రిల‌య‌న్స్ జియో 4-G సిమ్ లన్నీ ఎక్క‌డున్నాయి..? Jio కావాల‌నే లేట్ చేస్తోందా..?

రిల‌య‌న్స్ జియో… 4జీ ప్ర‌పంచంలో ఇప్పుడిదొక ప్ర‌భంజ‌నంలా మారింది. అనేక మంది యూజ‌ర్లు తమ 3జీ ఫోన్ల‌ను తీసేసి 4జీ ఫోన్ల‌కు మారుతుంటే, 4జీ ఇప్ప‌టికే ఉన్న వారు జియో సిమ్స్ కోసం ఎగ‌బ‌డుతున్నారు. అందుకు కార‌ణాలు కూడా అంద‌రికీ తెలిసిందే. ప్రారంభ ఆఫ‌ర్‌గా 3 నెల‌ల పాటు ఉచిత ఇంట‌ర్నెట్‌, కాల్స్‌, ఎస్ఎంఎస్‌, రోమింగ్ వంటి స‌దుపాయాల‌ను అందిస్తుండ‌డం, అనంత‌రం రానున్న టారిఫ్ ప్లాన్లు కూడా న‌చ్చడంతో అనేక మంది ఇప్పుడు రిల‌య‌న్స్ జియో వైపు ప‌రుగులు పెడుతున్నారు. అయితే వినియోగ‌దారులు ప‌రుగులు పెడుతున్న స్పీడ్‌తో జియో సిమ్స్ మాత్రం మార్కెట్‌లోకి రావ‌డం లేదు. ఎందుకిలా జ‌రుగుతోంది..? కొన్ని వేల కోట్ల రూపాయ‌లు వెచ్చించి జియో 4జీ పెట్టిన వారు కేవ‌లం సిమ్ కార్డుల‌ను మాత్రం వేగంగా ఎందుకు అందించ‌లేక‌పోతున్నారు..? కావాల‌నే సిమ్ కార్డుల‌ను జియో ఆపుతుందా..? లేదంటే దీని వెనుక ఇంకేదైనా కార‌ణం ఉందా..?

jio-sim

ఏ టెలిఫోన్ ఆప‌రేట‌ర్ అయినా సిమ్‌ల‌ను త‌యారు చేయ‌డం, వాటిని వినియోగ‌దారుల‌కు అందించ‌డం మంచి నీళ్లు తాగినంత ప‌నే అని చెప్పుకోవ‌చ్చు. ఎందుకంటే క‌నీసం ఒక ఇంచ్ సైజ్ కూడా ఉండ‌ని చిన్న సిమ్ కార్డుల‌ను త‌యారు చేసేందుకు జియో అంత‌టి భారీ కంపెనీల‌కు అంత ఎక్కువ స‌మ‌యం అయితే ప‌ట్ట‌దు. వేగంగానే సిమ్ కార్డుల‌ను త‌యారు చేయ‌వ‌చ్చు. అయితే అవి వినియోగ‌దారుల‌కు మాత్రం చేర‌డం లేదు. అందుకు ప్ర‌ధాన కార‌ణాలు ఏమిటంటే…

రిల‌య‌న్స్ జియో 4జీ సిమ్‌ల‌ను ఇప్ప‌టికే చాలా మంది వినియోగ‌దారులు సొంతం చేసుకున్నారు. ఈ క్ర‌మంలో అంత పెద్ద మొత్తంలో తీసుకున్న సిమ్‌ల‌ను యాక్టివేట్ చేయ‌డం జియో సిబ్బందికి త‌ల‌కు మించిన భారంగా మారింది. ఆధార్ కార్డు ఒక‌టి ఉంటే చాలు, కేవ‌లం 15 నిమిషాల్లోనే సిమ్ యాక్టివేట్ అవుతుంద‌ని జియో చెబుతున్నా, వాస్త‌వానికి ప‌రిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గ‌త వారం కింద‌ట జియో సిమ్స్ తీసుకున్న చాలా మందికి ఇప్ప‌టికీ ఆ సిమ్స్ యాక్టివేట్ కాలేదు. ప‌లు సాంకేతిక కార‌ణాల వ‌ల్లే సిమ్స్ యాక్టివేష‌న్ నెమ్మ‌దిగా జ‌రుగుతుంద‌ని తెలిసింది. ఈ క్ర‌మంలోనే జియో కొత్త సిమ్ కార్డుల‌ను విడుద‌ల చేసేందుకు కొంత ఆల‌స్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తోంది.

