చిత్తు కాగితాలు ఏరుకునే అత‌ను ఇప్పుడు ల‌క్ష‌ల ట‌ర్నోవ‌ర్ ఉన్న కంపెనీకి య‌జ‌మాని..! ఎలాగో తెలుసా?

అది 1994వ సంవ‌త్స‌రం. అప్పుడ‌త‌ని వ‌య‌స్సు 17 సంవ‌త్స‌రాలు. ఆ వ‌య‌స్సులో ఉండే యువ‌త ఎవ‌రైనా సాధార‌ణంగా కాలేజీల‌కు వెళ్తారు. ఎంజాయ్ చేస్తారు. స‌ర‌దాగా ఆడుతూ పాడుతూ గ‌డిపే వ‌య‌స్సు అది. కానీ అత‌నిది పేద కుటుంబం కావ‌డంతో వాట‌న్నింటికీ దూర‌మ‌య్యాడు. కుటుంబ భారాన్ని నెత్తిన వేసుకున్నాడు. ఓ వైపు క‌డు పేద‌రికం. మ‌రో వైపు ఏం చేయాలో తెలియ‌ని స్థితి. అప్పుడే అత‌ను ఉన్న ఊరిని, క‌న్న‌వారిని విడిచి పెట్టి దూరంగా న‌గ‌రానికి ప్ర‌యాణ‌మ‌య్యాడు. ఏం ప‌ని చేయాలా అని ఎదురు చూస్తున్న అత‌నికి ఓ ప‌ని దొరికింది. రోజుకు రూ.150 దాకా వ‌స్తుంద‌ని తెలిసి ఆనంద‌ప‌డ్డాడు. వెంట‌నే ప‌నిలో చేరాడు. అది… చిత్తు కాగితాలు, ప్లాస్టిక్‌, ఇత‌ర వ్యర్థాలు ఏరే ప‌ని..! అవును… అత‌ని కెరీర్ ఆ ప‌నితోనే ప్రారంభ‌మైంది. అయితే అందులోనే అత‌ను విజ‌య‌వంతంగా ముందుకు దూసుకెళ్తున్నాడు. ఒక‌ప్పుడు నెల‌కు రూ.4500 వ‌ర‌కు సంపాదించిన అత‌నే ఇప్పుడు ఏక‌గా రూ.11 ల‌క్ష‌ల వ‌ర‌కు సంపాదిస్తూ త‌న‌ను హేళ‌న చేసిన వారే ముక్కున వేలేసుకునేలా చేశాడు.

అత‌ని పేరు జ‌య ప్ర‌కాష్ చౌద‌రి. అది 1994వ సంవ‌త్స‌రం. అప్పుడ‌త‌ని వ‌య‌స్సు 17 ఏళ్లు. ఉంటున్న‌ది బీహార్‌లోని ముంగ‌ర్ జిల్లాలో ఉన్న ఓ మారుమూల గ్రామం. త‌ల్లిదండ్రుల‌తోపాటు అత‌నికి 5 మంది అక్క చెల్లెల్లు, 4 మంది అన్న‌ద‌మ్ముళ్లు ఉన్నారు. అయితే ప్ర‌కాష్ ది పేద కుటుంబం. రెక్కాడితే గానీ డొక్కాడ‌దు. దీంతో అత‌నిపై కూడా కుటుంబ పోష‌ణ భారం ప‌డింది. అయితే గ్రామాల్లో ప‌ని ఎక్క‌డ దొరుకుతుంది చెప్పండి..? అందుకే ప్ర‌కాష్ వెంట‌నే అంద‌రినీ విడిచిపెట్టి ఢిల్లీకి వెళ్లాడు. త‌న సంపాద‌న‌తోనైనా కుటుంబ భారం కొంత తీర్చ‌వ‌చ్చ‌ని అత‌ని ఆశ‌. ఈ క్ర‌మంలోనే ఢిల్లీకి చేరుకున్న అత‌నికి రూ.150 రోజువారీ కూలీ ఇచ్చే ప‌ని దొరికింది. అత‌ను చేయాల్సింద‌ల్లా రోజంతా తిరిగి చిత్తు కాగితాలు, ప్లాస్టిక్, ఇత‌ర వ్య‌ర్థాల‌ను ఏరుకుని గోడౌన్‌లో అంద‌జేయ‌డ‌మే.

