ఆవులు, గేదెల‌కు ఆధార్ కార్డులు ఇవ్వ‌నున్న కేంద్ర ప్ర‌భుత్వం..!

యూపీఏ ప్ర‌భుత్వం హ‌యాంలో ఆధార్ కార్డులు ప్ర‌వేశ‌పెట్టబ‌డ్డాయ‌ని అంద‌రికీ తెలిసిందే. నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో ఇప్పుడు జ‌నాలు ఏ విధంగానైతే బ్యాంకులు, ఏటీఎంల వ‌ద్ద బారులు తీరారో, అలాగే ఒక‌ప్పుడు ఆధార్ కార్డు కోసం ఫొటోలు దిగేందుకు కూడా జ‌నాలు అంతే తిప్ప‌లు ప‌డ్డారు. గ్యాస్ స‌బ్సిడీ అక్ర‌మ మార్గంలోకి వెళ్ల‌కుండా ఉండేందుకే అప్పటి కేంద్ర ప్ర‌భుత్వం ఆధార్ కార్డుల‌ను జారీ చేసింది. అయితే ఇక‌పై ఆ ఆధార్ కార్డులు కేవ‌లం మ‌న‌కే కాదు, ప‌శువుల‌కూ ఉంటాయ‌ట‌. ప్ర‌ధానంగా ఆవులు, గేదెల‌కు ఈ కార్డుల‌ను అందజేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం యోచిస్తోంది.

cows

దేశంలో ఉన్న ప‌శుసంప‌ద‌కు అంటే… ఆవులు, గేదెల‌కు త్వ‌ర‌లో ఆధార్ నంబ‌ర్లు జారీ కానున్నాయి. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ఓ నిర్ణ‌యం కూడా తీసుకుంది. అయితే ఈ ప్రాజెక్టు కోసం ఇప్ప‌టికే సుమారు ల‌క్ష మంది నిపుణుల‌ను నియ‌మించ‌నున్న‌ట్టు తెలిసింది. వారంతా దేశంలో ఉన్న ఆవులు, గేదెల‌కు ఆధార్ నంబ‌ర్ల‌ను ఇష్యూ చేస్తారు. మొత్తం 88 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌శువులు ఉన్న నేప‌థ్యంలో అన్నింటికీ ఈ కార్డులు ఇవ్వ‌నున్నారు. 12 అంకెలు ఉండే ఓ విశిష్ట సంఖ్య‌ను వాటికి కేటాయిస్తారు. ఈ క్ర‌మంలో ఈ ప్రాజెక్టు కోసం ప‌నిచేసే అధికారులు ముందుగా ప‌శువుల చెవుల‌కు ట్యాగ్‌ల‌ను అమ‌ర్చ‌నున్నారు. అనంత‌రం వాటిని కంప్యూట‌ర్ డేటాబేస్‌కు అనుసంధానం చేస్తారు. ఆ త‌రువాత వాటికి కార్డుల‌ను జారీ చేస్తారు.

కార్డులు జారీ అయ్యాక వాటి య‌జ‌మానుల‌కు యానిమ‌ల్ హెల్త్ కార్డ్‌ల‌ను కూడా అందిస్తారు. దీంతో ప‌శువుల‌కు వ్యాక్సినేష‌న్‌, సంతానోత్ప‌త్తి, పాల దిగుబ‌డి వంటి వివ‌రాల‌ను అధికారులు ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకోవ‌చ్చు. ఈ వివ‌రాల‌న్నింటినీ స‌ద‌రు కార్డుల్లో అధికారులే న‌మోదు చేయాల్సి ఉంటుంది. అలా దేశంలో ఉన్న ప‌శు సంప‌ద‌ను ఎప్ప‌టిక‌ప్పుడు లెక్కిస్తారు. దీంతో బోలెడు లాభాలు ఉంటాయ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. మ‌రి ఆ లాభాలు ఏమిటో తెలియాలంటే… ప‌శువుల‌కు కార్డులు జారీ అయ్యే వ‌ర‌కు వేచి చూడాలి..!

Comments

comments

Share this post

scroll to top