ఏ వ్యక్తికైనా వివాహం అనేది జీవితంలో జరిగే ముఖ్యమైన శుభకార్యం. దాంతోనే రెండు మనస్సులు కలిసి ఒకటవుతాయి. దంపతులిద్దరూ ఒకే జీవితం జీవిస్తారు. అయితే అంతటి ప్రాధాన్యత ఉన్న వివాహాన్ని మాత్రం తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాల్సిందే. దాంతో అనేక రకాల లాభాలు ఉంటాయి. ఈ క్రమంలో అసలు ఎవరైనా తమకు వివాహం జరిగినట్టుగా ఎలా రిజిస్టర్ చేసుకోవాలో, అందుకు ఏం చేయాలో, ఏం అవసరమవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
వివాహాలను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించేలా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకు వచ్చింది. అప్పటి ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన వివాహాల నమోదు చట్టం-2002 ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని కులాలు, మతాలు, వర్గాలకు, తెగలకు వర్తిస్తుంది. ఈ చట్టంలోని 8వ సెక్షన్ రాష్ట్రంలో జరిగే ప్రతి వివాహం తప్పనిసరిగా నమోదు కావాలని స్పష్టం చేస్తోంది. ఈ చట్టాన్ని 2002, మే 21న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఆమోదించగా, 2006 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఈ చట్టం అమలుకు రాష్ట్ర స్థాయిలో వివాహాల రిజిస్ట్రార్ జనరల్ ఉంటారు. అన్ని జిల్లాలకు వివాహాల రిజిస్ట్రార్లు ఉంటారు. నిర్ణయించిన సంఖ్యలో అదనపు డిప్యూటీ రిజిస్ట్రార్లు జిల్లాల్లో ఉంటారు. వివాహాల రిజిస్ట్రార్ జనరల్ జారీచేసే నిబంధనలకు లోబడి, జిల్లాలో అమలు చేసే బాధ్యత సంబంధిత జిల్లాల రిజిస్ట్రార్లపైనే ఉంటుంది. వివాహాల రిజిస్ట్రేషన్ కోసం ప్రతి జిల్లాలో ఒక కార్యాలయం ఉంటుంది. దాని పరిధిలో ప్రాంతాల వారీగా వివాహాల అధికారులు ఉంటారు. గ్రామాల్లో గ్రామకార్యదర్శి, మునిసిపాలిటీల్లో, కార్పొరేషన్లలో సంబంధిత మునిసిపల్ కమిషనర్లు వివాహాల అధికారులుగా వ్యవహరిస్తారు. వారు తమ ప్రాంతంలోని వివాహాల రిజిస్ర్టేషన్ కార్యాలయంలో నిర్దేశించిన వేళల్లో అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. ఆ కార్యాలయ పని రోజులు, వేళలు నోటీసు బోర్డుపై అందరికీ కనిపించేలా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
నమోదు చేసుకోవడం ఇలా..!
