ఒంటిమీద బనియన్, నెక్కరు తో కనిపిస్తున్న వ్యక్తి మనకు మామూలు వ్యక్తే కావొచ్చు, కానీ ఆ ప్రదేశంలో ఉన్న వారికి మాత్రం అతను దేవుడే. ఎందుకంటే స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా ఇంకా కరెంటు అంటే తెలియని, పాఠశాల, హాస్పిటల్ సౌకర్యాలు లేని ఓ మారుమూల గిరిజన తండాను ఇప్పుడు అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నాడు అతను. అందుకే ఆయనంటే అక్కడి వారికి అమితమైన గౌరవం, భక్తి. చేస్తున్న డాక్టర్ ఉద్యోగాన్ని వదిలి మరీ గిరిజనుల బాగు కోసం, వన్య ప్రాణుల సంరక్షణ కోసం భార్యతో కలిసి నడుం బిగించిన దార్శనికుడు అతను. అతనే డాక్టర్ ప్రకాష్ బాబా ఆమ్టే.
మెగసెసె అవార్డు గ్రహీత అయిన బాబా ఆమ్టే కుమారుడే డాక్టర్ ప్రకాష్ బాబా ఆమ్టే. ఆయన భార్య మందాకిని ఆమ్టే. అది 1973వ సంవత్సరం. ప్రకాష్ ఆమ్టే ఎంబీబీఎస్ చదివి ఎంఎస్ చేస్తున్నాడు. అయితే గిరిజన తండాల అభివృద్ధి కోసం ఆయన పాటుపడదలచి వారి కోసం ప్రత్యేకంగా లోక్ బిరాదరి ప్రకల్ప్ అనే ప్రాజెక్టును ఏర్పాటు చేశాడు. అందుకోసం మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఉన్న హేమల్కసా అనే మారుమూల గ్రామాన్ని ఎంచుకుని అక్కడ తనకు కొంత భూమి ఇవ్వాలని ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నాడు. అనుమతి లభించగానే చేస్తున్న ఎంఎస్ వదిలి భార్యతో సహా ఆ గ్రామానికి వెళ్లాడు. అయితే అక్కడ అన్నీ సమస్యలే అతనికి కనిపించాయి.
ఆ గ్రామంలో అప్పటికి ఇంకా కరెంటు లేదు. పాఠశాల, హాస్పిటల్ అంటేనే వారికి తెలియదు. అంతటి మారుమూల పల్లెను ప్రకాష్ ఆమ్టే 3 విధాలుగా అభివృద్ధి చేయదలుచుకున్నాడు. అందులో ఒకటి లోక్ బిరాదరి ప్రకల్ప్ దవాఖానా (హాస్పిటల్), లోక్ బిరాదరి ప్రకల్ప్ ఆశ్రమ్ (పాఠశాల), ఆమ్టేస్ యానిమల్ పార్క్. స్థానిక గిరిజనుల ఆరోగ్యం కోసం హాస్పిటల్, వారి పిల్లల కోసం పాఠశాలను ఏర్పాటు చేయాలనేది ఆ ప్రాజెక్టుల ముఖ్య ఉద్దేశం. అంతేకాదు స్థానికులు తమ ఆహారం కోసం ఎక్కువగా వన్య ప్రాణులపై ఆధార పడుతుండడంతో వాటిని సంరక్షించడం కోసం ఆమ్టే ఓ ప్రణాళిక రచించాడు. తన వద్ద ఉన్న ఆహారాన్ని వారికి ఇచ్చి వారు పట్టుకున్న వన్య ప్రాణులను తన యానిమల్ పార్క్‌లో పెంచడం ప్రారంభించాడు.
అలా ప్రకాష్ ఆమ్టే వద్ద ఇప్పుడు అనేక చిరుతపులులు, ఎలుగుబంట్లు, పాములు, పక్షులు, జింకలు, గుడ్లగూబలు, మొసళ్లు, హైనాలు, కోతులు ఉన్నాయి. వాటన్నింటికీ ఆయనే సంరక్షకుడు. అయితే వన్య మృగాలను హ్యాండిల్ చేయడమంటే అంత సులువు కాదు. కొన్ని క్రూర మృగాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు చిరుత పులులు. అయినా ప్రకాష్ ఆమ్టే వాటితో సాంగత్యం చేయడం మొదలు పెట్టాడు. ఇప్పుడు ఆయన ఏం చెబితే అవి అలాగే చేస్తాయి. అంతగా అవి ఆయనకు దగ్గరయ్యాయి. ఈ క్రమంలో ఆయన స్థాపించిన హాస్పిటల్ ద్వారా ఇప్పుడు ఏడాదికి దాదాపుగా 40వేల మంది స్థానికులకు వైద్యం అందుతోంది. ఆయన ఏర్పాటు చేసిన పాఠశాలలో ఇప్పుడు 600కు పైగా పిల్లలు చదువుకుంటున్నారు. ఇదంతా ఆయన చలవే అంటారు స్థానికులు.
ప్రకాష్ ఆమ్టే చేసిన కృషికి గాను ఆయనకు ఎన్నో అవార్డు కూడా లభించాయి. 2014లో మదర్ థెరిస్సా అవార్డు, 2012లో లోకమాన్య తిలక్ అవార్డు, 2009లో గాడ్ఫ్రే ఫిలిప్స్ లైఫ్‌టైం అచీవ్మెంట్ అవార్డు, 1984లో ఆదివాసీ సేవక్ అవార్డులు ఆయన్ను వరించాయి. 2008లో ఆయనకు, ఆయన భార్యకు కలిపి ప్రఖ్యాత రామన్ మెగసెసె అవార్డును ప్రదానం చేశారు. 2002లో ఆయనకు పద్మశ్రీ కూడా వచ్చింది. అంత సాధించినా ఆయన ఇంకా ఆ గిరిజన వాసులతోనే ఇప్పటికీ జీవిస్తున్నాడు. జీవితాంతం తాను మరణించే వరకు గిరిజనుల సేవకే అంకితమవుతానంటున్నాడు ప్రకాష్ ఆమ్టే. అన్నట్టు, ఇంకో విషయం. ఆయన జీవితంపై ఓ సినిమా కూడా తీశారు. నానాపటేకర్, సోనాలి కులకర్ణిలు ప్రధాన పాత్రల్లో డాక్టర్ ప్రకాష్ బాబా ఆమ్టే : ది రియల్ హీరో దాని పేరు. మొనాకో ప్రభుత్వమైతే ఆయన, ఆయన భార్య పేరిట ఓ స్టాంపును కూడా విడుదల చేసింది. ఇప్పుడు చెప్పండి, డాక్టర్ ప్రకాష్ బాబా ఆమ్టే నిజంగా రియల్ హీరోనే కదా..!