మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకోవాల్సిన వయస్సులో పాఠాలు నేర్చుకుంటున్న అమ్మమ్మలు, నాన్నమ్మలు..!

వారు జీవిత సారమంతా ఎరిగిన అమ్మమ్మలు, నాన్నమ్మలు. మనవలు, మనవరాళ్లతో కాలక్షేపం చేస్తూ జీవితాన్ని వెళ్లదీయాల్సిన వయస్సు వారిది. కానీ ఈ వయస్సులోనూ ఎంతో ఓపిగ్గా, శ్రద్ధగా పాఠాలు నేర్చుకుంటున్నారు. చదువుకునేందుకు వయస్సుతో పనిలేదని, కేవలం పట్టుదల ఉంటే చాలని నిరూపిస్తున్నారు. వారే థానేలోని ఫంగానే గ్రామానికి చెందిన వృద్ధ మహిళలు.

యోగేంద్ర బంగర్, మోతీరాం దలాల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో థానేలోని ఫంగానే గ్రామంలో దేశంలోనే మొదటి వృద్ధ మహిళల పాఠశాలను నిర్మించారు. దీన్ని ఇటీవల జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రారంభించారు. కాగా ఇప్పుడు ఈ పాఠశాలలో 28 మంది మహిళలు విద్యను అభ్యసిస్తున్నారు. వీరంతా 60 నుంచి 90 సంవత్సరాల మధ్య వయస్సు కలవారే అయి ఉండడం విశేషం. ఇంకో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ చదువుకునే మహిళలంతా పింక్ రంగులో ఉండే చీరలను యూనిఫాంగా ధరిస్తారు. ఈ పాఠశాలను ఆజిబైచిశాలగా పిలుస్తున్నారు.

grand-mothers-at-school

కాగా ఈ పాఠశాలలో చదువుకుంటున్న మహిళలు ఇప్పుడు ఎంతో గర్వపడుతున్నారు. ఎందుకంటే తామంతా ఇప్పటి వరకు నిరక్షరాస్యులుగా ఉండాల్సి వచ్చిందని, పాఠశాల వల్ల తమకు ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం కలిగిందని అంటున్నారు. నిరక్షరాస్యులుగానే చనిపోతామనే భయం తమకు ఒకప్పుడు ఉండేదని, అయితే ఇప్పుడు మాత్రం ఆ భయం లేదని అంటున్నారు.

పాఠశాల వ్యవస్థాపకుడు యోగేంద్ర బంగర్ మాట్లాడుతూ 100 శాతం అక్షరాస్యత ఉన్న గ్రామంగా తమ గ్రామాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యమని, అందుకోసమే పాఠశాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తమ ప్రయత్నానికి గ్రామస్తుల నుంచి సంపూర్ణ మద్దతు లభించిందని, మహిళలను సంపూర్ణ అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం కోసం తాము పనిచేస్తున్నామని తెలియజేశారు.

ప్రతి గ్రామంలోనూ ఇలాంటి పాఠశాలలు వస్తే అప్పుడు దేశంలో నిరక్షరాస్యులు అంటూ ఉండరేమో కదా!

Comments

comments

Share this post

scroll to top