ఏసీల‌ను వాడేవారు… ఇలా చేస్తే విద్యుత్ బిల్లును చాలా వ‌ర‌కు త‌గ్గించుకోవ‌చ్చు తెలుసా..?

ఒకప్పుడంటే కాదు గానీ… ఇప్పుడు చాలా మంది ఏసీల‌ను కొంటున్నారు. మారిన ఆర్థిక స్థితిగ‌తులే అందుకు కార‌ణం. అయితే ఓకే. బాగానే ఉంది. ఏసీ కొంటారు. కానీ… చాలా మంది ఏసీల‌ను వాడ‌డంలో స‌రైన జాగ్ర‌త్త‌లు పాటించ‌డం లేదు. దీంతో ఏసీ వ‌ల్ల క‌రెంటు బిల్లు వేల‌కు వేలు వస్తోంది. ఆ బిల్లును చూసి గుండెలు గుభేల్‌మ‌నేలా ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. అయితే అలా ఆందోళ‌న క‌ల‌గ‌కుండా ఉండాల‌న్నా, ఏసీల వ‌ల్ల విద్యుత్ బిల్లు త‌క్కువ‌గా రావాల‌న్నా ఇప్పుడు మేం చెప్ప‌బోయే జాగ్ర‌త్తల‌ను పాటించండి. దీంతో హాట్ స‌మ్మ‌ర్‌లోనూ కూల్ కూల్‌గా ఏసీ చ‌ల్ల‌ద‌నాన్ని అనుభ‌వించ‌వ‌చ్చు. మ‌రో వైపు బిల్లు ఎక్కువ‌గా వ‌స్తుంద‌న్న టెన్ష‌న్ ప‌డాల్సిన ప‌నిలేదు. మ‌రి ఆ జాగ్ర‌త్త‌లు ఏంటో తెలుసుకుందామా..?

ఏసీ ఫిల్ట‌ర్లు…
ఏసీ ఫిల్టర్లను వారానికోసారి క‌చ్చితంగా క్లీన్ చేయాల్సి ఉంటుంది. దీంతో ఫిల్టర్ శుభ్రంగా ఉంటే గాలి కాయిల్స్ కు బాగా సరఫరా అవుతుంది. ఈ క్ర‌మంలో గది చాలా త్వ‌ర‌గా చల్లబడుతుంది. దీని వ‌ల్ల కొంత వ‌ర‌కు విద్యుత్‌ను ఆదా చేయ‌వ‌చ్చు.

ఉష్ణోగ్రత…
ఏసీ ఉష్ణోగ్ర‌త‌ను 25 నుంచి 27 డిగ్రీల మ‌ధ్య సెట్ చేసుకోవాలి. దీంతో గ‌ది చ‌ల్ల‌బ‌డ‌డ‌మే కాదు, క‌రెంటు కూడా త‌క్కువ ఖ‌ర్చ‌వుతుంది. ఫ‌లితంగా బిల్లు కూడా త‌క్కువ‌గా వ‌స్తుంది. అదే 18 డిగ్రీల వ‌ర‌కు సెట్ చేస్తే కంప్రెస‌ర్ చాలా సేపు తిరుగుతూనే ఉంటుంది. క‌నుక విద్యుత్ బాగా ఖ‌ర్చ‌యి తద్వారా బిల్లు అధికంగా వ‌స్తుంది. సాధార‌ణంగా వేస‌విలో బ‌య‌టి ఉష్ణోగ్ర‌త‌లు 40 డిగ్రీల‌కు పైనే ఉంటాయి. మ‌రి అలాంట‌ప్పుడు గ‌దిలో 18 డిగ్రీలు టెంప‌రేచ‌ర్ సెట్ చేసి పెడితే అప్పుడు ఏసీపై ఎంత‌టి భారం ప‌డుతుందో మ‌నం ఇట్టే ఆలోచించ‌వ‌చ్చు. క‌నుక ఏసీ ఉష్ణోగ్ర‌తను 25 నుంచి 27 మ‌ధ్య సెట్ చేస్తే కంప్రెస‌ర్‌పై అంత భారం ప‌డ‌దు. గ‌దిలో ఆ ఉష్ణోగ్ర‌త‌కు చేరుకోగానే కంప్రెస‌ర్ తిర‌గ‌డం ఆగిపోతుంది. ఈ ప్ర‌క్రియ చాలా త్వ‌ర‌గా జ‌రుగుతుంది. దీంతో కంప్రెస‌ర్‌పై భారం ప‌డ‌దు. ఫ‌లితంగా విద్యుత్ కూడా త‌క్కువ‌గా ఖ‌ర్చయి, బిల్లు త‌క్కువ‌గా వ‌స్తుంది.

