ప్ర‌కృతిని నాశ‌నం చేస్తూ……ప్ర‌కృతి మీద ఆధార‌ప‌డిన వారి జీవితాల‌ను ఇలా ఛిదిమేస్తూ…ఇదేం అభివృద్ది మ‌హాశ‌యా!?

నిరంత‌రం క్షీణిస్తూ ఉండే కండ‌రాల‌తో లేచి న‌డ‌వ‌లేక‌, కూర్చున్నా క‌ద‌ల‌లేక ఎప్పుడూ ఒకే చోట ఉండేలా చేసే జ‌బ్బు ఒక‌రిది. వెన్నెముక వంగిపోయి న‌డ‌వ‌డానికి అత్యంత అసౌక‌ర్యంగా ఉండే జ‌బ్బు ఇంకొక‌రిది. స‌రిగ్గా ఎద‌గ‌ని శ‌రీరం, చిన్న‌త‌నంలోనే వృద్ధులుగా క‌నిపించేలా చేసే జ‌బ్బు మ‌రొక‌రిది. దేహంలో అన్ని భాగాలు స‌రిగ్గానే ఉన్నా ఏదో ఒక భాగంలో విప‌రీతంగా పెరిగిపోయే పెద్ద‌పాటి గ‌డ్డ‌లు, మాంసం ముద్ద‌ల‌తో అంద విహీనంగా క‌నిపించే జ‌బ్బు ఇంకొక‌రిది. ఇలా చెప్పుకుంటూ పోతే… ఆ ప్రాంతంలో అనేక గ్రామాల్లో ఉన్న ప్ర‌జ‌ల‌కు ప్ర‌తి ఒక్కరికీ ఏదో ఒక అనారోగ్య స‌మ‌స్య ఉంది. అయితే ఆ జ‌బ్బులు వారి ఆహార‌పు అల‌వాట్ల వ‌ల్లో, ఇత‌ర కార‌ణాల వ‌ల్లో వ‌చ్చిన‌వి కావు. సాక్షాత్తూ ఇత‌ర మ‌నుషులు చేసిన త‌ప్పిదాల వ‌ల్ల వ‌చ్చిన‌వి. త‌ప్పిదాలంటే… అవి చిన్నా చిత‌కా కాదు… మ‌నుషుల ప్రాణాల‌ను బ‌లిగొనే త‌ప్పిదాలు… న్యూక్లియ‌ర్ ప్లాంట్ల పేరిట యురేనియం అవ‌శేషాల‌ను ఆ ప్రాంతంలోకి పెద్ద ఎత్తున వ‌దులుతుండ‌డం వ‌ల్ల జ‌రుగుతున్న ఘోర‌మైన దారుణాలు..!

uranium-effects-1

అది జార్ఖండ్ రాష్ట్రంలోని తూర్పు సింగ్‌భుమ్ జిల్లా లో ఉన్న జ‌దుగుడ ప్రాంతం. అక్క‌డికి స‌మీపంలో అనేక గ్రామాల ప్ర‌జ‌లు నివ‌సిస్తున్నారు. వారంతా ఆదివాసీ తెగ‌ల‌కు చెందిన వారు. అయితే 1951 ప్రాంతంలో జ‌దుగుడ‌లో యురేనియం నిక్షేపాల‌ను క‌నుగొన్నారు. దీంతో యురేనియంను పెద్ద ఎత్తున వెలికి తీసి దాంతో న్యూక్లియ‌ర్ ప‌వ‌ర్ (అణు విద్యుత్‌)ను త‌యారు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ క్ర‌మంలో అక్క‌డ యురేనియం కార్పొరేష‌న్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థ కూడా వెలిసింది. దీంతో యురేనియం తవ్వ‌కాలు ప్రారంభ‌మ‌య్యాయి. అణు విద్యుత్ ఉత్ప‌త్తి ప్రారంభించారు.

