ర‌క్త హీన‌త‌కు, ఇన్‌ఫెక్ష‌న్ల‌కు, మాన‌సిక ఆరోగ్యానికి చ‌క్క‌ని ఔష‌ధం… మామిడి పండు..!

వేస‌వి సీజ‌న్ వ‌చ్చిందంటే చాలు, చాలా మంది ఈ సీజ‌న్ లో దొరికే మామిడి పండ్ల‌ను చాలా ఇష్టంగా తింటారు. ర‌సాలు, కోత మామిడి.. అని మామిడి పండ్ల‌లో చాలా ర‌కాలే ఉంటాయి. కొన్ని ర‌సంతో నోరూరిస్తే కొన్ని దిట్ట‌మైన కండ‌తో జిహ్వా చాప‌ల్యాన్ని పెంచుతుంటాయి. అయితే ఏ మామిడి ర‌కాన్ని తిన్న‌ప్ప‌టికీ మ‌న‌కు క‌లిగే లాభాలు ఒకే విధంగా ఉంటాయి. వాటి వ‌ల్ల వేస‌విలో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అందుతాయి. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. ఈ క్ర‌మంలో అస‌లు మ‌న‌కు అందుబాటులో ఉండే మామిడి ర‌కాలు ఎన్నో, మామిడి పండ్ల‌ను ఈ సీజ‌న్‌లో తిన‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు పొంద‌వ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

మనకు తెలిసి మామిడి అనగానే రసాలు, బంగినపల్లి, ఆల్ఫాన్సో, దశహరి, హిమాయుద్దీన్‌, తోతాపురి, సువర్ణరేఖ, నీలం, కొబ్బరిమామిడి, మల్లిక, ఆమ్రపాలి, లాంగ్డా, అర్క అరుణ, బాంబే గ్రీన్‌, పంచదార కలశ… ఇలా కొన్ని రకాలే కనిపిస్తాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా సుమారు 1100 రకాలకు పైనే పండుతున్నాయి. వాటిల్లో ప్రాచుర్యం పొందిన తొలి ఐదు రకాలు ఇవి..!

ఆల్ఫాన్సో…
పండ్లకు రాజు మామిడి అయితే ఆ మామిడి రకాల్లో రారాజు ఆల్ఫాన్సో. మార్చి నుంచి జులై వరకూ కాసే ఈ రకం రుచిలోనే కాదు, ఖరీదైనదిగానూ పేరొందింది. మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల్లో ఎక్కువగా పండే ఈ రకం మామిడిలో టెంకను పాతితే కచ్చితంగా మళ్లీ అదే రకం మామిడి మొలకెత్తకపోవడమే దీని ప్రత్యేకత.

బాదామి…
ఎక్కువ కాలం నిల్వ ఉండే ఈ రకం, ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతోంది. చల్లగా తింటే దీని రుచి మరింత పెరుగుతుంది.

వేలన్సియా ప్రైడ్‌…
దక్షిణ ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన ఈ రకం పెద్ద పరిమాణంలో గులాబీ, ఎరుపు, పసుపు రంగుల్లో అందాల విందు చేస్తుంటుంది. ఎస్‌ ఆకారంలో ఉండే ఈ పండులో అస్సలు ఏమాత్రం పీచు ఉండదు.

నామ్‌ డక్‌ మాయ్‌…
దీనికే గోల్డెన్‌ మ్యాంగో అని పేరు. ఏ మాత్రం పీచు లేని ఈ పండు రుచి చూడాల్సిందే అంటారు థాయ్‌ వాసులు. మే నుంచి అక్టోబరు ప్రారంభం వరకూ వచ్చే ఈ పండ్లు తియ్యగా మంచి వాసనతో ఉంటాయి. ఎడారిలోనూ వీటిని పండించుకోవచ్చు.

