బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల గురించి అందరికీ తెలిసిందే కదా. తుపాకీ పేల్చగా వచ్చే బుల్లెట్ల నుంచి మన శరీరానికి అది రక్షణ కల్పిస్తుంది. దీంతో ప్రాణాలను కాపాడుకోవచ్చు. వీటిని ఎక్కువగా ఆర్మీలో ఉపయోగిస్తారు. అంతేకాకుండా పలువురు వీవీఐపీలు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, ప్రాణ భయం ఉన్న వారు వాడుతారు. అయితే నిజానికి వీటిని ఏ పదార్థంతో తయారు చేస్తారో, ఇవి ఎలా పనిచేస్తాయో తెలుసా..? అవే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను కెవ్లార్ (Kevlar) అని పిలవబడే ప్రత్యేకమైన సింథటిక్ ఫైబర్‌తో తయారు చేస్తారు. ఇది సాధారణ ఫైబర్ కన్నా ఎన్నో వందల రెట్లు దృఢంగా ఉంటుంది. చాలా తేలిగ్గా కూడా ఉంటుంది. ఈ పదార్థంతో తయారు చేసే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు చాలా తక్కువ బరువుతో ఉంటాయి. ఇవి చిన్నపాటి తుపాకులు, రైఫిల్స్ నుంచి వచ్చే బుల్లెట్లను ఆపగలవు. కానీ పెద్ద రైఫిల్స్, మెషిన్ గన్స్ నుంచి వచ్చే బుల్లెట్ల నుంచి రక్షణ కల్పించలేవు. అందుకోసం మరింత దృఢమైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను వేసుకోవాల్సి ఉంటుంది. వాటిని అత్యంత దృఢమైన సిరామిక్, స్టీల్ వంటి పదార్థాలను కలిపి తయారు చేస్తారు. అయితే ఇవి సింథటిక్ ఫైబర్ జాకెట్ల కన్నా చాలా ఎక్కువ మందంగా, బరువుగా ఉంటాయి. కానీ వాటి కన్నా ఎంతో ఎక్కువ రక్షణను ఇస్తాయి.
ఇక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఏవైనా అవి ఎలా పనిచేస్తాయంటే… ఉదాహరణకు ఒక ఫుట్‌బాల్ నెట్‌ను తీసుకోండి. ఆటగాడు ఎవరైనా గోల్ చేస్తే ఆ బాల్ నేరుగా నెట్‌కు తాకి వెంటనే కిందకు పడుతుంది. అక్కడి నుంచి ఆ బాల్ ముందుకు కదలదు. సరిగ్గా ఇలాంటి మెకానిజంనే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కూడా కలిగి ఉంటాయి. తుపాకీ నుంచి వచ్చే బుల్లెట్ కు ఉండే శక్తి జాకెట్ అంతటా విస్తరిస్తుంది. దీంతోపాటు ఫుట్‌బాల్ నెట్‌ను పోలిన విధంగా కొన్ని వందలు, వేల అరల్లో పదార్థాలు జాకెట్లో ఉంటాయి. ఇవి బుల్లెట్‌ను ముందుకు పోనీయకుండా ఆపేస్తాయి. దీంతో బుల్లెట్ల నుంచి మనకు రక్షణ లభిస్తుంది. సాధారణంగా సింథటిక్ ఫైబర్ పదార్థంతో తయారు చేసిన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు రూ.13వేల ప్రారంభ ధరకు లభిస్తాయి. కానీ ఇవి ఎక్కువ రక్షణ అందివ్వవు. అదే మెటల్, సిరామిక్‌తో తయారు చేసిన జాకెట్లు అయితే రూ.1.30 లక్షలకు లభిస్తాయి. ఇవి చాలా తుపాకుల నుంచి రక్షణను అందిస్తాయి.