ఐస్ ఎలా తయారవుతుందో మీకు తెలుసా? తెలియకేం, నీటిని అత్యంత తక్కువ ఉష్ణోగ్రతకు చల్లబరిస్తే ఐస్ తయారవుతుంది. ఇండ్లలోనైతే ఫ్రిజ్‌లలో, పెద్ద పెద్ద కంపెనీల్లో అయితే శీతలీకరణ గదులు, యంత్రాలను వాడి ఐస్‌ను తయారు చేస్తారు. ఇదంతా సరే! ఇప్పుడంటే మనకు అత్యంత ఆధునిక టెక్నాలజీతో కూడిన యంత్రాలు అందుబాటులో ఉండబట్టి ఐస్ త్వరగా తయారవుతుంది, అలా చేసుకోగలుగుతున్నాం, కానీ ఒకప్పుడు, ఇలాంటి యంత్రాలు లేనప్పుడు ఐస్‌ను ఎలా తయారు చేసుకునే వారో, ఆయా పదార్థాలను రోజుల తరబడి ఎలా నిల్వ చేసుకునే వారో మీకు తెలుసా? తెలీదా? అయితే ఆ కథాకమామీషు ఏమిటో తెలుసుకుందాం రండి.
1828లో మన దేశంలోని అలహాబాద్‌లో ఉండే ప్రజలు వినూత్న పద్ధతిలో ఐస్‌ను తయారు చేసేవారు. వారు కుండల్లో నీటిని నింపి, ప్రత్యేకంగా తయారు చేసిన పొలం మడుల లాంటి కొన్ని నిర్మాణాల్లో ఆ కుండలను ఉంచేవారు. దీంతో వాటిలో ఐస్ తయారయ్యేది.
ఇక ఈజిప్షియన్ల విషయానికి వస్తే వారు పురాతన కాలంలో మట్టితో తయారు చేసిన జార్ల వంటి పాత్రల్లో మరుగుతున్న నీటిని నింపి ఆ పాత్రలను ఇంటి పైకప్పుపై ఉంచేవారు. ఆ ఈజిప్షియన్లకు బానిసలుగా పనిచేసే వ్యక్తులు రాత్రి పూట జార్ల వద్ద ఉన్న వాతావరణాన్ని తేమగా ఉంచేవారు. దీంతో తెల్లారేసరికి ఆ పాత్రల్లో ఐస్ తయారయ్యేది.
పర్షియన్లు తమ ఆహార పదార్థాలను ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంచుకునేందుకు గాను యాక్చల్ అని పిలవబడే గాదెల వంటి నిర్మాణాలను చేపట్టేవారు. ఈ క్రమంలో కోల్డ్ స్టోరేజ్ విధానాన్ని మొదటగా ఉపయోగించింది కూడా వీరేనని చరిత్రకారులు చెబుతున్నారు.
రోమన్లు, గ్రీకులు, యూదులు పర్షియన్ల లాగే పలు నిర్మాణాలను చేపట్టారు. కానీ వారు వాటి ద్వారా ఆహార పదార్థాలను కాక పానీయాలను ఎక్కువ రోజుల పాటు నిల్వ చేసుకునే వారు.
దాదాపు 1800వ సంవత్సరం తరువాత వాణిజ్య పరంగా ఐస్‌ను తయారు చేయడం మొదలు పెట్టారట. ఈ క్రమంలో కొందరు గడ్డ కట్టిన నదులు, సరస్సుల నుంచి మంచు గడ్డలను సేకరించి వాటిని గడ్డి వంటి సాధనాల ద్వారా నిల్వ చేసి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసే వారట.
అనంతరం న్యూజిలాండ్‌కు చెందిన ఫ్రెడరిక్ ట్యూడర్ అనే వ్యక్తి ఐస్‌ను తయారు చేయడం మొదలు పెట్టి దాన్ని మొదట కరీబియన్ ద్వీపాలకు ఎగుమతి చేసేవాడట. అనంతరం అతను ఐస్‌ను ఇండియాకు కూడా పంపేవాడట.
ఐస్‌ను వాణిజ్యపరంగా తయారు చేయడం అప్పటి నుంచి ప్రారంభమైనా నేటి వరకు ఆ వ్యాపారంలో అనేక మార్పులు వచ్చాయి. దీనికి నూతన టెక్నాలజీ కూడా తోడు కావడంతో ఇప్పుడు మనం కేవలం కొద్ది క్షణాల్లోనే సొంతంగా ఐస్‌ను తయారు చేసుకోగలుగుతున్నాం. అదండీ ఐస్ కథా! కమామీషు!