మామిడిపండ్లు స‌హ‌జ‌సిద్ధంగా పండిన‌వా, ర‌సాయ‌నాల‌ను వేసి పండించారా తెలుసుకోవడం ఎలా..?

Siva Ram

ఈ సీజ‌న్‌లో మ‌న‌కు అధికంగా ల‌భించే పండ్ల‌లో మామిడిపండ్లు కూడా ఒక‌టి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌నిచ్చే ఔష‌ధ గుణాలు మామిడిపండ్ల‌లో ఉంటాయి. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోషకాలు మామిడిపండ్ల ద్వారా మ‌న‌కు ల‌భిస్తాయి. అయితే.. చాలా మంది వ్యాపారులు మామిడిపండ్ల‌ను చెట్టుకే పండ‌నివ్వ‌డం లేదు. ప‌చ్చిగా ఉన్న వాటిని తెచ్చి కార్బైడ్ వంటి ర‌సాయ‌నాల‌ను ఉప‌యోగించి వాటిని పండించి అనంత‌రం వాటిని మ‌న‌కు విక్ర‌యిస్తున్నారు. ఈ క్ర‌మంలో అలా స‌హ‌జ‌సిద్ధంగా కాకుండా ర‌సాయ‌నాలు ఉప‌యోగించి పండించిన మామిడిపండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక అనారోగ్యాలు కూడా వ‌స్తున్నాయి. అయితే మార్కెట్‌లో మ‌న‌కు ల‌భించే మామిడిపండ్ల‌ను స‌హ‌జ సిద్ధంగా పండించారా, ర‌సాయ‌నాలు వేసి పండించారా అనేది తెలుసుకోవ‌డం ముఖ్య‌మైంది. మ‌రి స‌హ‌జ‌సిద్ధంగా పండిన‌, కృత్రిమంగా పండిన మామిడి పండ్ల‌కు ఎలాంటి తేడాలు ఉంటాయో, వాటిని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. రంగు
స‌హ‌జ‌సిద్ధంగా పండిన మామిడి పండు పూర్తిగా ప‌సుపు రంగులో ఉంటుంది. కానీ కృత్రిమంగా పండించిన మామిడి పండ్ల‌పై అక్క‌డ‌క్క‌డా ఆకుప‌చ్చ రంగులో ప్యాచ్‌లు ఉంటాయి. ఈ తేడాను గ‌మ‌నించాలి.

2. రుచి
ర‌సాయ‌నాల‌ను వాడి పండించిన మామిడిపండ్ల‌ను తింటే తీపితోపాటు రుచి త‌క్కువగా ఉంటుంది. దీనికి తోడు పండును తినేట‌ప్పుడు నాలుక మండిన‌ట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అందులో ఇంకా ర‌సాయ‌నం మిగిలి ఉంటే అది మ‌న నాలుక‌కు త‌గిలిన‌ప్పుడు మంట అనిపిస్తుంది.

3. గుజ్జు
ర‌సాయ‌నాల‌ను వాడి పండించిన మామిడి పండు గుజ్జు డార్క్ ఎల్లో క‌ల‌ర్‌లో ఉంటుంది. అలాగే స‌హ‌జ సిద్ధంగా పండిన మామిడి పండు గుజ్జు పుసుపు, ఎరుపు రంగుల క‌ల‌బోత‌లో ఉంటుంది.

4. జ్యూస్
స‌హ‌జ‌సిద్ధంగా పండిన మామిడిపండ్ల‌తో జ్యూస్ తీస్తే ఎక్కువ‌గా వ‌స్తుంది. అదే ర‌సాయ‌నాల‌ను వాడి పండించిన మామిడిపండ్ల‌తో జ్యూస్ తీస్తే ఎక్కువ‌గా రాదు. తక్కువ‌గా జ్యూస్ వ‌స్తుంది.

5. పండు
స‌హ‌జ‌సిద్ధంగా పండిన మామిడి పండు చూసేందుకు సాధార‌ణంగానే ఉంటుంది. కానీ ర‌సాయ‌నాల‌ను వాడి పండించిన పండు మెరుపుతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తుంది.

 

Comments

comments