అయితే ఈ ప‌నిలో త‌మ య‌జ‌మానులు గ‌డిస్తున్న ఆదాయం చూసిన ప్ర‌కాష్ కు ఓ ఆలోచ‌న వ‌చ్చింది. వెంట‌నే దాన్ని కార్యాచ‌ర‌ణ‌లో పెట్టాడు. చింత‌న్ అనే ఓ స్థానిక స్వ‌చ్ఛంద సంస్థ స‌హ‌కారంతో అత‌ను సొంతంగా స్క్రాప్ గోడౌన్ పెట్టాడు. అన‌తి కాలంలోనే అత‌ను దాని ద్వారా ఆదాయం సంపాదించ‌డం మొద‌లు పెట్టాడు. అలా అత‌ను ఎద‌గ‌డ‌మే కాదు, ఘజియాబాద్‌, ఢిల్లీల్లో రెండు కొత్త రీసైక్లింగ్ సెంట‌ర్‌ల‌ను పెట్టి వాటిల్లో త‌న లాంటి 160 మందికి ప‌నిచ్చాడు. ఈ క్రమంలోనే అదే స్వ‌చ్ఛంద సంస్థ స‌హ‌కారంతో స‌ఫాయిసేన అనే స్వ‌చ్ఛంద సంస్థ‌ను ప్ర‌కాష్ ఏర్పాటు చేశాడు. వాటి ద్వారా మ‌రింత మందికి ప‌నివ్వ‌డ‌మే కాదు, వారికి కావల్సిన ఆర్థిక స‌హ‌కారాన్ని కూడా అందిస్తున్నాడు. దీంతో ప్రకాష్ దిన దిన ప్ర‌వ‌ర్థ‌మానం ఎదిగి ఇప్పుడు స్క్రాప్‌పై ఏకంగా నెల‌కు రూ.11 ల‌క్ష‌లను సంపాదిస్తున్నాడు.

ఈ క్ర‌మంలోనే ప్ర‌కాష్ లాంటి ఔత్సాహికుల‌కు స్క్రాప్ నిర్వ‌హ‌ణ‌, ఇత‌ర అంశాల‌పై చింత‌న్ శిక్ష‌ణ‌నిస్తోంది. ఇక ప్ర‌కాష్ అయితే చింత‌న్ త‌ర‌ఫున వివిధ దేశాల్లో ప‌ర్య‌టించి అక్క‌డ ప‌లు స‌మావేశాల్లో చెత్త రీసైక్లింగ్‌పై ప్ర‌సంగాలు ఇచ్చాడు కూడా. అయితే తాజాగా వ‌చ్చిన జీఎస్టీ వ‌ల్ల చెత్త నిర్వ‌హ‌ణ‌కు కొంత ఆటంకం క‌లుగుతుంద‌ని, అదే దీనిపై జీఎస్టీ లేకుండా చేస్తే ఇంకా చాలా మందికి ఉపాధి దొర‌క‌డ‌మే కాదు, చెత్త లేని ప‌రిశుభ్ర‌మైన ప్రాంతంగా మ‌న దేశం మారుతుంద‌ని ప్ర‌కాష్ అంటున్నాడు. మ‌రి అత‌ని విజ్ఞ‌ప్తిని కేంద్రం ప‌ట్టించుకుంటుందా..? చూడాలి. ఏది ఏమైనా అలా నిరుపేద‌గా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు నెల‌కు ల‌క్ష‌ల రూపాయల‌ను సంపాదించే స్థాయికి చేరాడంటే ప్ర‌కాష్ కృషిని మ‌నం అభినందించాల్సిందే. అన్న‌ట్టు ఢిల్లీలో ప్ర‌కాష్‌ను అంద‌రూ ఏమ‌ని పిలుచుకుంటారో తెలుసా..? స‌ంతు.. అని..!

Comments

comments

Share this post

scroll to top