జీఎస్‌టీ రేట్ ఫైండర్ యాప్ వచ్చింది తెలుసా..? దీంతో వస్తువులు, సేవలకు ఎంత జీఎస్‌టీ చెల్లిస్తున్నారో ఇట్టే తెలుసుకోవచ్చు..!

ఈ నెల 1వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా జీఎస్‌టీ బిల్లు అమలులోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో పలు వస్తువుల ధరలు పెరగగా, కొన్నింటివి తగ్గాయి. ఈ క్రమంలో పలు శ్లాబుల్లో జీఎస్‌టీని అమలు పరుస్తున్నారు కూడా. అయితే వ్యాపారుల సంగతి పక్కన పెడితే సాధారణ ప్రజల్లో జీఎస్‌టీ గురించి పలు సందేహాలు ఉన్నాయి. ఏ వస్తువులు, సేవలు ఏ శ్లాబుల్లో ఉన్నాయో, వేటికి ఎంత జీఎస్‌టీ పడుతుందో తెలుసుకోవడం ఇబ్బందికరంగా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే కేంద్ర ఎక్సైజ్, కస్టమ్స్ బోర్డు నూతనంగా జీఎస్‌టీ రేట్ ఫైండర్ (GST Rate Finder) పేరిట ఓ యాప్‌ను విడుదల చేసింది.

తాజాగా విడుదలైన జీఎస్‌టీ రేట్ ఫైండర్ యాప్ ఆండ్రాయిడ్ యూజర్లకు లభిస్తున్నది. ఆండ్రాయిడ్ 4.0 ఆపైన వెర్షన్ ఉన్న ఫోన్లలో ఈ యాప్‌ను యూజర్లు ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇక ఇదే యాప్ త్వరలో ఐఓఎస్ యూజర్లకు కూడా అందుబాటులోకి రానుంది. అయితే ఆండ్రాయిడ్ యూజర్లు ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న దాన్ని ఓపెన్ చేస్తే హోం పేజ్‌లో మూడు ఆప్షన్లు దర్శనమిస్తాయి. Tax Rates : Goods, Tax Rates: Services, Information@CBEC పేరిట 3 ఆప్షన్లు ఉంటాయి.

జీఎస్‌టీ రేట్ ఫైండర్ హోం పేజిలో ఉన్న 3 ఆప్షన్లలో Tax Rates: Goods ఆప్షన్‌ను ఎంచుకుంటే అందులో జీఎస్‌టీ ప్రస్తుతం అమలవుతున్న శ్లాబుల వివరాలు కనిపిస్తాయి. 0, 0.25, 3, 5, 12, 18, 28 పేరిట శాతాలు ఉంటాయి. వాటిలో ఏదైనా ఆప్షన్‌ను ఎంచుకుంటే సదరు జీఎస్‌టీ శ్లాబు శాతంలో ఉన్న వస్తువుల వివరాలను తెలుసుకోవచ్చు. దీంతో వినియోగదారులు తాము కొంటున్న వస్తువుకు ట్యాక్స్ ఎంత పడుతుందో కచ్చితంగా తెలుస్తుంది. తేడా ఉంటే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు కూడా. ఇక హోం పేజీలో ఉన్న Tax Rates: Services ఆప్షన్‌లోకి వెళ్తే 0, 5, 12, 18, 28 శ్లాబుల్లో ఆ వివరాలు ఉంటాయి. మనం పొందే ఆయా సేవల్లో దేనికి ఎంత జీఎస్‌టీ పడుతుందో ఈ శ్లాబుల శాతాల్లో తెలుసుకోవచ్చు. ఒక వేళ ఎవరైనా అంతకు మించి వసూలు చేస్తే మనం ఫిర్యాదు చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా జీఎస్‌టీ రేట్ ఫైండర్ యాప్‌లో హోం పేజిలో ఉండే Information@CBEC అనే ఆప్షన్‌ను ఎంచుకుంటే యూజర్లు సెంట్రల్ ఎక్సైజ్ బోర్డు వెబ్‌సైట్‌కు రీడైరెక్ట్ అవుతారు. దీంతో జీఎస్టీ గురించిన మిగిలిన వివరాలను తెలసుకోవచ్చు..!

Comments

comments

Share this post

scroll to top