నిద్రించేటప్పుడు తల కింద పెట్టుకునే దిండ్లు, ఉదయాన్నే దంతాలు తోముకునేందుకు వాడే టూత్ బ్రష్లు. దేని ఉపయోగం దానిదే. రెండూ మనకు అవసరమే. అయితే వీటి పట్ల చాలా మందికి ఉదయించే ప్రశ్న ఒక్కటే..? ఎన్ని రోజులకు ఒకసారి వీటిని మార్చాలి అని. కానీ దీని గురించి ఎక్కడా తెలుసుకోరు. అంటే… తెలుసుకోలేరు అని కాదు, దాని గురించి మరిచిపోతారని..! అయితే ఇప్పుడు ఈ విషయాలను తెలుసుకుందాం. వీటిని మేం చెప్పడం లేదు. పలువురు ప్రముఖ వైద్యులు చెబుతున్నారు. కనుక వారు చెప్పిన విషయాలేమిటో ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా తల దిండ్లు అనేక రకాలుగా ఉంటాయి. ఫోమ్, స్ప్రింగ్, దూది… ఇలా అనేక రకాలుగా తయారు చేస్తారు. అయితే ఫోమ్ దిండు కాకుండా ఇతర దిండ్లను గనక వాడుతుంటే ఒకసారి దాన్ని మధ్యలోకి మడిచి వదలాలి. అలా వదలగానే యాక్షన్తో మళ్లీ వెనక్కి వస్తే అప్పుడు ఆ దిండు బాగానే ఉన్నట్టు లెక్క. అలా అని చెప్పి అదే దిండును కొన్ని సంవత్సరాల పాటు వాడుతామంటే కుదరదు. దిండు బాగా ఉన్నప్పటికీ దాన్ని గరిష్టంగా 3 ఏళ్లకు మించి వాడకూడదు. అలాగే దిండు కవర్లను వారంలో కనీసం రెండు సార్లు ఉతకాలి. అప్పుడే అవి పరిశుభ్రంగా ఉంటాయి. లేదంటే మన తల కింద నుంచి వచ్చే చెమట, జుట్టులోని మృత కణాలు, ఇతర సెల్స్ అన్నీ అందులోకి వెళ్లి అవి మనకు అనారోగ్యాలను కలిగిస్తాయి.
ఇక టూత్ బ్రష్ల విషయానికి వస్తే వాటిని 3 నెలలకు ఒకసారి మార్చాల్సి ఉంటుంది. చాలా మంది డెంటిస్టులు సూచిస్తుంది కూడా ఇదే. కానీ మనలో అధిక శాతం మంది నెలల తరబడి… ఇంకా చెప్పాలంటే కొందరు సంవత్సరాల తరబడి టూత్ బ్రష్లను అలాగే వాడుతుంటారు. అలా వాడకూడదు. ఎందుకంటే టూత్ బ్రష్ అనేది మన నోట్లో ఉన్న క్రిములను చంపదు. నోట్లో పేరుకుపోయే పాచి వంటి వ్యర్థాలను తొలగించి నోరు శుభ్రంగా ఉండేందుకే పనికొస్తుంది. టూత్ పేస్ట్ వల్లే మన నోట్లో ఉన్న క్రిములు చనిపోతాయి. కనుక టూత్ బ్రష్లను ఎప్పటికప్పుడు మార్చాల్సిందే. లేదంటే వాటిల్లో క్రిములు పేరుకుపోయి అవి మరిన్ని నోటి సమస్యలను తెచ్చి పెడతాయి..!