జీఎస్టీ స‌రే సామాన్యుల మాటేమిటి..?

ఏ ముహూర్తాన మోడీ స‌ర్కార్ కొలువు తీరిందో అప్ప‌టి నుండి పేదోళ్ల బ‌తుకులకు భ‌రోసా లేకుండా పోయాయి. దేశ భ‌విష్య‌త్‌కు ఆధార‌మైన రిజ‌ర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఏ స‌మ‌యంలో ఏ నిర్ణ‌యం తీసుకుంటుందో తెలియ‌ని ప‌రిస్థితి దాపురించింది. 2016 అర్ధ‌రాత్రి ప్ర‌ధాన‌మంత్రి చేసిన నోట్ల ర‌ద్దు దెబ్బ‌కు కోట్లాది ప్ర‌జ‌లు రోడ్ల‌పైకి వ‌చ్చారు. ల‌బోదిమంటూ నానా తిప్ప‌లు ప‌డ్డారు. త‌మ డ‌బ్బులు తాము తీసుకునేందుకు ఏటీఎంల వ‌ద్ద బారులు తీరి నిల‌బ‌డ్డారు. ఆర్థిక మంత్రి జైట్లీ నిమ్మ‌కు నీరుండి పోయారు. గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్న ఊర్జిత్ ప‌టేల్ ఈ అసాధార‌ణ‌మైన నిర్ణ‌యానికి మ‌ద్ధ‌తు ప‌లికారు.

అన్ని వ‌స్తువుల‌కు ఒకే ధ‌ర నిర్ణ‌యించాలనే ఉద్ధేశంతో ఏర్పాటు చేసిన జీఎస్టీ ఇంకా కొలిక్కి రాలేదు. ఇప్ప‌టికే అయిదేళ్లు పూర్తి కావ‌స్తోంది. మ‌ళ్లీ ఎలాగైనా స‌రే అధికారంలోకి రావాల‌నే ఉద్ధేశంతో పెంచిన వ‌స్తువుల ధ‌ర‌ల‌ను తిరిగి త‌గ్గిస్తున్న‌ట్లు విత్త మంత్రి ప్ర‌క‌టించారు. బీజేపీ ఈ నిర్ణ‌యాన్ని అన్ని విప‌క్షాలు తీవ్రంగా ఆక్షేపించాయి. అయినా ప‌ట్టించు కోలేదు. కొన్ని రోజులు పోతే కొత్త సంవ‌త్స‌రంలోకి అడుగు పెడ‌తాం. మ‌ళ్లీ ష‌రా మామూలే. ఇప్ప‌టికే మూడు రాష్ట్రాల్లో బీజేపీ త‌న అధికారాన్ని కోల్పోయింది. మ‌రో వైపు కాంగ్రెస్ ప‌వ‌ర్‌లోకి రావాల‌ని మోడీని, బీజేపీ ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేస్తోంది.

ఆర్థిక వ్య‌వ‌స్థ అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన స్థితిలోకి నెట్ట‌బ‌డింది. నిరుద్యోగ సూచీ పెరిగింది. అభివృద్ధి రేటు త‌గ్గింది. ప్ర‌జ‌ల‌కు జ‌వాబుదారీగా ఉండాల్సిన మోడీ అండ్ టీం ఇపుడు పాల‌న‌ను గాలికి వ‌దిలేసింది. ఎడా పెడా ప‌న్నులు పెంచుకుంటూ పోతోంది. ఆదాయమే ల‌క్ష్యంగా సామాన్యుల వీపుల మోత మోగిస్తోంది. ఆర్థిక మంత్రి ఇటీవ‌ల కొన్ని వ‌స్తువులపై జీఎస్టీ త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. దీని వ‌ల్ల దాదాపు 5 వేల కోట్ల ఆదాయానికి గండి ప‌డుతోంద‌ని మంత్రి వెల్ల‌డించారు.

క్రిస్మ‌స్ కానుక‌గా క‌మ‌ల‌నాథులు ప్ర‌క‌టిస్తే..రాహుల్ గాంధీ ఇదంతా ఎన్నిక‌ల జిమ్మిక్కుగా కొట్టి పారేశారు. అంత‌టా ఒకే ప‌న్ను విధానం ఉన్న‌ప్ప‌టికీ ఎక్క‌డా క్లారిటీ అంటూ రావ‌డం లేదు. సీఎలు, ఆడిట‌ర్లు, చోటా మోటా ఆప‌రేట‌ర్లు ల‌క్ష‌లు వెన‌కేసుకుంటున్నారు. చిన్న టీ కొట్టు పెట్టుకున్నా జీఎస్టీ క‌ట్టాల్సి రావ‌డం దౌర్భాగ్యం కాక మ‌రేమిటి. పోనీ మోడీని ఎదుర్కొనే చ‌రిస్మా క‌లిగిన నేత‌లు ఎవ‌రైనా ఉన్నారా అంటే ఈ దేశంలో ఇంకా అలాంటి వాతావ‌ర‌ణ‌మే లేకుండా పోయింది.