jio-sim

ఇక జియో సిమ్ కార్డులు మార్కెట్‌లో ల‌భించ‌క‌పోవ‌డానికి మ‌రో కారణం, ఇంట‌ర్ క‌నెక్టివిటీ. జియో సిమ్ ఫోన్ నంబ‌ర్ల నుంచి చేసే కాల్స్ ఇత‌ర నెట్‌వ‌ర్క్‌ల‌కు క‌ల‌వ‌డం లేద‌ని పెద్ద‌ ఎత్తున వినిపిస్తోంది. నిజానికి బ‌య‌టి ప‌రిస్థితి అలాగే ఉంది. ఇత‌ర నెట్‌వ‌ర్క్ ఆప‌రేట‌ర్లు, జియో మ‌ధ్య ఇంట‌ర్ క‌నెక్టివిటీ ఇష్యూ స‌మసిపోతే త‌ప్ప కాల్స్ క‌నెక్ట్ అయ్యే అవ‌కాశం లేదు. దీని వ‌ల్ల ఇప్ప‌టికే చాలా మంది జియో యూజ‌ర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో కొత్త వారికి సిమ్ కార్డుల‌ను ఇస్తే స‌మ‌స్య మ‌రింత పెద్ద‌దిగా మారి మొద‌టికే మోసం వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని, అది త‌మ నెట్‌వ‌ర్క్ పురోగ‌తికి ఆటంకంగా మారుతుంద‌ని జియో భావిస్తున్న‌ట్టు స‌మాచారం. అందుకే సిమ్ కార్డుల జారీ ప్ర‌క్రియ‌ను కొద్దిగా ఆల‌స్యం చేస్తున్న‌ట్టు తెలిసింది.

చివ‌రిగా జియో సిమ్‌లు ల‌భించ‌క‌పోవ‌డానికి ఇంకో బ‌ల‌మైన కార‌ణ‌మేమిటంటే బ్లాక్ దందా. తాము విడుద‌ల చేస్తున్న సిమ్‌లను మొబైల్ షాపు య‌జ‌మానులు బ్లాక్ మార్కెట్‌లో పెద్ద ఎత్తున విక్ర‌యిస్తున్నార‌ని, ఉచితంగా ఇవ్వాల్సిన సిమ్‌ల‌కు డ‌బ్బులు బాగా వ‌సూలు చేస్తున్నార‌ని స‌మాచారం. హైద‌రాబాద్ వంటి న‌గ‌రాల్లో అయితే జియో సిమ్‌లు బ్లాక్ మార్కెట్‌లో రూ.500 వ‌ర‌కు ప‌లుకుతున్నాయ‌ట‌. ఇక ఓ మోస్త‌రు ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లోనైతే వాటిని రూ.300 వ‌ర‌కు విక్ర‌యిస్తున్న‌ట్టు తెలిసింది. అది కూడా డ‌బ్బు ముందుగా చెల్లించి బుక్ చేసుకున్న వారికే 5 నుంచి 10 రోజుల పాటు వేచి చూస్తే సిమ్ ల‌భ్య‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలో తాము ఇంకా సిమ్‌ల‌ను విడుద‌ల చేస్తూ పోతే ఈ బ్లాక్ దందా ఇలాగే కొన‌సాగుతుంద‌ని, అప్పుడు వినియోగ‌దారుల‌కు తాము సిమ్‌ల‌ను ఉచితంగా అందించ‌లేమ‌ని, అది త‌మ సేవ‌ల‌ను అందించ‌డానికి ఆటంకిగా మార‌డ‌మే కాకుండా, త‌మ నెట్‌వ‌ర్క్‌పై ప్ర‌జ‌ల్లోకి చెడు అభిప్రాయం వెళ్తుంద‌నే ఉద్దేశంతోనే జియో కొద్ది రోజుల పాటు సిమ్‌ల జారీ ప్ర‌క్రియ‌ను నిలిపి వేయాల‌ని భావించిన‌ట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు జియో సిమ్‌లు ఎక్క‌డా ల‌భించ‌డం లేదు. కేవ‌లం రిల‌య‌న్స్ డిజిట‌ల్‌, డిజ‌ట‌ల్ ఎక్స్‌ప్రెస్ స్టోర్ల‌లోనే ముందుగా టోకెన్లు, కూప‌న్లు ఇచ్చిన వారికే జియో సిమ్‌ల‌ను అందిస్తున్నారు. వాటితోపాటు రిల‌య‌న్స్ లైఫ్ లేదా, శాంసంగ్ వంటి పార్ట్‌న‌ర్ మొబైల్స్‌ను కొన్న వారికి జియో సిమ్‌ల‌ను ఇస్తున్నారు. ఇక ఈ సిమ్‌లు మార్కెట్‌లో అంద‌రికీ అందుబాటులోకి ఎప్పుడు వ‌స్తాయో వేచి చూడాలి.

Comments

comments

Share this post

scroll to top