ఆ సొరంగ మార్గంలో దెయ్యం ఉంద‌ట తెలుసా..? అయినా అంద‌రితో స్నేహంగా మాట్లాడుతుంద‌ట‌..!

దెయ్యం… ఈ పేరు చెప్ప‌గానే చాలా మంది భ‌య‌ప‌డ‌తారు. కొంద‌రైతే జ‌డుసుకుంటారు. చీక‌ట్లో ఒంట‌రిగా బ‌య‌టికి వెళ్లలేరు. ఒంట‌రిగా ఉండ‌లేరు. కానీ కొంద‌రు అస‌లు దెయ్యాలు లేవ‌ని కొట్టి పారేస్తారు. అయితే దెయ్యాలు ఉన్నా లేకున్నా అవి మ‌నుషుల‌ను చిత్ర‌హింస‌లు పెడ‌తాయ‌ని, చంపుతాయ‌ని, మనుషుల రక్తం తాగుతాయ‌ని అనేక మంది న‌మ్ముతారు. కానీ మీకు తెలుసా..? మ‌నుషుల‌తో స్నేహంగా ఉండే దెయ్యాలు కూడా ఉంటాయ‌ట‌. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. అలాంటి దెయ్యం ఒక‌టి సిమ్లాలోని ఆ ప్రాంతంలో ఉంద‌ట తెలుసా..? ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే…

అది సిమ్లా. చ‌క్క‌ని ఆహ్లాద‌క‌ర‌మైన, ప్ర‌శాంత వాతావ‌ర‌ణానికి పెట్టింది పేరు. ఎంతో మంది టూరిస్టులు సిమ్లాకు వెళ్తుంటారు. అయితే అక్క‌డ ఉండే క‌ల్కా-సిమ్లా రూట్‌లో తిరిగే బొమ్మ ట్రెయిన్ చాలా ఫేమ‌స్‌. అందులో బోగీలు 2 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడ‌ల్పు ఉంటాయి. వాటిలో కూర్చుని టూరిస్టులు ప్ర‌యాణం చేస్తారు. అయితే ఆ ట్రెయిన్ వెళ్లే మార్గంలో బ‌రోగ్ అనే స్టేష‌న్ వ‌ద్ద‌ 33వ నంబ‌ర్ పేరిట ఓ సొరంగం ఉంది. దాన్ని దాటాలంటే బొమ్మ ట్రెయిన్‌లో సుమారు 2 నిమిషాలు ప‌డుతుంది. అయితే ఆ సొరంగంలో ఓ వ్య‌క్తి ఆత్మ ఇప్ప‌టికీ తిరుగుతుంద‌ని అక్క‌డి వారు న‌మ్ముతారు. అది విదేశీయుడి ఆత్మ కావ‌డం విశేషం.

అత‌ని పేరు క‌ల్న‌ల్ బ‌రోగ్‌. అది ఇప్పటి మాట కాదు, 1898వ సంవ‌త్స‌రం నాటి మాట‌. క‌ల్న‌ల్ బ‌రోగ్‌కు క‌ల్కా-సిమ్లా రూట్‌లో రైల్వే ట్రాక్ నిర్మించ‌మ‌ని చెప్పి అప్ప‌టి బ్రిటిష్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆ రూట్ ట్రాక్ నిర్మాణ బాధ్య‌త‌లు అత‌నిపై ప‌డ్డాయి. అయితే ఆ రూట్ మొత్తం రాళ్లు, ర‌ప్ప‌ల‌తో బాగా నిండి ఉండేది. దీంతో ఒకే తోవ‌లో ట్రాక్ వేస్తూ పోతే క‌ష్టం అవుతుంద‌ని భావించి, కూలీల‌ను చెరో వైపుకు పంపాడు బ‌రోగ్‌. వారు స‌రైన కొల‌తలు లేకుండా ట్రాక్ వేస్తూ వ‌చ్చార‌ట‌. దీంతో ఆ ట్రాక్ లు రెండు క‌ల‌వ‌లేదు. ఒక‌టి ఓ వైపుకు వెళితే, ఇంకోటి మ‌రోవైపుకు వెళ్లింది. దీంతో బ్రిటిష్ అధికారులు బ‌రోగ్‌కు అప్ప‌ట్లో రూ.1 ఫైన్ వేశారు. అత‌న్ని ఉద్యోగం నుంచి తీసేశారు. ఆ బాధ భ‌రించ‌లేక అదే నిర్మాణంలో ట్రాక్స్ ద‌గ్గ‌ర బ‌రోగ్ గ‌న్‌తో పేల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు.

దీంతో బ‌రోగ్ మృత‌దేహాన్ని స‌ద‌రు నిర్మాణంలో ఉన్న ట్రాక్స్‌కు (ఇప్పుడు క‌ల్కా – సిమ్లా నేష‌న‌ల్ హైవేకు 1 కిలోమీట‌ర్ దూరం) కొంత దూరంలో పూడ్చి పెట్టారు. ఆ త‌రువాత బ‌రోగ్ దెయ్యం అయ్యాడ‌ట‌. అత‌ను ఆ నిర్మాణంలో ఉన్న ట్రాక్స్ వ‌ద్ద అంద‌రికీ రాత్రి పూట క‌నిపించేవాడ‌ట‌. అయితే అత‌ని ఆత్మ ఎవ‌రినీ ఏం చేసేది కాద‌ట‌, పైగా క‌నబ‌డిన వారితో అత‌ని ఆత్మ స్నేహంగా మాట్లాడేద‌ట‌. ఈ క్ర‌మంలో బ‌రోగ్ త‌రువాత నియామ‌క‌మైన హెచ్ఎస్ హెర్లింగ్‌ట‌న్ అనే అధికారి అక్క‌డే ఉండే బాబా భ‌ల్కు అనే ఓ స‌న్యాసి స‌హ‌కారంతో పూజ‌లు అవీ చేయించి ఎట్ట‌కేల‌కు ఆ ట్రాక్ నిర్మాణం పూర్తి చేశాడ‌ట‌. దీంతో అక్క‌డ సొరంగ మార్గం ఏర్ప‌డింది. దానికి 33వ నంబ‌ర్ ఇచ్చారు. ఆ సొరంగ మార్గంలో ఇప్ప‌టికీ బ‌రోగ్ ఆత్మ క‌నిపిస్తుంద‌ని ప‌ర్యాట‌కులు చెబుతారు. ఇక అత‌ని పేరు మీదుగానే ఆ సొరంగ మార్గం వ‌ద్ద ఉన్న రైల్వే స్టేష‌న్‌కు బ‌రోగ్ స్టేష‌న్ అని పేరు పెట్టారు. అక్క‌డ ఈ క‌థ‌తో ఓ బోర్డు కూడా మ‌న‌కు క‌నిపిస్తుంది..!

Comments

comments

Share this post

scroll to top