నీటికి ఎప్పుడూ స‌మ‌స్య‌గా ఉండే ఇజ్రాయెల్ దేశం వ్య‌వ‌సాయంలో మాత్రం అంద‌రిక‌న్నా ముందే ఉంది. అది ఎలాగో తెలుసా..?

ఇజ్రాయెల్‌… చాలా చిన్న దేశ‌మ‌ది. మ‌న హైద‌రాబాద్ న‌గ‌రం అంత కూడా ఉండ‌దు. జ‌నాభా 81 ల‌క్ష‌లు మాత్ర‌మే. కాగా ఆ దేశం మొత్తం ఎడారే. ఉన్న భూమిలో 60 శాతం ఎడారిలోనే ఉంటుంది. మిగిలిన 40 శాతంలో కేవ‌లం 10 శాతం వంతు భూప్రాంతంలోనే ప్ర‌జ‌లు నివాసం ఉంటున్నారు. అయితే అక్క‌డ ఉన్న ఏకైక స‌మ‌స్య నీరు. మ‌న ద‌గ్గ‌రంటే కేవ‌లం ఎండాకాలంలోనే చాలా చోట్ల నీటికి క‌ట క‌ట ఉంటుంది. కానీ అక్క‌డ అలా కాదు. ఏడాది పొడ‌వునా నీటికి కొర‌తే ఉంటుంది. వ‌ర్షపాతం కూడా చాలా త‌క్కువే. దీంతో నీరు అనేది అక్క‌డ చాలా విలువైన వ‌స్తువుగా మారింది. ఈ క్ర‌మంలోనే అక్క‌డి ప్ర‌భుత్వం నీటిని జాతీయ సంప‌ద‌గా గుర్తించింది. అయితే ఇది స‌రే… కానీ మీకు ఓ విష‌యం తెలుసా..? నీరు అంత త‌క్కువ‌గా ఉన్నప్ప‌టికీ ఇజ్రాయెల్‌లో మాత్రం చాలా మంది వ్య‌వ‌సాయం పైనే ఆధార ప‌డి జీవిస్తున్నారు. అంత‌టి త‌క్కువ నీటితోనూ పంట‌ల‌ను పండిస్తూ అధిక దిగుబ‌డి సాధించ‌డ‌మే కాదు, ఆ పంటల‌ను ఇత‌ర దేశాల‌కు కూడా ఎగుమ‌తి చేస్తూ లాభాల‌ను గ‌డిస్తున్నారు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఇంత‌కీ ఇది ఎలా సాధ్య‌మైంది..? మ‌న దగ్గ‌ర చాలా ప్రాంతాల్లో నీరు పుష్క‌లంగా ఉన్న‌ప్ప‌టికీ రైతులు పంట‌లు పండించ‌లేక‌పోతున్నారు. అలాంటిది అంత త‌క్కువ నీరు ఉన్నా వారు అంత‌లా దిగుబ‌డి సాధిస్తున్నారంటే నిజంగా న‌మ్మ‌శ‌క్యం కాదు. కానీ న‌మ్మాల్సిందే. వారి వ్య‌వ‌సాయ ప‌ద్ధ‌తులు అలా ఉంటాయి మ‌రి..!

