అంధుడని అత‌నికి జాబ్ ఇవ్వ‌లేదు. ఇప్పుడ‌త‌నే అంద‌రికీ జాబ్‌లు ఇస్తున్నాడు .! ఎలాగో తెలుసా..?

జాబ్ కోసం ఇంట‌ర్వ్యూకు వెళ్లారు. అందుకు కావ‌ల్సిన అన్ని అర్హ‌త‌లు మీకు ఉన్నాయి. ఇంట‌ర్వ్యూలో అన్ని రౌండ్ల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేశారు. మీ ప‌ట్ల ఇంట‌ర్వ్యూయ‌ర్లు ఆస‌క్తిని క‌న‌బ‌రిచారు. అయినా మీకు జాబ్ రాలేదు. అలాంటి స్థితిలో మీరు ఏం చేస్తారు ? ఎవ‌రైనా అలాంటి విషాద స్థితిలో తీవ్ర‌మైన డిప్రెష‌న్‌లోకి వెళ్తారు. అస‌లు నా జీవితం ఎందుకు ఇలా అయింది, అన్ని అర్హ‌త‌లు ఉన్నా, ఇంట‌ర్వ్యూ పూర్తి చేసినా జాబ్ ఎందుకు రాలేదు, అంటూ తీవ్రంగా మాన‌సిక వేద‌న చెందుతారు. అయితే ఇది అందరూ చేసే ప‌ని. కానీ అత‌ను అలా చేయ‌లేదు. ఇలాంటి స్థితిలో ఉన్న‌ప్ప‌టికీ అది అత‌నికి కొంత సేపు మాత్ర‌మే అనిపించింది. దీంతో ఒక్క‌టే నిర్ణ‌యం తీసుకున్నాడు. ఎవరెవ‌రి ద‌గ్గ‌రో ఎందుకు ప‌నిచేయ‌డం, తానే ఓ కంపెనీ పెడితే బాగుంటుంది క‌దా అని అనుకున్నాడు. అనుకున్న‌దే త‌డ‌వుగా సొంత కంపెనీ పెట్టాడు. ఇప్పుడు తానే కొంద‌రికి జాబ్‌ల‌ను ఇస్తున్నాడు. ఇంత‌కీ అత‌నెవ‌రంటే…

అత‌ని పేరు ప్ర‌తీక్ అగ‌ర్వాల్‌. జైపూర్ వాసి. ఇత‌ను పుట్టుక‌తోనే అంధుడు. దీంతో అత‌న్ని త‌ల్లి బ్రెయిలీ స్కూల్‌లో చేర్చింది. త‌న కొడుక్కి చ‌దువు చెప్ప‌డం కోసం ఆమె కూడా బ్రెయిలీ లిపి నేర్చుకుంది. అయితే ప్ర‌తీక్ అంధుడు అయినా అమిత‌మైన ప్ర‌జ్ఞాశాలి. ఏం చ‌దివినా ఇట్టే అర్థం చేసుకోగ‌ల‌డు. దీంతో అత‌నికి స్కూల్‌లో, కాలేజీలో మంచి మార్కులు వ‌చ్చాయి. ఫ‌లితంగా చివ‌ర‌కు నీమ్రానాలో ఉన్న ఎన్ఐఐటీ యూనివ‌ర్సిటీలో కంప్యూట‌ర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అయితే చిన్న‌ప్ప‌టి నుంచి ప్ర‌తీక్ ఎన్నో స‌వాళ్ల‌ను ఎదుర్కొన్నాడు. త‌న‌ను స్కూల్స్‌లో, కాలేజీలో చేర్చుకునేందుకు చాలా మంది నిరాక‌రించారు. అయినా కొంద‌రు మ‌న‌స్సున్న మ‌హారాజుల ద‌య వ‌ల్ల అత‌ను అలా ఇంజినీరింగ్ పూర్తి చేశాడు.

అయితే ప్ర‌తీక్ ఫైన‌లియ‌ర్‌లో ఉండ‌గా అత‌ని కాలేజీలో క్యాంప‌స్ ఇంట‌ర్వ్యూల‌ను నిర్వ‌హించారు. అత‌ను చాలా కంపెనీల ఇంట‌ర్వ్యూల‌కు హాజ‌ర‌య్యాడు. అన్ని రౌండ్ల‌ను పూర్తి చేశాడు. అత‌ని ప‌ట్ల ఇంట‌ర్వ్యూయ‌ర్లు ఆస‌క్తిని కూడా చూపించారు. కానీ అత‌ను అంధుడు అయిన కార‌ణంగా అత‌నికి జాబ్ ఎవ‌రూ ఇవ్వ‌లేదు. దీంతో ప్ర‌తీక్ కొంత నిరాశ‌కు లోనైనా చివ‌ర‌కు తానే సొంతంగా ఓ కంపెనీ పెట్టాల‌ని అనుకున్నాడు. ఇంజినీరింగ్ ఫైన‌లియ‌ర్‌లో ఉండ‌గానే డేడ‌ల్ టెక్నోవేష‌న్స్ పేరిట ఓ కంపెనీని ఏర్పాటు చేశాడు. దాని స‌హాయంతో ఒక్కో మెట్టూ ఎదిగాడు. దీంతో అన‌తి కాలంలోనే అత‌ని కంపెనీ వృద్ధి చెందింది.

ప్ర‌తీక్ ఇప్పుడు ఒక కంపెనీలో జాబ్ వెదుక్కోవ‌డం లేదు. అత‌నే అంద‌రికీ జాబ్‌లు ఇస్తున్నాడు. అత‌ని వ‌ద్ద చాలా మంది ప‌నిచేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌లు దేశాల‌లోని ప‌లువురు క్ల‌యింట్ల‌కు అత‌ను సాఫ్ట్‌వేర్ సేవ‌ల‌ను అందిస్తున్నాడు. దిన దిన ప్ర‌వ‌ర్థ‌మానం ఎదుగుతున్నాడు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, జ‌ర్మ‌నీ, ఇండోనేషియా, సింగ‌పూర్‌, మ‌లేషియా దేశాల్లో ఇత‌ని కంపెనీకి క్ల‌యింట్లు ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌తీక్ ఇప్పుడు ఒక వ్య‌క్తిగా కాదు, ఒక శ‌క్తిగా ఎదిగాడు. అందుకు అత‌న్ని అంద‌రం అభినందించాల్సిందే..!

 

Comments

comments

Share this post

scroll to top