వెయిటర్‌గా జీవితాన్ని ప్రారంభించి.. IAS అధికారి అయిన గణేష్. సకల్పం ముందు తలొంచిన పేదరికం.

కృషి, పట్టుదల, ఏదైనా సాధించాలనే తపన, సంకల్పం ఉంటే చాలు… అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని నిరూపించాడు ఓ యువకుడు. పేద కుటుంబంలో పుట్టినా, అడుగడుగునా అడ్డంకులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందడుగేసి ఉన్నత స్థానానికి ఎదగాలనే తన కలను సాకారం చేసుకున్నాడు. ఐఏఎస్ కావాలని మనసులో ఉన్నా ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురు కావడంతో వెయిటర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు. 5 సార్లు ప్రయత్నించి విఫలమైనా 6వ సారి పరీక్షలో ఐఏఎస్‌కు సెలెక్ట్ అయి తన ప్రతిభ చాటాడు. ప్రజ్ఞా పాటవాలు ఉంటే చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించాడు.
తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరానికి చెందిన కె.జయగణేష్ అనే వ్యక్తి పేద కుటుంబంలో జన్మించాడు. అతని కన్నా చిన్నవారు నలుగురు తోబుట్టువులు ఉన్నారు. అయితే చిన్నతనం నుంచి తమ కుటుంబ కష్టాలను ఎరిగిన వాడు, అందులోనూ అందరి కంటే పెద్దవాడు కావడం చేత బాగా చదివి ఎలాగైనా తన కుటుంబాన్ని కష్టాల నుంచి గట్టెక్కించాలనుకున్నాడు. స్థానికంగా ఉండే ఓ లెదర్ ఫ్యాక్టరీలో జయగణేష్ తండ్రి కార్మికుడిగా విధులు నిర్వహించేవాడు. అతనికి నెలకు రూ.4,500 జీతం వచ్చేది. దీంతో కుటుంబాన్ని ఎలాగోలా నడిపించేవారు. అయితే జయగణేష్ తండ్రి శ్రమను వృథా పోనిచ్చేవాడు కాదు. చిన్న తనం నుంచి చదువుల్లో మంచి ప్రతిభను కనబరిచేవాడు. ఈ నేపథ్యంలోనే ఇంటర్‌లో దాదాపు 91 శాతం మార్కులతో డిస్టింక్షన్ సాధించాడు. అనంతరం థాంథయ్ పెరియార్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ విద్యను అభ్యసించాడు.
571900420
ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్నా అవకాశాలు దొరక్కపోవడంతో బెంగుళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో రూ.2,500 నెల జీతానికి కార్మికుడిగా చేరాడు. కానీ తాను పుట్టిన గ్రామంలో విద్య ఆవశ్యకత ఎవరికీ తెలియకపోవడం, ఆ దిశగా వారికి సరైన అవగాహన కల్పించే వారు లేకపోవడంతో తాను ఎలాగైనా ఉన్నత స్థానానికి ఎదిగి తన గ్రామ విద్యార్థులను కూడా అదే దిశగా నడింపించాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఆ ఉద్యోగాన్ని వదిలేసి ఎలాగైనా ఐఏఎస్ కావాలని నిశ్చయించుకున్నాడు. అయితే ఐఏఎస్ సాధించాలంటే మాటలు కాదు. రోజులో అధిక భాగం చదువుకే కేటాయించాలి. దీనికి తోడు తనకు ఆ కోర్సు గురించి అవగాహన కల్పించే వారు ఎవరూ దొరకలేదు. అయితే దీనికే అతను కుంగిపోలేదు. పట్టుదలగా చదివాడు. కానీ మొదటి రెండు సార్లు ప్రిలిమినరీ పరీక్షలోనే ఫెయిల్ అయ్యాడు. అనంతరం తన సబ్జెక్ట్ మెకానికల్ ఇంజినీరింగ్ నుంచి సోషియాలజీకి మార్చాడు. అయినా మూడోసారి కూడా ఫలితం లేదు. దీనికి తోడు ఉద్యోగం లేకపోవడంతో ఆర్థిక సమస్యలు కూడా చుట్టు ముట్టాయి. వీటిని తొలగించుకోవడం కోసం అతను బెంగుళూరు నుంచి చెన్నై నగరానికి తరలివెళ్లి అక్కడ ఓ క్యాంటీన్‌లో పార్ట్ టైం బిల్లింగ్ క్లర్క్‌గా చేరాడు. ఖాళీ దొరికితే ఆ క్యాంటీన్‌లోనే వెయిటర్‌గా కూడా విధులు నిర్వహించేవాడు.
736737820
ఓ వైపు వెయిటర్ జాబ్, మరో వైపు ఐఏఎస్ ప్రిపరేషన్. రెండింటినీ జయగణేష్ క్రమశిక్షణతో నిర్వహించేవాడు. అయితే దురదృష్టవశాత్తూ 4, 5వ సారి కూడా అతను ఐఏఎస్ ప్రిలిమినరీలో ఫెయిలయ్యాడు. దీంతో చేస్తున్న వెయిటర్ జాబ్‌ను జయగణేష్ మానేశాడు. అనంతరం ఓ ప్రైవేటు శిక్షణా సంస్థలో యూపీఎస్‌సీ సోషియాలజీ చెప్పే అధ్యాపకుడిగా జాయిన్ అయ్యాడు. అయితే చివరిగా 6వ సారి అదృష్టం అతన్ని వరించింది. ఐఏఎస్ ప్రిలిమినరీ పరీక్షలో పాస్ అయ్యాడు. అయితే ఈ సారి జయగణేష్ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాడు. అప్పుడతను బ్యాకప్ ఆప్షన్‌గా ఇంటెల్లిజెన్స్ బ్యూరో అధికారి పోస్టు కోసం పరీక్ష రాశాడు. దీంతో మరోసారి ఐఏఎస్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చింది. చిట్ట చివరిగా 7వ సారి ఐఏఎస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ పాస్ అయ్యాడు. మెయిన్స్, ఇంటర్వ్యూలను కూడా క్లియర్ చేశాడు. దీంతో అతని జీవిత కల సాకారమైంది. ఆలిండియా వ్యాప్తంగా జయగణేష్‌కి సివిల్స్‌లో 156వ ర్యాంక్ వచ్చింది.
749318346
పేద కుటుంబంలో పుట్టి కూడా ఐఏఎస్ లాంటి అత్యున్నత స్థాయి పరీక్షలో పాస్ అయి ఎట్టకేలకు విజయం సాధించిన జయగణేష్ పట్టుదల అభినందనీయం. నిజంగా జయగణేష్‌కి అందరూ హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

Comments

comments

Share this post

scroll to top