ఇజ్రాయెల్‌కు 1948లో స్వాతంత్ర్యం వచ్చింది. అయితే అప్ప‌టికే ఆ దేశంలో నీటికి చాలా కొర‌త‌గా ఉండేది. దీంతో అప్ప‌టి ప్ర‌భుత్వం నీటిని జాతీయ సంప‌ద‌గా గుర్తించింది. త‌మ‌కు ల‌భించే ఆ కొద్దిపాటి నీటినే స‌మర్థ‌వంతంగా వాడుకునేలా అత్యంత అధునాత‌న ప‌ద్ధ‌తుల‌ను అక్క‌డి సైంటిస్టులు, ఇంజినీర్లు క‌నుగొన్నారు. ఒక్కో బొట్టును ఒడిసి ప‌ట్టారు. అందుకు నూత‌న టెక్నాల‌జీని ఎప్ప‌టిక‌ప్పుడు వాడుకున్నారు. ఉన్న నీటిని ఓ వైపు తాగునీటికి, ఇత‌ర అవ‌స‌రాల కోసం వాడుకుంటూనే, అలా వాడాక వ‌చ్చే వ్య‌ర్థ నీటిని శుద్ధి చేసి దాన్ని సాగునీటిగా వాడ‌డం మొద‌లు పెట్టారు. అయితే సాధార‌ణంగా పంట‌ల‌కు మ‌నం నీటిని పారించే కాలువ‌ల ప‌ద్ద‌తి కాకుండా వారు బిందు సేద్యం (డ్రిప్ ఇరిగేష‌న్‌) ప‌ద్ధ‌తిని అవ‌లంబించారు. దీంతో చాలా వ‌ర‌కు నీటిని ఆదా చేయ‌డ‌మే కాదు, ఒక్కో మొక్క 95 శాతం నీటిని వినియోగించుకునేలా ఆ ప‌ద్ధ‌తిని తీర్చిదిద్దారు. అందులో ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త విధానాల‌ను అనుస‌రిస్తూ వ‌చ్చారు. దీంతో వారికి పంట‌లు పండించేందుకు నీరు పుష్క‌లంగా ల‌భిస్తూ వ‌చ్చింది.

ఇక నీటి స‌మ‌స్య ప‌రిష్క‌రించ‌గానే ఇజ్రాయెల్ వాసులు వెనుదిరిగి చూడ‌లేదు. దీంతో వ్య‌వ‌సాయ రంగంలో విప్ల‌వాత్మ‌క మార్పులు వ‌చ్చాయి. నూత‌న సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని కూడా ఎప్ప‌టికప్పుడు జోడిస్తుండ‌డంతో వారికి వ్య‌వ‌సాయం చేయ‌డం చాలా సులువైంది. ఎరువుల‌ను కూడా డ్రిప్ ఇరిగేష‌న్ పైపుల్లోనే వేసి వాటిని క‌రిగించి బిందువుల రూపంలో మొక్క‌ల‌కు అందించేవారు. దీని వ‌ల్ల ఎరువుల‌ను, నీటిని మొక్క‌లు స‌మ‌ర్థ‌వంతంగా వినియోగించుకుని చ‌క్క‌ని దిగుబ‌డిని ఇస్తున్నాయి. ఇలా సేద్యం చేయ‌డం వ‌ల్ల పిచ్చి మొక్క‌లు, పురుగుల బెడ‌ద కూడా ఉండ‌డం లేదు. అయితే ఏ పంట‌కైనా వారు అనుస‌రించిన విధానం ఒక‌టే. డ్రిప్ ఇరిగేష‌న్ విధానం మొత్తాన్ని వారు కంప్యూట‌ర్ల‌కు అనుసంధానించేవారు. దీంతో పంట‌కు ఎప్పుడు నీరు, ఎరువులు అవ‌స‌ర‌మైతే అప్పుడు కంప్యూట‌ర్లే వాటిని డ్రిప్ పైపుల ద్వారా మొక్క‌లకు ఆటోమేటిక్‌గా పంపిస్తాయి. దీంతో వ్య‌వ‌సాయం చాలా సులువైంది.

