అతను పెద్దగా చదువుకోలేదు. అయినా చిన్న వయస్సులోనే సైబర్‌ సెక్యూరిటీ నిపుణుడు అయ్యాడు ఎలాగో తెలుసా..?

కృషి, పట్టుదల, సంకల్పం.. ఈ మూడింటితోపాటు ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలనే తపన ఉంటే చాలు. ఎవరైనా ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు. అద్భుతాలు చేసి చూపించవచ్చు. అవును, సరిగ్గా ఇలా అనుకున్నాడు కాబట్టే అతను అత్యంత పిన్న వయస్సులోనే సైబర్‌ సెక్యూరిటీ నిపుణుడు అయ్యాడు. దీంతో దేశ విదేశాల్లో అతని పేరు మారుమోగిపోతోంది. చిన్న వయస్సులోనే సైబర్‌ సెక్యూరిటీ నిపుణుడిగా మారడంతోపాటు ఏకంగా ఆ రంగంలో సొంత కంపెనీని ఏర్పాటు చేసి ప్రముఖ కార్పొరేట్‌ సంస్థలకు ఐటీ సెక్యూరిటీ అడ్వయిజర్‌గా సేవలు అందిస్తున్నాడు. ఇక మన దేశంలోనూ అతను అనేక కంపెనీలకు, ప్రభుత్వాలకు కూడా సెక్యూరిటీ నిపుణుడిగా సేవలు అందిస్తున్నాడు. ఇంతకీ అతను ఎవరంటే…

అతని పేరు ట్రిష్నేట్‌ అరోరా. వయస్సు 23 సంవత్సరాలు. ఇతను ఏ ఐఐటీలోనూ చదవలేదు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాడు. ఇతనికి చిన్నప్పటి నుంచే కంప్యూటర్‌ అంటే పిచ్చి. చాలా ఆసక్తి చూపించేవాడు. 8వ తరగతి నుంచి కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌పై పట్టు సాధించేందుకు నిరంతరం అనేక కోర్సులను అభ్యసించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో అతనికి తన తల్లిదండ్రుల నుంచి కూడా ఫుల్‌ సపోర్ట్‌ లభించింది. అలా 11వ ఏట నుంచే అతనికి కంప్యూటర్‌ లాంగ్వేజెస్‌పై గ్రిప్‌ వచ్చింది. అనంతరం వాటిలో అతను సొంతంగా పరిశోధనలు చేయడం మొదలు పెట్టాడు. దీంతోపాటు స్కూల్‌ లో చదవకుండానే ఓపెన్‌గా పరీక్ష రాసి 10వ తరగతి పాస్‌ అయ్యాడు. అంతే.. తరువాత అతను ఏమీ చదవలేదు. అయినా క్రమంగా కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ను సాధన చేస్తూ వెళ్లాడు.

చివరకు 21 సంవత్సరాల వయస్సు వచ్చే సరికి అతను ఏకంగా TAC security Solutions అనే సైబర్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌ కంపెనీ పెట్టాడు. ఇక అప్పటి నుంచి అతను వెనుదిరిగి చూడలేదు. ఎన్నో కంపెనీలకు సేవలనందించడం ప్రారంభించాడు. ఏదైనా కంపెనీకి చెందిన వెబ్‌సైట్‌ లేదా సాఫ్ట్‌వేర్‌ ఉంటే దాన్ని ఎలా హ్యాక్‌ చేయాలో చెప్పేవాడు. ఆయా కంపెనీలకు ఎథికల్‌ హ్యాకర్‌గా సేవలు అందించేవాడు. హ్యాకర్ల నుంచి ఎలా సురక్షితంగా ఉండాలో కంపెనీలకు సూచనలు, సలహాలు ఇచ్చేవాడు.

హ్యాకర్లు ఎలా పనిచేస్తారు, వారు కంపెనీలను ఎలా టార్గెట్‌ చేస్తారు వంటి అనేక అంశాలపై ట్రిష్నేట్‌ అరోరా అనేక దేశాల్లో ఉపన్యాసాలు కూడా ఇచ్చాడు. దీంతోపాటు అతను హ్యాకింగ్‌పై రెండు పుస్తకాలను కూడా రాశాడు. అవి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరుగాంచాయి. హ్యాకింగ్‌ ఎరా, హ్యాకింగ్‌ విత్‌ స్మార్ట్‌ ఫోన్స్‌ అనే పుస్తకాలను అరోరా రాయగా వాటికి బాగా పాపులారిటీ లభించింది. ఇక 23 ఏళ్లు వచ్చే సరికి అతను ఎథికల్‌ హ్యాకర్‌గా మరింత రాటుదేలాడు. దీంతో అతను మన దేశంలో సీబీఐ వారికి సహాయం చేస్తున్నాడు. ఫోన్లను, ఈ-మెయిల్స్‌ను ఎలా ట్రాప్‌ చేయాలో అతను వారికి నేర్పిస్తున్నాడు.

ఇక ముకేష్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ గ్రూప్‌ కూడా అరోరాను తమ కంపెనీ సెక్యూరిటీ సలహాదారుడిగా నియమించుకుంది. అలాగే యూకే, సింగపూర్‌లకు చెందిన పలు కంపెనీలకు ఇతను తన కంపెనీ ద్వారా సైబర్‌ సెక్యూరిటీ సేవలను అందిస్తున్నాడు. ఈ క్రమంలో అరోరా సేవలను పొందేందుకు అనేక కంపెనీలు కూడా ఆసక్తిగా ముందుకు వస్తున్నాయి. ఏది ఏమైనా ట్రిష్నేట్‌ అరోరా ప్రతిభ అమోఘం కదా. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు నచ్చిన పని చేయనివ్వాలి. అలా చేస్తేనే వారు తమ లక్ష్యాన్ని సాధించి ఇలా ఉన్నత శిఖరాలకు చేరుకోగలుగుతారు..!

 

Comments

comments

Share this post

scroll to top