ఈ అంశాల‌ను ఓ సారి చూసుకోండి…
ఏసీ ఉన్న గ‌ది త్వ‌ర‌గా చ‌ల్ల‌బ‌డాలంటే అందుకు అనేక అంశాలు ప‌రిశీలించాల్సి ఉంటుంది. గ‌ది వైశాల్యం ఎంత ఉంది, కిటికీలు, వెంటిలేట‌ర్లు ఎన్ని ఉన్నాయి, వాటి సైజ్ ఎంత‌, అవి ఎటు వైపు ఉన్నాయి, గ‌దిలో ఉన్న ఫ్లోరింగ్ ఎలాంటిది, గ‌ది ఏ వైపుకు ఉంది, అందులో టీవీ, ఫ్రిడ్జ్‌, కంప్యూట‌ర్ వంటి ఇత‌ర ఉప‌క‌ర‌ణాలు ఏవైనా ఉన్నాయా, గ‌దిలో ఎంత మంది ఉంటారు వంటి అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలి. ఎందుకంటే ఇవ‌న్నీ గ‌దిలోని ఉష్ణోగ్ర‌త‌ల‌ను ప్ర‌భావితం చేస్తాయి. కాబ‌ట్టి వీటిని అనుస‌రించి ఏసీని తీసుకోవాల్సి ఉంటుంది. తద్వారా మ‌నం ఆశించిన చ‌ల్ల‌ద‌నం పొంద‌వ‌చ్చు.

సీలింగ్ ఫ్యాన్ ఉండాలా..?
చాలా మంది ఏసీని వేసి దాంతోపాటు గ‌దిలో ఉండే సీలింగ్ ఫ్యాన్‌ను కూడా ఆన్ చేస్తారు. దీని వ‌ల్ల ఏసీ గ‌ది అంతా విస్త‌రిస్తుంద‌ని, చ‌ల్ల‌గా ఉంటుంద‌ని అనుకుంటారు. అయితే అది క‌రెక్టే. కానీ సీలింగ్ ఫ్యాన్ వేయ‌డం వ‌ల్ల గ‌ది పై నుంచి కిందకు వేడి గాలి వ్యాపిస్తుంది. దీంతో గ‌ది త్వ‌ర‌గా చ‌ల్ల‌బ‌డ‌దు. ఫ‌లితంగా కంప్రెస‌ర్‌పై భారం ప‌డి విద్యుత్ ఎక్కువ ఖ‌ర్చ‌యి, బిల్లు ఎక్కువ‌గా వ‌స్తుంది. దీనికి తోడు సీలింగ్ ఫ్యాన్ వ‌ల్ల దుమ్ము ఎక్కువ‌గా ఏసీలోకి చేరుతుంది. ఫ‌లితంగా ఫిల్ట‌ర్లు త్వ‌ర‌గా పాడవుతాయి. క‌నుక సీలింగ్ ఫ్యాన్‌ల‌ను వేయ‌కూడ‌దు. అవ‌స‌రం అనుకుంటే టేబుల్ ఫ్యాన్‌ను తెచ్చుకుని ఒక పాయింట్‌లో పెట్టి కొంత‌సేపు అయ్యాక దాన్ని ఆఫ్ చేయ‌డం బెట‌ర్‌. దీంతో విద్యుత్ బిల్లు అధికంగా రాదు.

