అమ్మానాన్న కోసం అయిదేళ్లు భరించలేని బాధను కడుపులో దాచుకుంది.!

ప్రతి వ్యక్తికి జీవితంలో ఏదైనా సాధించాలనే కోరిక ఉంటుంది. దాన్ని నెరవేర్చుకునే దిశగా ఎన్ని ప్రయత్నాలు చేయడానికైనా కొందరు వెనుకాడరు. అయితే ఇది విద్యార్థులకు వర్తించదనే చెప్పవచ్చు. ఎందుకంటే ఫలానా విద్యార్థి తాను పెద్దయ్యాక ఏ ఇంజినీరో, డాక్టరో అవ్వాలనుకుంటే ఆ విద్యార్థి తల్లిదండ్రులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ వేరే ఏదైనా కోర్సులో బలవంతంగా చేర్పిస్తారు. ఈ క్రమంలో అధిక శాతం మంది విద్యార్థులు తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోకుండానే నిరాశగా ఏదో ఒక కోర్సు చదివి, ఉద్యోగం సంపాదించి అలా బ్రతికేస్తుంటారు. అయితే అలా మనసు చంపుకుని జీవించడం ఇష్టం లేని ఓ యువతి ఎట్టకేలకు తాను అనుకున్న కోర్సును చదివి లక్ష్యం సాధించింది. మొదట తల్లిదండ్రులు చెప్పిన చదువును పీజీ వరకు చదివినా తనకు నచ్చిన కోర్సు కోసం తిరిగి మళ్లీ గ్రాడ్యుయేషన్ నుంచి మొదలు పెట్టి చివరిగా తాను అనుకున్నది నెరవేర్చుకుంది. ఆమే అదితి భండారి.
Aditi-My-STory-750x500
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నివసించే అదితి భండారికి చిన్నప్పటి నుంచే డాక్టర్ కావాలని ఉండేది. ఈ క్రమంలో ఆమె ఇంటర్ తరువాత ఎంబీబీఎస్ చేయాలని నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగానే దంత వైద్యం (బీడీఎస్) చేయాలని దరఖాస్తు కూడా చేసుకుంది. అయితే ఆమె తల్లిదండ్రులు మాత్రం అందుకు వ్యతిరేకించారు. దానికి బదులుగా మేనేజ్‌మెంట్ విద్యను చదవాలని ఆమెకు నిబంధన విధించారు. దీంతో చేసేది లేక అదితి భండారి ఎలాగో 3 ఏళ్ల పాటు బీబీఏ విద్యను, అనంతరం 2 ఏళ్ల పాటు ఎంబీఏ కూడా చదివింది.
అయితే 5 ఏళ్ల పాటు తన మనసులో బాధగా ఉన్నా తల్లిదండ్రుల కోరిక ప్రకారం ఆమె మేనేజ్‌మెంట్ విద్యను అభ్యసించింది. కాగా ఎంబీఏ పూర్తి చేశాక కూడా ఆమె తన ఆశను వదులుకోలేదు. ఎలాగైనా బీడీఎస్ పూర్తి చేసి తీరాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో మరోసారి తన నిర్ణయాన్ని అదితి భండారి తన తండ్రి ముందు చెప్పింది. అయితే తన తండ్రి అందుకు అడ్డు చెబుతాడేమోనని అదితి ముందుగా భయ పడింది. కానీ ఆయన అందుకు సరేననడంతో అదితి ముఖంలో సంతోషం వెల్లివిరిసింది.
కాగా పీజీ చదివి మంచి జాబ్ చూసుకుని, పెళ్లి చేసుకోవాలి కానీ, మళ్లీ గ్రాడ్యుయేషన్ విద్యను అభ్యసిస్తున్నావెందుకని అదితి భండారిని ఆమె స్నేహితులు, ఇరుగు పొరుగు వారు ప్రశ్నించారు. అయితే వారి అడ్డుకట్టలను ఆమె ఏ మాత్రం పట్టించుకోలేదు. తాను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకే ఆమె ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చింది. ఈ క్రమంలో ఎట్టకేలకు అదితి బీడీఎస్ విద్యను పూర్తి చేసింది. నిజంగా ర్యాంకులు, ఫలితాలు అంటూ ఆధునిక పోకడల బాట పడుతున్న తల్లిదండ్రులకు, ఏం చేయాలనుకున్నా చేయలేకపోతున్న విద్యార్థులకు అదితి చూపిన తెగువే ఆదర్శంగా నిలుస్తుంది కదూ!

Comments

comments

Share this post

scroll to top