అయితే మొద‌ట్లో అంతా బాగానే ఉంది. స‌ద‌రు కార్పొరేష‌న్ స్థానికంగా ఉన్న ఆదివాసీల‌కు తాగునీరు, రోడ్లు, విద్య‌, వైద్యం త‌దిత‌ర అన్ని సౌక‌ర్యాల‌తోపాటు ఉద్యోగాలు కూడా క‌ల్పిస్తామ‌ని చెప్పింది. కానీ మాట త‌ప్పింది. దాంతోపాటు వారిని యురేనియం గ‌నుల్లో బానిస‌ల‌ను చేసింది. అప్ప‌టి నుంచి వారు బల‌వంతంగా అక్క‌డ ప‌నిచేస్తున్నారు. అయితే యురేనియంతో అణు విద్యుత్ త‌యారు చేయ‌గానే దాన్నుంచి వ‌చ్చే అవ‌శేషాల‌ను స‌మీపంలో ఉన్న న‌దుల్లో వ‌దిలి పెడుతున్నారు. దీంతో పెద్ద ఎత్తున న‌దులు కాలుష్యం అవ‌డ‌మే కాదు, భూగ‌ర్భ జ‌లాలు అక్క‌డి ప్ర‌కృతి మొత్తం కాలుష్యానికి నెలవుగా మారింది. ఈ క్ర‌మంలో స్థానికులతోపాటు అక్క‌డ ఉన్న ప‌శు ప‌క్ష్యాదులు కూడా ఆ నీటిని తాగి పైన చెప్పిన విధంగా అనేక రోగాల‌కు గుర‌వ‌డం మొద‌లైంది. అలా ఆ రోగాలు అక్క‌డి ప్ర‌జ‌లకు ఇప్పుడు వంశ పారం ప‌ర్యంగా వ‌స్తున్నాయి.

uranium-effects-2

అయితే ఇప్ప‌టికీ ఆ ప్ర‌జ‌ల‌కు మాత్రం స‌రైన వైద్య సౌక‌ర్యం క‌ల్పించ‌లేక‌పోయాయి ప్ర‌భుత్వాలు. అంతెందుకు… అస‌లు ఆ ప్రాంతం ఉంద‌ని కూడా చాలా మందికి ఇప్ప‌టికీ తెలిదంటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు. అక్క‌డి ప్రాంతానికి చెందిన ప‌లువురు జ‌ర్న‌లిస్టులు ఆ ప్రాంత స‌మ‌స్య‌లను ప‌లు అంత‌ర్జాతీయ వేదిక‌పై గ‌ట్టిగా వినిపించారు కానీ ఫ‌లితం లేదు. దాని గురించి ప‌ట్టించుకునే నాథుడే క‌రువయ్యాడు. అంత‌లా అక్క‌డి యురేనియం మాఫియా ప్ర‌భావం చూపుతోంది. ఈ క్ర‌మంలో స‌ద‌రు ప‌వ‌ర్ ప్లాంట్లు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అక్క‌డ యురేనియం వ‌ల్ల ఇప్ప‌టికి ఎంత మంది చ‌నిపోయారో లెక్కే లేదు. ఓ వైపు ప్లాంట్ల‌లో బానిస‌ల్లా ప‌నిచేస్తున్న అక్క‌డి ఆదివాసీల‌కు యురేనియం విషంలా మారింది. స్లో పాయిజ‌న్‌లా వారి జీవితాల‌ను చిద్రం చేస్తోంది. మొత్తం 15 గ్రామాల‌కు చెందిన దాదాపు 30వేల మంది ప్ర‌జ‌లు యురేనియం బారిన ప‌డ్డార‌ని తెలిసింది. భ‌విష్య‌త్తులో ఈ సంఖ్య ఇంకా పెరుగుతుంద‌ని ప‌లు స్వ‌చ్ఛంద సంస్థ‌లు తెలియ‌జేస్తున్నాయి.

ఇంత జ‌రుగుతున్న‌ప్ప‌టికీ అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చిన ప్ర‌భుత్వాలు మాత్రం జ‌దుగుడ స‌మ‌స్య‌ల‌ను తీర్చ‌లేక‌పోయాయి. చిన్నపాటి అనారోగ్యం సంభ‌విస్తేనే దానికి చికిత్స చేసుకోలేని దుర్భర స్థితిలో ఉన్నారు వారు. ఇక అలాంటి పెద్ద పెద్ద, వింతైన రోగాల‌కు ఏం ఖ‌ర్చు పెడ‌తారు..? వారికి చికిత్స ఎలా ల‌భిస్తుంది..? అది జ‌ర‌గాలంటే… ఇప్ప‌ట్లో అయ్యే ప‌నిలా క‌నిపించ‌డం లేదు. ఏ మ‌హానుభావుడో రావాలి. వారి కోసం ఉద్య‌మించాలి. అప్పుడే వారి జీవితాలు బాగు ప‌డేందుకు అవ‌కాశం ఉంటుంది. అప్ప‌టి వ‌ర‌కు అలాంటి రోగాల బారిన ప‌డి వారు ప్రాణాలు కోల్పోక త‌ప్ప‌దు..!

Comments

comments

Share this post

scroll to top