స్వాతంత్ర్య దినోత్స‌వం నాడు..ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి సిబ్బంది నికృష్ట‌ చ‌ర్య.!

దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చింద‌ని చంకలు గుద్దుకుని మ‌రీ సంబురాలు చేసుకుంటున్నాం. కానీ పేద ప్ర‌జ‌ల‌కు అందే సౌక‌ర్యాల విష‌యంలో మాత్రం నిజానికి మ‌న‌కు ఇంకా స్వాతంత్ర్యం రాలేద‌నే చెప్పాలి. మొన్నీ మ‌ధ్యే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని గోర‌ఖ్‌పూర్‌లో ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు లేక 79 మంది చిన్నారులు మృతి చెందిన విష‌యం తెలిసిందే. అయితే ఆ ఘ‌ట‌న ఇంకా మ‌రువ‌క‌ముందే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో మ‌రో సంఘ‌ట‌న చోటు చేసుకుంది. నిండు గ‌ర్భిణి పురిటి నొప్పుల‌తో ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి వ‌స్తే సిబ్బంది లోప‌లికి రానివ్వ‌లేదు. దీంతో ఆ మ‌హిళ అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లి ఆస్ప‌త్రి ఎదుట రోడ్డుపై ప‌డిపోయి శిశువుకు జ‌న్మ‌నిచ్చింది. ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగు చూసింది.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మ‌వు జిల్లా అయిలాఖ్ గ్రామానికి చెందిన వ‌సుంధ‌ర అనే మ‌హిళ నిండు గ‌ర్భంతో ఉంది. ఈ క్ర‌మంలోనే ఆమెకు ఈ నెల 10వ తేదీన పురిటి నొప్పులు వ‌చ్చాయి. దీంతో తండ్రి బుధ్‌రాం ఆమెను ఆంబులెన్స్ లోకి ఎక్కించి స్థానికంగా ఉన్న ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి తీసుకొచ్చాడు. అయితే ఆ హాస్పిట‌ల్ సిబ్బంది ఆమెను అడ్మిట్ చేసుకోలేదు. దీంతో ఆమెకు ఏం చేయాలో తెలియ‌లేదు. ఈ క్ర‌మంలోనే ఆస్ప‌త్రి ఎదుట రోడ్డుపై ఉన్న ఆమె ఒక్క‌సారిగా అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లింది. వెంట‌నే రోడ్డుపై ప‌డిపోయింది. అది చూసి పక్క‌నే ఉన్న ఓ మ‌హిళ వ‌సుంధ‌ర‌కు సాయం చేసింది. దీంతో వ‌సుంధ‌ర రోడ్డుపైనే శిశువుకు జ‌న్మ‌నిచ్చింది. అయిన‌ప్ప‌టికీ త‌ల్లీబిడ్డా ఇద్ద‌రూ ఇప్పుడు క్షేమంగానే ఉన్నారు.

అయితే ఈ విష‌యం తెలుసుకున్న ఆస్ప‌త్రి సిబ్బంది వెంట‌నే వ‌సుంధ‌ర‌ను హాస్పిట‌ల్‌లోకి అడ్మిట్ చేసుకున్నారు. విష‌యం బ‌య‌ట‌కు పొక్క‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. కానీ ఆ మ‌హిళ రోడ్డుపై ప‌డిపోయిన‌ప్పుడు ఎవ‌రో ఫొటో తీయ‌డంతో అది కాస్తా ఆల‌స్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో ఆ హాస్పిట‌ల్ సిబ్బంది నిర్వాకం ప‌ట్ల అంద‌రూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కాగా అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తున్నామ‌ని నాయ‌కులు డంకా బ‌జాయించి చెప్పుకుంటున్నా, డిజిట‌ల్ ఇండియా అంటూ ఊద‌ర‌గొడుతున్నా… ఇలాంటి ఘ‌ట‌న‌ల ప‌ట్ల వారు ఏమ‌ని స‌మాధానం చెబుతారో, త‌ల‌కాయ‌లు ఎక్క‌డ పెట్టుకుంటారో చూడాలిక‌..!

Comments

comments

Share this post

scroll to top