వెంట వెంట‌నే ఆన్‌, ఆఫ్‌…
కొంద‌రు ఏసీని వేసి గ‌దిలో చ‌ల్ల‌గా అయ్యాక దాన్ని ఆఫ్ చేస్తారు. మ‌ళ్లీ వేడి అనిపించిన‌ప్పుడు ఏసీ వేస్తారు. అయితే ఇలా చేయ‌కూడ‌దు. ఎందుకంటే వెంట వెంట‌నే అలా ఏసీని ఆన్‌, ఆఫ్ చేస్తే కంప్రెస‌ర్‌పై భారం ప‌డుతుంది. ఫ‌లితంగా విద్యుత్ వినియోగం ఎక్కువై బిల్లు ఎక్కువ‌గా వ‌స్తుంది. క‌నుక అలా చేయ‌కూడ‌దు. నేటి త‌రుణంలో వ‌స్తున్న ఏసీల్లో ఆటోమేటిక్ ఆన్‌, ఆఫ్ ఫీచ‌ర్ ఉంటోంది. దీని వ‌ల్ల ఏసీ నిర్దిష్ట ఉష్ణోగ్ర‌త‌కు చేరుకోగానే వెంట‌నే ఆఫ్ అవుతుంది, అప్పుడు కంప్రెస‌ర్ చాలా నెమ్మ‌దిగా తిరుగుతుంది. మ‌ళ్లీ ఉష్ణోగ్ర‌త పెరుగుతుంద‌ని గ్ర‌హిస్తే ఏసీ దానంత‌ట అదే ఆన్ అవుతుంది. క‌నుక ఇలాంటి ఫీచ‌ర్ ఉన్న ఏసీల‌ను తీసుకుంటే బెట‌ర్‌. అప్పుడు విద్యుత్ బిల్లు కూడా కొంత వ‌ర‌కు త‌గ్గుతుంది.

ఏసీ ఇలా ప‌నిచేస్తుంది…
ఏసీ ద్వారా చ‌ల్ల‌ని గాలి వ‌స్తుంద‌ని అంద‌రికీ తెలుసు. అయితే ఆ గాలి ఎక్క‌డి నుంచో రాదు. గ‌దిలో ఉన్న వేడిగాలినే ఏసీ తీసుకుంటుంది. దాన్ని ఎవాప‌రేట‌ర్ కాయిల్‌లోకి పంపుతుంది. దీంతో ఆ గాలి చ‌ల్ల‌బ‌డుతుంది. వెంట‌నే ఆ గాలిని ఏసీ మ‌ళ్లీ బ‌య‌ట‌కు పంపుతుంది. త‌ద్వారా రూం చ‌ల్ల‌బ‌డుతుంది. ఏసీ ఇలా పనిచేస్తుంది.

మ‌రికొన్ని టిప్స్‌…

1. త‌ర‌చూ గ‌ది త‌లుపులు తెరుస్తూ, మూస్తూ ఉండ‌రాదు. దీని వ‌ల్ల వేడి గాలి ఎప్ప‌టికీ గ‌దిలోనే ఉంటుంది. అలాంట‌ప్పుడు ఏసీ ఆగ‌కుండా ప‌నిచేయాల్సి వ‌స్తుంది. ఫ‌లితంగా బిల్లు కూడా అధికంగా వ‌స్తుంది.

2. విండో ఏసీ క‌న్నా స్ప్లిట్ ఏసీ బెట‌ర్‌. ఎందుకంటే విండో ఏసీని గ‌దిలో పైన ఫిట్ చేస్తారు. అక్క‌డ నుంచి కింద‌కు వ‌చ్చే వేడి గాలి త్వ‌ర‌గా చ‌ల్ల‌బ‌డుతుంది. క‌నుక విండో ఏసీయే బెట‌ర్‌.

3. స్టార్ రేటింగ్ ఎక్కువ ఉన్న ఏసీనే కొనే ప్ర‌య‌త్నం చేయండి. ఎందుకంటే స్టార్ రేటింగ్ ఎంత ఎక్కువ ఉంటే అవి అంత తక్కువ‌గా విద్యుత్ ను వాడుకుంటాయి క‌నుక‌. సాధార‌ణంగా 5 స్టార్ రేటింగ్ ఉన్న ఏసీలు ఒక ట‌న్నుకు గాను 930 నుంచి 980 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌ను వాడుకుంటాయి.

