అతనికి రెండు కాళ్లు, రెండు చేతులూ లేవు… అయినా అనేక అంశాల్లో ప్రావీణ్యత సంపాదించాడు…

అవయవాలన్నీ సంక్రమంగా ఉండి, అన్నీ అనుకున్నట్టు అమరుతూ ఉన్నా కొందరు ఏదైనా పని చేయాలంటే సోమరితనం ప్రదర్శిస్తుంటారు. నా వల్ల కాదు, నేను చేయలేను, అది నాకు సూట్ అవదు… అంటూ నిరాసక్తతను ప్రదర్శిస్తుంటారు. లక్ష్యసాధనపై ఏమాత్రం శ్రద్ధ చూపరు. దీంతో వారు అన్నీ ఉన్నా ఎందుకూ పనికి రాని వారుగా మిగిలిపోతారు. ఈ క్రమంలో అలాంటి వారికి చెంప పెట్టులా ఆ వ్యక్తి తన సత్తా చాటుతున్నాడు. పుట్టుకతో వచ్చిన వ్యాధి కారణంగా రెండు చేతులు, రెండు కాళ్లను శాశ్వతంగా కోల్పోయినా తనలోనూ ప్రతిభ దాగి ఉందని, తాను కూడా అందరిలా ఏదో ఒకటి సాధించగలనని నిరూపిస్తున్నాడు. నిరూపించడమే కాదు, ఆ దిశగా పలు అంశాల్లో తన సత్తా కూడా చాటాడు. అతనే నిక్ వుజికిక్.

nick-vujicic

ఆస్ట్రేలియాకు చెందిన 33 ఏళ్ల నిక్ వుజికిక్‌కు ఫొకోమీలియా జెనిటికల్ వ్యాధి కారణంగా చిన్నతనంలోనే రెండు కాళ్లు, రెండు చేతులూ పోయాయి. దీంతో అతను అటు స్కూల్‌లో, ఇటు బయటా ఎక్కడా చూసినా అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. కొంత మందైతే నిత్యం అతన్ని అదే పనిగా హేళన చేసే వారు. ఏడిపించే వారు. ఈ క్రమంలో తీవ్ర మానసిక వేదనకు లోనైన నిక్ తన 10వ ఏట ఒకసారి ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేశాడు. అయితే అనుకోకుండా అతను ఆ ప్రయత్నాన్ని మానుకున్నాడు. అదే సందర్భంలో అతను ఓ దృఢమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. తానుకూడా జీవితంలో ఏదో ఒకటి సాధించాలని, అందరిలాగే ప్రశంసలు పొందాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా అతను తన ప్రయత్నాన్ని ప్రారంభించాడు. ఈ క్రమంలోనే అతను ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ పెయింటింగ్, స్విమ్మింగ్, స్కై డైవింగ్, సర్ఫింగ్ వంటి అంశాల్లో కఠోర శిక్షణ పొందాడు. అంతేకాదు ఆయా అంశాల్లో సాధారణ వ్యక్తులతో పోటీ పడి ఎన్నో విజయాలు కూడా సాధించాడు.

కేవలం పైన చెప్పిన అంశాలే కాదు. నిక్‌లో మంచి వక్త కూడా దాగి ఉన్నాడు. ఎంతో మందికి ప్రేరణనిచ్చే విధంగా అతను చెప్పే మాటలు, చేసే ఉపన్యాసాలు అతని లాంటి ఎంతో మందికి ఓ మార్గం చూపాయి. ఎలాంటి అంగ వైకల్యం ఉన్న వారైనా తాము తలచుకుంటే సాధించలేనిది అంటూ ఏదీ ఉండదనే దిశగా నిక్ ఉపన్యాసాలు ఎంతో మందికి ప్రేరణనిస్తున్నాయి. అతను ఇప్పటికే ఎన్నో దేశాలు తిరిగి అలాంటి ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చాడు. తన జీవన గమనంలో భార్య, ఇద్దరు పిల్లలు కూడా తోడయ్యారు. కాగా నిక్ తన జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని ఓ పుస్తకాన్ని కూడా రాశాడు. ఆ పుస్తకం అతనికి అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పేరు ప్రఖ్యాతులను తెచ్చి పెట్టింది. చూశారుగా నిక్ ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యం కోల్పోని, పట్టు సడలని సంకల్పాన్ని. అతన్ని ఆదర్శంగా తీసుకుంటే ఎవరైనా, జీవితంలో ఏదైనా సాధించవచ్చు కదా!

Comments

comments

Share this post

scroll to top