ఓ వైపు చంద్ర‌బాబు ఇంకో వైపు కేసీఆర్‌లు బీజేపీయేత‌ర శ‌క్తుల‌ను ఏకం చేసేందుకు ఏపీ సీఎం ట్రై చేస్తుంటే..ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ గాలిమోట‌ర్ల‌లో తిరుగుతున్నారు. ఇదో ర‌క‌మైన రాజ‌కీయం. అంద‌రి టార్గెట్ ఒక్క‌టే రేప‌టి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌ను టార్గెట్ చేసింది ఆర్థిక శాఖ‌. ఓట్లను రాబ‌ట్టుకునేందుకు ఇప్ప‌టి నుండే ప్లాన్స్ ప్రారంభ‌మ‌య్యాయి. మోడీ, షా ప‌రివారం ఇందు కోసం బీజీగా ఉన్నారు. ఓ వైపు గ‌డ్క‌రీ ఇంకో వైపు రాజ్ నాథ్ సింగ్, ఇంకో వైపు ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడులు ఎవ‌రికి వారే త‌మ టీంల‌ను రీ బిల్డ్ చేసుకుంటున్నారు.

రెండోసారి ఇండియాను ప‌రిపాలించాల‌నే క‌సితో మోడీ అట్టుడికి పోతున్నారు. రాఫెల్ కుంభ‌కోణం మోడీని ఇబ్బంది పెడుతోంది. సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా ఇచ్చినా రాహుల్ గాంధీ మాత్రం ఆప‌డం లేదు. ఇక ఎన్నిక‌ల్లో తాయిలాలు ఏవిధంగా ఇవ్వాల‌నే ఉద్ధేశంతో ఇటీవ‌ల జ‌న్ ధ‌న్ ఖాతాల్లోకి 15 ల‌క్ష‌ల‌ను ద‌శ‌ల వారీగా జ‌మ చేస్తామంటూ అథావలే ప్ర‌క‌టించారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునేందుకు మోడీ జీఎస్టీ మంత్రం జ‌పిస్తోంది. వీరంతా రోజూ వారీగా వినియోగించే 23 వస్తువుల సేవ‌ల‌పై ప‌న్నును త‌గ్గించింది. త‌గ్గ‌నున్న వాటిలో సినిమా టికెట్లు, టీవీలు, కంప్యూట‌ర్లు, ల్యాప్ టాప్‌లు, ఎల్సీడీ తెర‌లు, ప‌వ‌ర్ బ్యాంక్ లు ఉన్నాయి. నిల్వ చేసిన కూర‌గాయాల‌కు పూర్తి మ‌న్ను మిన‌హాయింపు ఇచ్చారు.

ప‌న్ను రేట్ల‌ను హేతుబ‌ద్దీక‌రిస్తూ కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. 18 శాతం ప‌న్ను ప‌రిధిలోని 100 రూపాయ‌ల వ‌ర‌కున్న సినిమా టికెట్ల‌ను 12 శాతం స్లాబులో చేర్చారు. మానిట‌ర్లు, టీవీ తెర‌ల‌పై 18 శాతానికి కుదించారు. 99 శాతం వ‌స్తువుల‌పై 18 శాతం లేదా అంత‌కంటే త‌క్కువ‌కే ప‌రిమితం చేయ‌నున్న‌ట్లు విత్త‌మంత్రి ప్ర‌క‌టించారు. ఇందులో మానిట‌ర్లు కూడా ఉన్నాయి. ఇక 28 శాతం శ్లాబులో 28 వ‌స్తువుల‌ను చేర్చారు. ఆటోమొబైల్ ప‌రిక‌రాలు, సిమెంట్, మ‌ద్యం, సిగ‌రెట్లు, ఇత‌ర విలాస వ‌స్తువులు, సేవ‌లు ఉన్నాయి. 18 శాతం లోపు లో ప‌వ‌ర్ బ్యాంకులు, డిజిట‌ల్ కెమెరాలు, వీడియో కెమ‌రా రికార్డ్‌లు, వీడియో గేమ్స్ ఉన్నాయి. క్ల‌చ్‌లు, ఇంజ‌న్ల‌తో ఇమిడిపోయే వ‌స్తువులు ఉన్నాయి.

జైట్లీ ఈసారి దివ్యాంగుల‌పై క‌రుణించారు. 28 శాతం నుండి 5 శాతానికి కుదించారు. స‌రుకు ర‌వాణా వాహ‌నాల థ‌ర్డ్ పార్టీ బీమా ప్రిమియంను 12 శాతానికి త‌గ్గించారు. 5 శాతం స్లాబులో ఊత‌క‌ర్ర‌, ఫ్లెయాస్ ఇటుక‌లు, బెర‌డు, చ‌లువ‌రాళ్ల‌ను చేర్చారు. ఇంధ‌న ఉప‌క‌ర‌ణాలు, జ‌న్ ధ‌న్ ఖాతాదారుల‌ను ఇందుకు మిన‌హాయింపు ఇచ్చారు. ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌కు సంబంధించిన ఫిర్యాదుల‌ను చూసే నేష‌న‌ల్ యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీ వీట‌న్నింటిని ప‌రిశీలిస్తోంది. ఈ నిర్ణ‌యాన్ని బీజేపేయేత‌ర రాష్ట్రాలు తీవ్రంగా వ్య‌తిరేకించాయి. కేర‌ళ స‌ర్కార్ మోడీపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేసింది. ఆధ్యాత్మిక ప‌రంగా ఇత‌ర దేశాల‌కు వెళ్లే వారికి ప‌న్ను ఉండ‌ద‌ని ప్ర‌క‌టించడం తీవ్ర దుమారం రేపింది. కేంద్ర స‌ర్కార్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు జ‌నాన్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇక‌నైనా జీఎస్టీ జ‌పం మాని..నీళ్లు, కొలువులు, బ‌తుకు భ‌ద్ర‌త క‌ల్పించేందుకు దృష్టి పెడితే బావుంటుంది.

Comments

comments

Share this post

scroll to top