప‌లు వ్యాఖ్య‌లు కూడా చేశారు. తెలంగాణ మూమెంట్ ఉన్న‌ప్పుడు హైద‌రాబాద్‌లో త‌మ సంస్థ కార్య‌క‌లాపాల‌కు ఏ ఒక్క రోజు కూడా విఘాతం క‌ల‌గ‌లేద‌ని, కానీ ఇప్ప‌టి అల్ల‌ర్ల వ‌ల్ల బెంగ‌ళూరులో తాము 3 రోజులుగా కార్య‌క‌లాపాల‌ను నిలిపి వేశామ‌ని, హైద‌రాబాద్‌లో త‌మ సంస్థ‌ను మ‌రింత విస్త‌రిస్తామ‌ని అన్నారు. ఈ ఒక్క‌రి వ్యాఖ్య‌లు చాలు ప్ర‌స్తుతం బెంగ‌ళూరులో ఎంత‌టి అనిశ్చితి ఉందో తెలియ‌జేయ‌డానికి, అక్క‌డ ఎంత‌టి ర‌క్ష‌ణ ఉందో చెప్ప‌డానికి.

hyderabad

ఇంత‌కీ మ‌న హైద‌రాబాద్ న‌గ‌రం ఎన్‌సీఆర్‌బీ లెక్క‌ల జాబితాలో ఏ స్థానంలో ఉందో తెలుసా..? 5వ స్థానంలో ఉంది. 23,990 నేరాల‌తో కోల్‌క‌తా 4వ స్థానంలో ఉండ‌గా, 16,965 నేరాలతో హైద‌రాబాద్ 5వ స్థానంలో ఉంది. అనంత‌రం స్థానాన్ని 13,422 నేరాల‌తో చెన్నై సాధించింది. ఈ క్ర‌మంలో దేశంలో అత్యంత సుర‌క్షిత‌మైన మ‌హాన‌గ‌రాల జాబితాలో చెన్నై మొద‌టి స్థానంలో ఉండ‌గా, హైద‌రాబాద్ రెండో స్థానంలో నిలిచింది. దీన్ని దృష్టిలో ఉంచుకునే చాలా కంపెనీలు కూడా హైద‌రాబాద్‌కు క్యూ క‌డుతుండ‌డం విశేషం. ఎంతైనా, మ‌న హైద‌రాబాద్ క‌దా..!

Comments

comments

Share this post

scroll to top