చౌసా…
పాకిస్థాన్‌లోని పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన ముల్తాన్‌, సాహివాల్‌ జిల్లాలో ఎక్కువగా పండించే ఈ రకం, మంచి వాసనతో అద్భుతమైన రుచితో ఉంటుంది. చౌసా ప్రాంతంలో హుమాయూన్‌ మీద గెలుపొందిన షేర్‌షాసురి అక్కడ పండే మామిడికి ఆ పేరు పెట్టాడు. జులై – సెప్టెంబరు దీని సీజన్‌.

ఇవేకాదు, ఎరుపూ గులాబీరంగుల్లో నోరూరించే గ్లెన్‌, హనీ మ్యాంగోగా పేరొందిన సింథేరీ, ఘాటైన తియ్యని రుచితో ఉండే మేడమ్‌ ఫ్రాన్సిక్‌, గుండ్రంగా చిన్నగా ఉండే తియ్యని కేసర్‌, ఎరుపురంగు మచ్చలతో ఉండే కెట్‌ రకాలు తరవాతి ఐదు స్థానాల్లో మామిడి ప్రియులకు చవులూరిస్తున్నాయి.

మామిడి పండ్ల వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలివే…

1. విటమిన్లూ ఖనిజాలూ యాంటీ ఆక్సిడెంట్లూ పుష్కలంగా ఉండే మామిడిపండు అనేక వ్యాధుల నుంచీ రక్షిస్తుంది. ముఖ్యంగా ఈ కాయల్లోని పాలీఫినాల్స్‌ కాన్సర్లను నిరోధిస్తాయి. ఇవి క్యాన్సర్‌ కణాల వృద్ధిని అడ్డుకోవడంతోబాటు ఆయా కణాలను నాశనం చేసినట్లుగా పరిశోధనల్లోనూ తేలింది. ఊబకాయుల్లో చక్కెర స్థాయుల్ని కూడా మామిడి అదుపుచేయగలదన్నది మరో పరిశోధన.

2. రక్తహీనతతో బాధపడేవాళ్లకి మామిడిలో ఐరన్‌ పుష్కలంగా దొరుకుతుంది. ఎసిడిటీ, అజీర్తిలతో బాధపడేవాళ్లకీ మంచి మందే.

3. బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లు, మలబద్ధకం, డయేరియా, ఎండదెబ్బ, కాలేయవ్యాధులు, ఆస్తమా, నెలసరి ఇబ్బందులు, మొలలు, స్కర్వీ, సైనసైటిస్‌… ఇలాంటి అన్ని సమస్యలకీ మామిడిపండు మంచి టానిక్‌.

4.  మామిడిపండులోని బీటాకెరోటిన్‌ వృద్ధాప్యాన్ని అడ్డుకుంటే, మాంజిఫెరన్‌ శరీరంలోని విషపదార్థాలను తొలగిస్తుంది.

5. పొయ్యిమీద మందపాటి గిన్నెలో ఇసుకపోసి బాగా పండిన పండును అందులో ఉంచి కాల్చి రసం పిండి తాగితే కఫం, దగ్గు తగ్గుతాయి.

6. శరీరంలోని నాడులనూ ఇది పరిపుష్టం చేస్తుంది. మానసికంగా బలహీనులైనవాళ్లకి దీని రసం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇందులోని ట్రిప్టోఫాన్‌ ఆనందాన్ని అందించే సెరటోనిన్‌ను విడుదల చేస్తుంది. ఇది ఏకాగ్రతనీ జ్ఞాపకశక్తినీ పెంచుతుంది. నిద్రలేమిని తగ్గిస్తుంది. అందుకే, పడుకునేముందు ఓ మామిడిపండు తింటే మంచిదని చెబుతారు.

7. మామిడిపండు కడుపు నిండిన తృప్తినీ హాయైన అనుభూతినీ కలిగిస్తుంది. దీంతో ఒక్క పండు తిన్నా చాలా సేప‌టి వ‌ర‌కు ఆక‌లి వేయ‌దు. ఇది బ‌రువు త‌గ్గించుకోవడానికి ఉప‌యోగ‌ప‌డుతుంది.

Comments

comments

Share this post

scroll to top