నీరు గారిన విద్యా హ‌క్కు చ‌ట్టం.. స‌ర్కార్ తీరుపై హైకోర్టు ఆగ్ర‌హం

తెలంగాణ రాష్ట్రంలో విద్యా హ‌క్కు చ‌ట్టం అమ‌ల‌వుతోందా..ఈ విష‌యం గురించి ప్ర‌భుత్వానికి ఏమైనా తెలుసా..అంటూ హైకోర్టు డివిజ‌న్ బెంచ్ తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. రాజ్యాంగం క‌ల్పించిన హ‌క్కుల్లో విద్యను అంద‌జేయ‌డం ప్ర‌భుత్వాల బాధ్య‌త‌. దానిని నుంచి త‌ప్పించు కోవాల‌ని చూస్తే ఎలా. కేంద్రం నిధులు ఇవ్వ‌క పోతే ప‌ట్టించుకోరా. అదే మీ పిల్ల‌ల‌ను అయితే ఇలాగే వ‌దిలి వేస్తారా అంటూ ప్ర‌శ్నించింది. సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్ర‌యించ‌లేదు. అస‌లు రాష్ట్ర వాటానైనా ఖ‌ర్చు చేశారా అంటూ నిల‌దీసింది. విద్యా హ‌క్కు చ‌ట్టం ఆర్టీఇ అమ‌లుపై త‌మ వైఖ‌రి ఏమిటో చెప్పాల‌ని టీఎస్ స‌ర్కార్‌ను డివిజ‌న్ బెంచ్ ఆదేశించింది.

ముందు ప్ర‌భుత్వం త‌న వాటాను ఖ‌ర్చు చేసి..మిగ‌తా వాటా కోసం కేంద్రాన్ని ఎందుకు కోర‌డం లేదంది. మ‌న పిల్ల‌ల‌కు స‌రైన బోధ‌న అంద‌క‌పోతే మ‌ట్టిలో మాణిక్యాలు ఎలా బ‌య‌ట‌కు వ‌స్తారు .వారిని కెన్యా, ఉగాండా దేశాల్లోని పిల్ల‌ల్లాగా మార్చాల‌ని అనుకుంటున్నారా అని హైకోర్టు తాత్కాలిక ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ రాఘ‌వేంద్ర సింగ్ చౌహాన్, జ‌స్టిస్ ఎ. రాజ‌శేఖ‌ర్ రెడ్డిల‌తో కూడిన ధ‌ర్మాస‌నం నిల‌దీసింది. ఆర్టీఐ చ‌ట్టం అమ‌లు అయ్యేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ వ‌న‌పర్తి జిల్లాకు చెందిన వై. తిప్పారెడ్డి అనే వ్య‌క్తి 2018లో హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి లేఖ రాశారు. దానిని కోర్టు సుమోటో పిల్‌గా విచార‌ణ‌కు స్వీక‌రించింది. ఆర్టీఐని అమ‌లు చేయాల‌ని 2013లోనే కోర్టు ఆదేశించినా ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదు.
ఎప్ప‌టి నుంచి అమ‌లు చేస్తారంటూ కోర్టుకు హాజ‌రైన విద్యాశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి జ‌నార్ద‌న్ రెడ్డిని ప్ర‌శ్నించింది. తీసుకోబోయే చ‌ర్య‌ల గురించి కౌంట‌ర్ వేయాల‌ని సూచించింది. కేంద్ర స‌ర్కార్ నిధులు ఇవ్వ‌క పోవ‌డం వ‌ల్ల‌నే ఆర్టీఇ చ‌ట్టం అమ‌లు చేయ‌లేక పోతున్నామ‌ని ..స‌ర్కార్ త‌ర‌పు లాయ‌ర్ రాంచంద‌ర్ రావు తెలిపారు. ప్ర‌భుత్వం త‌న వాటా కింద ఎంత ఖ‌ర్చు చేసిందో చెప్ప‌గ‌ల‌రా అని ఏసీజే స్పందించారు. ముందు త‌మ వాటా ఖ‌ర్చు చేయ‌కుండా కేంద్రంపై నెట్టి వేయ‌డం భావ్యం కాద‌న్నారు. ఏ దేశ భ‌విష్య‌త్ అయినా పిల్ల‌ల మీదే ఆధార‌ప‌డి ఉంటుంద‌ని, చ‌ట్ట ప్ర‌కారం ప్రైవేట్ విద్యా సంస్థ‌ల్లోని పేద‌, బ‌ల‌హీన వ‌ర్గాల‌కు చెందిన పిల్ల‌ల‌కు 25 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది.

స‌ర్వ శిక్షా అభియాన్ కింద అమ‌ల‌వుతున్న ప‌థ‌కాలు స‌క్సెస్ గా న‌డుస్తున్నాయ‌ని లాయ‌ర్ అన‌గా..పిల్ల‌ల‌ను చూస్తే తెలుస్తుంద‌న్నారు. 2013 నుంచి ఆర్టీఈపై ఎన్నిసార్లు కేంద్రంతో సంప్ర‌దింపులు జ‌రిపార‌ని ప్ర‌శ్నించ‌గా నాలుగైదు సార్లు వెళ్లార‌ని లాయ‌ర్ తెలిపారు. పిల్ల‌ల ప‌ట్ల మీకు బాధ్య‌త లేదా అని కార్య‌ద‌ర్శిని నిల‌దీసింది. ఈ విద్యా సంవ‌త్స‌రం కూడా చ‌ట్టాన్ని అమ‌లు చేయ‌లేక పోతే విద్యార్థులు న‌ష్ట‌పోతార‌ని ధ‌ర్మాస‌నం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అమ‌లు చేయాల‌న్న సంక‌ల్పం ప్ర‌స్తుత ప్ర‌భుత్వానికి లేద‌న్నారు.

Comments

comments

Share this post

scroll to top