ఇలా మీ సెల్ కు మెసేజ్ వ‌చ్చిందా అయితే జాగ్ర‌త్త‌…! ఓ మ‌హిళ లైవ్ ఎక్స్ పీరియ‌న్స్.

టెక్నాల‌జీని వాడుకుని చాలా తెలివిగా వాడుకుంటూ కొంద‌రు ప్ర‌బుద్ధులు ఏ విధంగా జనాల‌ను మోసం చేస్తున్నారో నిత్యం మ‌నం చూస్తూనే ఉన్నాం. రోజుకో కొత్త పంథాలో సైబ‌ర్ నేర‌గాళ్లు మోసాలు చేస్తూ జ‌నాల‌ను దోచుకుంటున్నారు. దీంతో జ‌నాలు లబోదిబోమ‌న‌క త‌ప్ప‌డం లేదు. నిజానికి ఇలాంటి ఘ‌ట‌న‌ల్లో అప్ర‌మ‌త్తంగా ఉండ‌డం చాలా అవ‌స‌రం. లేక‌పోతే ఆ మోస‌గాళ్ల బారిన ప‌డి న‌ష్ట‌పోవాల్సి వ‌స్తుంది. పూణెకు చెందిన ఓ మ‌హిళ‌ కూడా కొంచెం ఉంటే ఇలాగే మోస‌పోయేది. కానీ చాలా తెలివిగా ఆలోచించ‌డంతో ఓ సైబ‌ర్ నేర‌గాడి బారి నుంచి త‌ప్పించుకుంది. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే…

ఆమె పేరు ప‌విత్ర‌. ఉంటున్న‌ది పూణెలో. ఆమె త‌న బాబుకు చెందిన ఓ స్ట్రోల‌ర్ (చిన్న పిల్ల‌ల‌ను వేసి తీసుకెళ్లే చిన్న బండి) నిరుప‌యోగంగా ఉండ‌డంతో దాన్ని అమ్మేందుకు ఓఎల్ఎక్స్ అనే వెబ్‌సైట్‌లో యాడ్ పోస్ట్ చేసింది. అయితే యాడ్ పోస్ట్ చేసినా చాలా రోజుల వ‌ర‌కు ఎవ‌రూ దాన్ని కొన‌లేదు. దీంతో ఆ సంగ‌తే ఆమె మ‌రచిపోయింది. అయితే ఒక రోజు స‌డెన్‌గా ఓ వ్య‌క్తి ఫోన్ చేసి తాను ఆ బండిని కొంటాన‌ని చెప్పాడు. అందుకు ఎంత అవుతుందో చెబితే అకౌంట్‌లో వేస్తాన‌ని, అకౌంట్ నంబర్ ఇవ్వ‌మ‌ని ఆమెను అడిగాడు. దీనికి ఆమె మెసేజ్ రూపంలో బ‌దులిచ్చింది. అకౌంట్ నంబ‌ర్ చెప్ప‌డంతో ఆ అకౌంట్ లో డ‌బ్బులు క్రెడిట్ అయిన‌ట్టుగా ముందే సిద్ధం చేసి ఉంచుకున్న ఓ ప‌రిక‌రంతో ఆమెకు మెసేజ్ పెట్టాడు. దీంతో ప‌విత్ర నిజంగానే డ‌బ్బులు క్రెడిట్ అయ్యాయ‌ని అనుకుంది.

అయితే స‌ద‌రు బండి ఖ‌రీదు రూ.3,500. కానీ ఆ వ్య‌క్తి పంపిన మెసేజ్‌లో రూ.13,500 క్రెడిట్ అయిన‌ట్టు ఉంది. దీంతో రూ.10వేలను పొర‌పాటున ఎక్కువ వేశాన‌ని ఆ వ్య‌క్తి ఆమెకు చెప్పాడు. దీంతో అది నిజ‌మే అనుకుని ఆమె ఆ రూ.10వేల‌ను ట్రాన్స్‌ఫ‌ర్ చేసేందుకు సిద్ధ‌మైంది. అయితే ఎందుకైనా మంచి ఓసారి నెట్‌బ్యాంకింగ్ ఓపెన్ చేసి బ్యాంక్ అకౌంట్‌లో ఎంత ఉందో చూద్దామ‌ని అనుకుని అలాగే చేసింది. తీరా చూస్తే అందులో డబ్బులు ఏమీ క్రెడిట్ కాలేదు. దీంతో ఆ వ్య‌క్తి డ‌బ్బులు వేసిన‌ట్టుగా, బ్యాంక్ వారు పంపిన‌ట్టు ఉండేలా త‌ప్పుడు మెసేజ్ పంపాడ‌ని ఆమెకు అర్థ‌మైంది. ఈ క్ర‌మంలోనే ఆ వ్య‌క్తి ప‌విత్ర‌కు ప‌దే ప‌దే ఫోన్ చేయసాగాడు. పొర‌పాటున రూ.10వేలు క్రెడిట్ అయ్యాయ‌ని, వెంట‌నే ఆ మొత్తాన్ని త‌న అకౌంట్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేయాల‌ని, త‌న త‌ల్లి హాస్పిట‌ల్‌లో ఉంద‌ని ఆమెకు చెప్ప‌సాగాడు. అయితే ఆమె ఫోన్ ఎత్త‌లేదు. ఓ మెసేజ్ పెట్టింది. మీ ట్రిక్స్ ఇక చాలు. నాకు డ‌బ్బు అస‌లు ట్రాన్స్‌ఫ‌ర్ అవ‌లేదు. న‌న్ను మోసం చేయాల‌ని చూడ‌వ‌ద్దు… అని ఆ వ్య‌క్తికి మెసేజ్ పెట్టింది. ఈ క్ర‌మంలోనే త‌న‌కు జ‌రిగిన సంఘ‌ట‌న‌పై పూణె సైబ‌ర్ సెల్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది కూడా. చూశారుగా… మోస‌గాళ్లు ఎలా డ‌బ్బులు దోపిడీ చేస్తున్నారో. మీకు కూడా ఇలాంటి సంఘ‌ట‌న‌లు ఎదురు కావ‌చ్చు, కాబ‌ట్టి ఎందుకైనా మంచిది అప్ర‌మ‌త్తంగా ఉండండి. బ్యాంకు వారు పంపిన‌ట్టు మెసేజ్‌లు వ‌స్తే ఒక‌టికి రెండు సార్లు చెక్ చేసుకోండి. లేదంటే సైబ‌ర్ మోస‌గాళ్ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది.

Comments

comments

Share this post

scroll to top