4. లోప‌ల ఉన్న ఏసీకి, బ‌య‌ట ఉన్న కంప్రెస‌ర్‌కు మ‌ధ్య త‌క్కువ దూరం ఉండేలా చూసుకోవాలి. అదేవిధంగా రెండూ యూనిట్ల మ‌ధ్య ట్యూబుల ఫిట్టింగ్ స‌రిగ్గా ఉందో, లేదో ఎప్ప‌టిక‌ప్పుడు చెక్ చేసుకోవాలి.

5. ఏసీని గ‌దిలో ఏదైనా ఒక గోడ‌కు మ‌ధ్య‌లో పెట్టుకోవాలి. ఒక చివ‌ర‌గా ఉంచరాదు. ఉదాహ‌ర‌ణ‌కు 12/18 సైజ్ ఉన్న గ‌ది ఉంద‌నుకుంటే అందులో పొడ‌వైన గోడ 18 క‌నుక దాని మ‌ధ్య‌లో ఏసీ పెట్టాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల గ‌ది చాలా త్వ‌రగా చ‌ల్ల‌బ‌డుతుంది. గాలి గ‌ది అంత‌టా స‌మంగా విస్త‌రిస్తుంది.

6. ఏసీని ఆన్ చేసిన వెంట‌నే కొంద‌రు వేగంగా చ‌ల్ల‌బ‌డాల‌ని చాలా త‌క్కువ ఉష్ణోగ్ర‌త‌కు సెట్ చేస్తారు. కానీ అలా చేయ‌కూడ‌దు. దీంతో కంప్రెస‌ర్ పై భారం ప‌డుతుంది. అది వేగంగా తిరుగుతుంది. అందువ‌ల్ల విద్యుత్ వినియోగం అధిక‌మై బిల్లు కూడా ఎక్కువగా వ‌స్తుంది. క‌నుక ఏసీని ఆన్ చేయ‌గానే ఉష్ణోగ్ర‌త 25 నుంచి 27 డిగ్రీల మ‌ధ్య పెట్టుకోవ‌డం బెట‌ర్‌.

7. తలుపులు, కిటికీల‌కు సందులు లేకుండా చూడాలి. లేదంటే వేడి గాలి లోప‌లికి వ‌స్తుంది. త‌ద్వారా గ‌ది చ‌ల్ల‌బ‌డేందుకు స‌మ‌యం ప‌ట్ట‌వ‌చ్చు. అలాగే కిటికీలు గ్లాస్‌వి అయితే వాటికి క‌ర్టెన్లు ఏర్పాటు చేస్తే వేడి గాలి లోప‌లికి రాకుండా ఉంటుంది.

8. గ‌దిలో సీలింగ్‌కు ఫాల్ సీలింగ్ కోటింగ్ వేయ‌డం వ‌ల్ల కొంత చ‌ల్ల‌ద‌నం ఆటోమేటిక్‌గా వ‌స్తుంది. దీంతో ఏసీపై భారం ప‌డ‌దు.

9. గ‌దిపైన మ‌రో గ‌ది లేకపోతే చ‌ల్ల‌ద‌నాన్నిచ్చే కూల్ సిమెంట్ కోటింగ్ వేయాలి. దీంతో గ‌దిలోకి వేడి ప్ర‌వేశించ‌కుండా ఉండి ఏసీ వినియోగం త‌గ్గుతుంది.

10. గ‌దికి అవ‌స‌రం ఉన్న ప‌రిమాణం క‌న్నా కొద్దిగా ఎక్కువ ప‌రిమాణం ఉన్న ఏసీని కొంటే మంచిది. అంటే.. ఉదాహ‌ర‌ణ‌కు మీ గ‌దికి స‌రిగ్గా 1 ట‌న్ను ఏసీ స‌రిపోతుంది అనుకుంటే.. 1.5 ట‌న్ను ఉన్న ఏసీ తీసుకుంటే బెట‌ర్‌. దీనికి 26 డిగ్రీల‌కు టెంప‌రేచ‌ర్‌ను సెట్ చేసుకుంటే త్వ‌ర‌గా చ‌ల్ల‌ద‌నం పొంద‌వ‌చ్చు.

Comments

comments

Share this post

scroll to top