హైదరాబాద్ వెలిగి పోతోంది. నియాన్ లైట్లతో.స్టార్టప్ కంపెనీలతో.బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తోంది. ఎక్కడ చూసినా గులాబీ జెండాలే రెప రెప లాడుతున్నాయి. ఓ వైపు ఫ్లెక్సీలు.ఇంకో వైపు కోట్లాది రూపాయలు విలువ చేసే లెక్కలేనన్ని కార్లు.ట్రాఫిక్ జాంకు ఆనవాళ్లు. తరాలు మారినా.ప్రభుత్వాలు మారినా .పేదల బతుకుల్లో మార్పులు రాలేదు. పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునే దాకా డాలర్ల జపం చేసే యూత్ సిగ్గుతో తలొంచుకునేలా భాగ్యనగరానికి చెందిన ఓ యువకుడు రోజుకు వేయి మందికి పైగా ఆకలి తీరుస్తున్నాడు.
ఇంటికి ఓ ఐదు మంది వస్తే జడుసుకుంటాం.నీళ్లు ఇవ్వలేని ఈ పరిస్థితుల్లో ఇతను మాత్రం సేవ చేయడంలో ఉన్నంత తృప్తి ఎందులోను దొరకదంటాడు.అతడే నగరానికి చెందిన మహ్మద్ సూజతుల్లా. పట్టుమని 24 ఏళ్లు కూడా లేని ఈ కుర్రాడు.సుల్తాన్ కాలేజీ ఆఫ్ ఫార్మసీలో చదువుతూనే మరో వైపు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు. తనతో పాటు మరికొందరి సహకారంతో ఈ మహోన్నతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం ఒకరోజుతో ఆగిపోయేది కాదు.ప్రతి రోజూ వేయి మందికి తగ్గకుండా అన్నార్థుల ఆకలిని తీరుస్తున్నాడితడు. కోటిలోని మెటర్నిటీ హాస్పిటల్తో పాటు నీలోఫర్ హాస్పిటల్లో రోగులకు, ఇతరులకు భోజనం పెడుతున్నారు. అందరికంటే ముందుగా లేస్తాడు. క్లాసులకు అటెండ్ అవుతాడు. తిరిగి రోడ్లపైకి వస్తాడు. వీరందరికి భోజనం తయారు చేసుకుని ఆ ఆసుపత్రుల ముందు తానే స్వంతంగా వడ్డిస్తాడు.
ఇది కొన్నేళ్లపాటు కొనసాగుతూనే ఉన్నది. లెక్కకు మించి ఆస్తులు కలిగిన వాళ్లు, డబ్బున్న మారాజులు, కంపెనీల యజమానులు, ఫౌండేషన్లు, స్వచ్ఛంధ సంస్థలు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరుతో టాక్స్ దొబ్బేసున్న వారు తలదించుకునేలా ఒకే ఒక్కడు ఈ అరుదైన కార్యక్రమానికి ప్రాణం పోశాడు. ఉదయం ఏడున్నరకే మెటర్నిటీ హాస్పిటల్కు చేరుకుంటాడు. అక్కడ రోగులు, వారి బంధువులకు ఉప్మా సర్వ్ చేస్తాడు. అక్కడి నుండి కోటిలోని నీలోఫర్ ఆస్పత్రికి వెళతాడు. అక్కడున్న వారి ఆకలి తీర్చేందుకు కష్టపడతారు. ఆ ప్రభుత్వ ఆస్పత్రులకు 90 శాతం మందికి పైగా పేదలే వస్తారు.
వారి దగ్గర డబ్బులు ఉండవు. తినేందుకు ఇబ్బంది. చాలా మంది పస్తులతో రోడ్లపైనే పడుకుంటారు. చుట్టు పక్కల ఊర్ల నుండి ఇక్కడికి వస్తారు. వారికి ఏ ఆధారం ఉండదు. అందుకే కనీసం ఉప్మా నైనా అందిస్తే బాగుంటుందని ఇలా చేస్తున్నానంటాడు సుజాత్ ఉల్లా. వానొచ్చినా.ఎండొచ్చినా మనోడి ఆకలి తీర్చే కార్యక్రమం మాత్రం ఆగిపోలేదు. తాను చదువుకుంటున్న కాలేజీలోనే కొంతమంది పూర్ స్టూడెంట్స్ ఉన్నారని గుర్తించాడు. వారికి తానే దగ్గరుండి సబ్జెక్టుల్లో ఎక్స్ పర్ట్స్ అయ్యేలా ట్రైనింగ్ ఇచ్చాడు. అతడిచ్చిన సహకారం, స్ఫూర్తితో పది మంది ఫార్మసీలో పట్టా పొందారు. ఇది కూడా సేవలో భాగమే అంటారు. అంతేకాకుండా పేద విద్యార్థులకు ఉప్మా అందిస్తున్నాడు. అక్కడి నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు.సుజాత్ ఉల్లా. ఉప్మా సర్వ్ చేస్తుంటే ఓ పిల్లాడు నా వద్దకు వచ్చాడు. నా అంగీ పట్టుకున్నాడు. ఆకలితో ఉన్నాడని అర్థమైంది. అది చూపించే ప్రభావం ఎంతగా ఉంటుందంటే.మనిషిని చంపాలన్న కసిని కలిగేలా చేస్తుంది. ఆకలి అన్నింటికంటే ప్రమాదకరమైనది. దానిని తీర్చేందుకే ఈ ప్రయత్నం అంటారు వినమ్రంగా. నెలలో సంపాదించిన దానిలో కుటుంబమంతా కలిసి నెలలో నాలుగైదు సార్లు పిల్లలకు ఆహారం ఇవ్వాలని నిర్ణయించారు.
రోజుకు వేయి మందికి ఆహారం అందుతోంది. ప్రతి రోజు 3 వేల 500 రూపాయల ఖర్చవుతోంది. సమ్మర్లో వాటర్ క్యాంప్లు ఏర్పాటు చేస్తాడు. చలి కాలంలో దుప్పట్లు అందజేస్తాడు. 2016లో పేదలకు సాయం చేయాలన్న సంకల్పంతో హ్యూమానిటీ ఫౌండేషన్ పేరుతో ఓ స్వచ్ఛంధ సంస్థను ఏర్పాటు చేశాడు. దాని ద్వారా కార్యక్రమాలు చేపడుతున్నాడు. రోడ్లపై ఉన్న అనాధలను చేరదీసి వారికి షెల్టర్ కూడా ఏర్పాటు చేశాడు. ఏ ఒక్కరు పేదగా ఉండొద్దు. ఎంతో కొంత ఈ సొసైటీకి సేవ చేయాలి అంటారు. చూస్తే చిన్నోడైనా సాయంలో మనందరికంటే పెద్దోడు ఈ మహ్మద్ సుజాత్ ఉల్లా.