హెల్మెట్ లేకుంటే పెట్రోల్ బంద్…. ఓ S.I సరికొత్త ఐడియా.

మనిషి జీవితం ఎంతో విలువైంది. సృష్టిలో ఏ ప్రాణికి లేని ఆలోచన శక్తిని, విచక్షణా జ్ఞానాన్ని దేవుడు మనిషికి ఇచ్చాడు. దాన్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో ఏదైనా సాధించాలనే తపనతో ముందుకు సాగాలి. ఆ విధంగానే జీవితాన్ని ఆనందాలమయం చేసుకోవాలి. అయితే అలా చేసుకోవాలంటే మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండడమే కాదు, అంతకంటే ఎక్కువగా ఎంతో విలువైన మన ప్రాణాలను కాపాడుకోవాలి. అప్పుడే మనం జీవితంలో మనం అనుకున్న కలలన్నింటినీ నెరవేర్చుకోగలుగుతాం. కానీ నేటి ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో చిన్న చిన్న అంశాలను మరిచిపోతుండడంతో ఎంతో విలువైన ప్రాణాలను ఉత్తి పుణ్యానికే కోల్పోవాల్సి వస్తోంది. ప్రధానంగా రోడ్డు ప్రమాదాల విషయంలో. అవును, ద్విచక్ర వాహనాలపై హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఏవైనా అనుకోని ప్రమాదాలు జరుగుతుండడంతో ఏటా అధిక శాతం మంది వాహనదారులు తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారు.
దేశంలోని అనేక రాష్ర్టాలకు చెందిన ప్రభుత్వాలు హెల్మెట్ నిబంధనను కఠినతరం చేస్తూ దాన్ని ఉల్లంఘించిన వాహనదారులకు జరిమానాలు కూడా విధిస్తున్నాయి. అయినప్పటికీ కొంత మంది వాహనదారులు హెల్మెట్ ధరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో ఏటా ప్రమాదాల కారణంగా చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే దీన్ని నివారించాలంటే హెల్మెట్ నిబంధనను ఇంకా కఠినంగా చేయాలని భావించాడు ఆ సబ్ ఇన్‌స్పెక్టర్. ఈ క్రమంలోనే తన స్టేషన్ పరిధిలోని పెట్రోల్ బంకుల్లో ఇంధనం కోసం వచ్చే వాహనదారులకు హెల్మెట్ లేకపోతే పెట్రోల్‌ను అమ్మవద్దని ఆదేశించాడు. దీంతో అక్కడి వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ను ధరించాల్సి వస్తోంది.
No-Helmet-No-Petrol-750x500
కేరళ రాష్ట్రంలోని కన్నూర్ జిల్లా కన్నాపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న బిను మోహన్ తాజాగా ఓ కొత్తదైన, వినూత్నమైన నిబంధనను కచ్చితంగా అమలు చేస్తున్నాడు. తన పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న 3 పెట్రోల్ బంకుల్లోనూ ఇంధనం కోసం వచ్చే ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ లేకపోతే పెట్రోల్‌ను అమ్మవద్దని బంక్ యజమానులకు ఆదేశిలిచ్చాడు. దీంతో ఆ బంక్‌ల యజమానులు కూడా ఆ సబ్ ఇన్‌స్పెక్టర్‌కు మద్దతు పలికారు. ఈ క్రమంలో వారు తమ తమ బంక్‌లకు వచ్చే వాహనదారులకు హెల్మెట్ లేకపోతే పెట్రోల్‌ను అమ్మడం లేదు. ఈ నేపథ్యంలో అక్కడి ద్విచక్ర వాహనదారులు చేసేది లేక హెల్మెట్‌లను తప్పనిసరిగా ధరిస్తున్నారు. కాగా 2013లో దేశవ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 34 శాతం మంది వాహనదారులు హెల్మెట్ లేకపోవడం వల్లే మరణించారని, కన్నాపురంలోనూ తాజాగా ఇద్దరు వాహనదారులు హెల్మెట్ లేకపోవడం వల్లే మృతి చెందారని, హెల్మెట్ నిబంధనను కఠినతరం చేస్తే దాదాపు 40 శాతం వరకు మృతులను, 70 శాతం వరకు గాయాలను కాకుండా ఆపవచ్చని, అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని బిను మోహన్ వెల్లడించారు.
అయితే బిను మోహన్ అంతటితో ఆగేది లేదంటున్నాడు. ఇలాంటి నిబంధనను అన్ని చోట్లా వర్తింపజేసేలా తాను ప్రయత్నం చేస్తున్నానన్నారు. నిజంగా ఇదే అమలైతే హెల్మెట్‌ను అందరూ ధరిస్తారు. అప్పుడు హెల్మెట్ లేకుండా ఎవరూ చనిపోరు కదా!

Comments

comments

Share this post

scroll to top