అయితే నీరు త‌క్కువ‌గా ఉండే పంట‌లే కాదు, నీటి అవ‌స‌రం ఎక్కువ‌గా ఉండే పంట‌ల‌ను పండించడంలోనూ వారు ముందే ఉన్నారు. త‌మ వ‌ద్ద స‌హ‌జంగా ఉన్న నీటి కొర‌త దృష్ట్యా సాధార‌ణ పంట‌లు పండించ‌డ‌మే క‌ష్టం. కానీ వారు సాహ‌సించి నీరు ఎక్కువ‌గా అవ‌స‌రం ఉండే అర‌టి వంటి పంటల‌ను కూడా వేయ‌డం మొదలు పెట్టారు. అందుకోసం వారు ప‌ర‌దాల‌తో ప్ర‌త్యేక‌మైన వ్య‌వ‌సాయం చేయ‌డం మొద‌లు పెట్టారు. మొక్క‌లు ఎదుగుతున్న స‌మ‌యంలో వాటిపై ప‌ర‌దాల‌ను క‌ప్ప‌డం ద్వారా కొత్త త‌ర‌హా వ్య‌వ‌సాయం చేయ‌డం ప్రారంభించారు. దీంతో నీరు ఎక్కువ‌గా అవ‌స‌రం ఉన్న పంటలు కూడా త‌క్కువ నీటికే అధిక దిగుబ‌డిని ఇస్తున్నాయి. ఇదంతా ఇజ్రాయెల్ వాసులు సాధించిన ప్ర‌గ‌తి.

ఇజ్రాయెల్‌లో ప్ర‌జ‌ల‌కు ఏ వృత్తి చేయాల‌న్నా, వ్యాపారం చేయాల‌న్నా స్వేచ్ఛ ఉంటుంది. ఇక వ్య‌వ‌సాయం విష‌యానికి వ‌స్తే వారు దాన్ని రెండు ర‌కాలుగా చేయ‌వ‌చ్చు. ఒక‌టి… స‌మాజంలో ఉన్న తోటి రైతుల‌తో క‌లిసి కొంత భూమిని ప్ర‌భుత్వం నుంచి లీజుకు తీసుకుని అంద‌రూ క‌లిసి వ్య‌వ‌సాయం చేస్తారు. వ‌చ్చే లాభాల‌ను స‌మిష్టిగా పంచుకుంటారు. అలా కుద‌ర‌క‌పోతే ఒక కుటుంబానికి చెందిన స‌భ్యులు ఎవ‌రైనా క‌ల‌సి క‌ట్టుగా వ్య‌వ‌సాయం చేసుకోవ‌చ్చు. అయితే ఎలా వ్య‌వ‌సాయం చేసినా అక్క‌డి రైతుల‌కు ప్ర‌భుత్వం చాలా అండ‌గా ఉంటుంది. వారికి ఎప్ప‌టికప్పుడు అవ‌స‌ర‌మైన విత్త‌నాలు, ఎరువులు, సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని అందిస్తుంది. ఈ క్ర‌మంలోనే వారు ఎక్కువ దిగుబ‌డితో పంట‌ల‌ను పండిస్తూ ఇత‌ర దేశాల‌కు కూడా వాటిని ఎగుమ‌తి చేస్తున్నారు.

సాధార‌ణంగా మ‌న ద‌గ్గ‌రైతే పంట పండించాక రైతులు దాన్ని మార్కెట్‌కు తీసుకెళ్లి గిట్టుబాటు ధ‌ర వ‌చ్చే వ‌ర‌కు ఆగి అమ్ముతారు. కానీ అక్క‌డ అలా కాదు, ఏకంగా పంట పండిన పొలం ద‌గ్గరే ఆ పంట‌ను కొనుక్కుంటారు. అక్క‌డిక‌క్క‌డే రైతుల‌కు డ‌బ్బు చెల్లిస్తారు. ఆ త‌రువాత ఆ పంట‌ను తీసుకెళ్ల‌డం, అమ్ముకోవ‌డం కొనుగోలు దారుల ప‌నే. అలా ఉంది కాబ‌ట్టే అక్క‌డ చాలా మంది వ్య‌వ‌సాయం చేసేందుకే మొగ్గు చూపుతారు. చాలా మందికి ఇజ్రాయెల్‌లో వ్య‌వ‌సాయ‌మే ప్ర‌ధాన జీవ‌నాధారం. ఇజ్రాయెల్‌లా సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని అంది పుచ్చుకుంటే ఎక్క‌డైనా రైతుల‌కు అలాంటి సంతోష‌క‌ర‌మైన జీవిత‌మే ఉంటుంది. అలా మ‌న ద‌గ్గ‌ర ఎప్పుడు జ‌రుగుతుందో..!

Comments

comments

Share this post

scroll to top