కంటతడి తెప్పించిన "కాల్ మనీ" కథ, దంపతుల చివరి పయనం ఎటు?

కాల్ మనీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టిస్తుంది. పైనాన్స్ పేరుతో డబ్బులిచ్చి, వాటిని వసూలు చేసే  క్రమంలో ఆ ఫైనాన్షియర్లు చేసిన  వికృత చేష్టలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇలాంటి తరుణంలో నా ఫేస్ బుక్ మిత్రులు ఒకరు “కాల్ మనీ” వ్యవహారాన్నే  కథాంశంగా తీసుకొని ఓ హృంద్యమైన కథను ఆయన టైమ్ లైన్ మీద రాసుకున్నారు దానిని ఉన్నదున్నట్టుగా మీకోసం ఇక్కడ పొందుపరుస్తున్నాను.

“బెజవాడ సబ్ కలెక్టర్ ఆఫీసు దగ్గర రైతు బజారు పక్కన అరటి పళ్లమ్ముకునే దంపతుల బండి ఉండేది.  ఓ రోజు సాయంత్రం ఏడున్నర అవుతూండగా…. భర్త బండి దగ్గరుండగా భార్యను స్వతంత్ర మైదానం లోంచీ ఓ పోలీసోడు తీసుకొచ్చాడు. భర్త ఖంగారు పడ్డాడు. పోలీసోడు వెకిలిగా నవ్వాడు. ఏదో బతుకుతారు కదాని ఇక్కడ బండీ పెట్టినా పట్టించుకోవడం లేదు. అలుసుగా తీసుకుని యాపారం పెట్టారేంట్రా అన్నాడు.

భర్త ఐదొందల కాగితాన్ని మడిచి పోలీసాయన చేతుల్లో పెట్టాడు.  భార్య రోడ్డు వారగా వంచిన తల ఎత్తకుండా నిలబడి ఉంది.
ఏంట్రా? స్టేషన్ కొచ్చి మాట్లాడుకో…అన్నాడు పోలీసోడు… అయ్యా…ఈ ఐదూ ఉంచండి…రేపట్నించి ఇక్కడ బండీ పెట్టము..మేమూ కనిపించము అన్నాడు భర్త.  డబ్బులు తీసుకుని జేబులో పెట్టుకుంటూ…అసలు నువ్వు భర్తవేరా? అని ప్రశ్నించాడు పోలీసోడు. అప్పటి వరకు తలొంచుకుని నిల్చున్న భార్య మొదటి సారి తల పైకెత్తి మీరు పోలీసైతే ఆడు నా మగడే అంది.  వెకిలిగా నవ్వుతూ ఏదో చావండి…అసలు నాకు చెప్పి చేసుకుంటే వేరే రేటు చెప్పేవోణ్ణిగా అంటూ సూర్యారావు పేట పోలీస్ స్టేషన్ దిశగా వెళ్లిపోయాడు పోలీసోడు.

Adilabad-dec-2010 448-tile


ఏం చేద్దాం అంది భార్య భర్త వైపు సూటిగా చూస్తూ… నువ్వే చెప్పాల … ఆణ్ణి మున్సిపాల్టీ బళ్లో ఏత్తే ఏ కష్టాలుండేవా? కాదన్నావ్. ఆ మైక్రో ఫైనాన్సోళ్లదగ్గర డబ్బులు తెచ్చావ్. మన సంపాదన ఆడిని బడికి పంపడానికీ మనం తినడానికే సరిపోతున్నాయి. మరి ప్రతి బుధవారం ఆళ్లకి కట్టాల. కట్టకపోతే ఇంటి మీద పడి రభస. అప్పో సొస్పో చేసేస్తే పోయేదే…తప్పు చేసేశాం అన్నాడు కళ్లల్లో నీళ్లు కుక్కుకుంటూ…

అవును నేనే తొందరపడ్డా…పళ్లమ్మిన డబ్బుల్లో ఒక పూట తినైనా ఆళ్లకి కట్టేయగలం అనుకున్నాగానీ…ఆడికి రోజుకు వందరూపాయల ఖర్చు బడోళ్లు చెప్తారని నేననుకోలేదు. అంది భార్య.  కరక్టే…ఈళ్లకి కట్టడానికి మొదట్లో చేబదుళ్లు తెచ్చాం. అవి తీర్చాల్సొచ్చే తలికి మళ్లీ బుధ వారం గిర్రున తిరిగొచ్చేస్తుంది. రోజువారీ ఖర్చులు ఎటూ తప్పవు. అందుకేగా సిగ్గు లేకుండా ఈ పనికి దిగాం. ఇప్పుడీ పోలీసోడు రుచిమరిగిన కుక్కలా ఇక్కడిక్కడే తిరుగుతాడు. చెప్పు ఏం చేద్దాం?
ఆణ్ణి మా అన్న దగ్గరకి పంపి మనం క్రిష్ణలో దూకేద్దాం అంది ఏడుస్తూనే భార్య.


ఆ పని చెయ్యడం వల్ల ప్రయోజనం ఏముంటుంది? మనం ఈ రోజు పడతాం. మీ అన్నా వదినా పట్టించుకోకపోతే ఆడు రేపు పడతాడు. అది కాదు ఏదో ఒకటి చెయ్యాలి.  ఈ పళ్లమ్మడం మానేయాలి. ఈ ఏరియా కూడా మారిపోవాలి. మరేం చెయ్యాలి.
రేపు బేబమ్మ దగ్గరికెడతా అంది భార్య.  అంటే నువ్వా పని చేస్తే తప్ప బతకలేమంటావా …దాన్ని తిట్టి పనిమానేసి వచ్చావ్. ఇప్పుడేముఖం పెట్టుకుని పోతావ్. ఇప్పటికైంది చాలు…ఇంటికెళ్తాం పద. తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా పన్నెండు గంటల టైముంది కదా…అన్నాడు భర్త. ఇద్దరూ బండి తోసుకుంటూ అమెరికన్ ఆసుపత్రి వైపు సాగిపోయారు..”

————————————————————– (Bhardwaja Rangavajhala)

Comments

comments

Share this post

scroll to top