వివాహం జరిగిన రోజు నుంచి 30 రోజుల్లోపు పెళ్లి కుమారుడు, కుమార్తె లేదా ఇద్దరిలో ఎవరి తల్లిదండ్రులు, సంరక్షకులైనా వివాహం నమోదు కోసం నిర్దేశించిన దరఖాస్తు ఫారం నింపి అధికారికి అందజేయాలి. దాంతోపాటు దంపతులిద్దరూ తమకు చెందిన ఏవైనా ప్రూఫ్లను జతచేయాలి. ఆధార్, పాన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు జిరాక్సులను అందజేయవచ్చు. పెళ్లికి సంబంధించిన ఒక ఫోటో, ఇద్దరి పాస్పోర్టు సైజు ఫొటోలు 2 ఇవ్వాల్సి ఉంటుంది. అవసరం అయితే అధికారులు శుభలేఖ కూడా అడుగుతారు. దరఖాస్తులో పెళ్లి కుమారుడు, కుమార్తె వయస్సు తెలియజేయాలి. పెళ్లి కుమారుడు, కుమార్తె తరపున ఇద్దరిద్దరు సాక్షులు వివాహాల అధికారి సమక్షంలో సంతకం చేయాల్సి ఉంటుంది. వివాహాల అధికారి ఈ సమాచారాన్ని వివాహాల రిజిష్టర్లో నమోదు చేసి అందరి సంతకాలు తీసుకుంటారు. పెళ్లి జరిగే చోట, లేదా మన ఇంటి వద్ద కూడా వివాహం నమోదు చేసుకోవచ్చు. అయితే ముందుగా దరఖాస్తు చేసుకుని ఆ ప్రాంతం వివాహాల అధికారికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. దీనికోసం నిర్దేశించిన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వివాహ నమోదు పత్రం (సర్టిఫికెట్)పై వివాహాల అధికారి సంతకం, సీలు వేసి దంపతులకు ఉచితంగా అందజేస్తారు. వివాహాల నమోదు రిజిష్టర్లో నమోదైన వివాహాల సమాచారం తెలుసుకోవాలంటే నిర్ణీత ఫీజు చెల్లించి పొందవచ్చు.వివాహం జరిగిన 30 రోజుల తరువాత ఆ వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయించాలంటే జరిగిన నాటి నుంచి రెండు నెలలలోపు రూ.100 ఫీజుతో నమోదు చేసుకునే అవకాశం ఉంది.
వివాహ ధృవీకరణ పత్రంతో లాభాలివే..!
ఈవిధంగా నమోదు చేసుకుంటే ఆ వివాహానికి చట్టబద్ధత ఉంటుంది. కుటుంబానికి సంబంధించిన అన్నిపథకాలు వర్తించేందుకు ఇదెంతో దోహదపడుతుంది. భర్త నుంచి విడిపోయినా, దూరంగా ఉన్నా భరణం కోరేందుకు భార్యకు ఆధారంగా ఉపయోగపడుతుంది. కట్నం వేధింపుల సందర్భంగా నేరం రుజువు కావడానికి ముఖ్య ఆధారంగా పనికి వస్తుంది. హింస, వేదనకు గురైన లేదా గురవుతున్న మహిళలు విడాకులు పొందడానికి అవసరం. విడాకులు కోరే భర్త కూడా వివాహం జరిగిన ఆధారం చూపాల్సి ఉంటుంది. అదేవిధంగా రెండవ వివాహాలను అడ్డుకోవడానికి మహిళలు, పురుషులిద్దరికీ ఇదొక ముఖ్యమైన సాక్ష్యంగా పనికొస్తుంది. ప్రేమ పేరుతో మోసాలు, రహస్య వివాహాలు, సాక్ష్యాలు, రుజువు లేని వివాహాలను నిలిపి వేయడానికి ఇదొక ఆధారంగా ఉపయోగపడుతుంది. బాల్య వివాహాలను నిరోధించడానికి పనిచేస్తుంది. వివాహ నమోదు చట్టం ఆధారంగా మహిళలు ఇతర సంబంధిత చట్టాల నుంచి త్వరగా తీర్పు పొందే అవకాశం ఉంటుంది.
తప్పుడు సమాచారం ఇస్తే జరిమానా లేదా జైలు..!
ఉద్దేశపూర్వకరంగా, లేదా తెలిసినా నిర్లక్ష్యంతో వివాహం నమోదు చేసుకోని వారికి వెయ్యి రూపాయల జరిమానా విధిస్తారు. వివాహ నమోదు పత్రంలో తెలిసి, మోసపూర్వకంగా తప్పుడు సమాచారం ఇస్తే ఏడాది జైలు శిక్ష లేదా వెయ్యి రూపాయల జరిమానా, లేదా ఈ రెండూ అమలు చేస్తారు. వివాహం నమోదు చేయని వివాహాల అధికారికి మూడు నెలల జైలుశిక్ష, లేదా రూ.500 జరిమానా, లేదా ఈ రెండు శిక్షలు అమలు చేస్తారు.