క‌మ‌ల్‌హాస‌న్‌ కు కటీఫ్ చెప్పిన గౌతమి, 13 యేళ్ళ సహజీవనానికి గుడ్ బై.!

లైఫ్ అండ్ డెసిష‌న్స్‌…

” ఈ రోజు నాకు చాలా బాధ క‌లిగించే విష‌యం. ఎందుకంటే నేను, మిస్ట‌ర్ హాస‌న్ విడిపోయాం. గ‌త 13 ఏళ్లుగా మేం క‌ల‌సి జీవిస్తున్నాం. అలాంటిది ఇప్పుడు నేను ఇలాంటి క‌ఠిన‌మైన నిర్ణ‌యాన్ని తీసుకోవాల్సి వ‌చ్చింది. ఇద్ద‌రి మార్గాలు వేరే అయిన‌ప్పుడు ఇంకా క‌ల‌సి ఉండి ముందుకు వెళ్ల‌డం అసాధ్యం. జీవితంలో ఎదుర‌య్యే స‌వాళ్ల‌ను అంగీక‌రిస్తూ ముందుకు సాగిపోవ‌డం త‌ప్ప ఇప్పుడేం చేసేది లేదు. నేను ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డానికి రెండేళ్ల కాలం ప‌ట్టింది. అప్ప‌టి నుంచి ఇలాంటి బాధాక‌ర‌మైన నిర్ణ‌యం తీసుకునే రోజు కోసం ఎదురు చూస్తున్నా.

మీ నుంచి సానుభూతి పొంద‌డం కోస‌ం నేను ఈ ప‌ని చేయ‌లేదు. మ‌నిషి జీవిత‌మ‌న్నాక మార్పులు స‌హ‌జం. వాటిని మ‌నం క‌చ్చితంగా అనుమ‌తించాల్సిందే. అందుకు ఎవరూ అతీతులు కాదు. ఇలాంటి సంద‌ర్భాలు వ‌స్తాయ‌ని మ‌నం అస్స‌లు ఊహించ‌లేం. కానీ వ‌స్తే మాత్రం వాటిని అంగీక‌రించాల్సిందే. నా పూర్తి ఇష్టానుసారంగా, మ‌న‌స్ఫూర్తిగా నేనీ నిర్ణ‌యం తీసుకున్నా. ఇందులో ఎవ‌రి ప్రోద్బ‌ల‌మూ లేదు. ఏ స్త్రీకైనా ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం చాలా క‌ష్ట‌త‌ర‌మైన విష‌య‌మే. కానీ నాకు మాత్రం ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం అనివార్యం. ముందుగా నేను త‌ల్లిని. నా బిడ్డ బాధ్య‌త నాపై ఉంది. దాన్ని నెర‌వేర్చాలంటే నేను ప్ర‌శాంతంగా ఉండ‌డం చాలా ముఖ్యం.

మిస్ట‌ర్ హాస‌న్‌కు నేను ఎప్పుడూ అభిమానినే. సినిమా ఇండ‌స్ట్రీకి రాకముందు నుంచి నేను ఆయ‌న సినిమాల‌ను బాగా చూసేదాన్ని. జీవితంలో ఆయ‌న అనేక స‌వాళ్ల‌ను ఎదుర్కొన్న‌ప్పుడు, ఆయ‌న‌కు చెందిన ప్ర‌తి విలువైన క్ష‌ణంలోనూ నేను ఆయ‌న ప‌క్క‌నే ఉన్నా. ఆయ‌న సినిమాల‌కు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా చేయ‌డం నా అదృష్టం. ఆ వృత్తికి నేను పూర్తిగా 100 శాతం న్యాయం చేశా. ఆయ‌న మున్ముందు కూడా మ‌రెన్నో అద్భుత‌మైన సినిమాలు చేయాల‌ని, వాటిని ప్రేక్ష‌కులు ఆద‌రించాల‌ని కోరుకుంటున్నా.

నేను మీతో ఇప్పుడీ విష‌యాల‌ను ఎందుకు పంచుకుంటున్నానంటే నేను చేసిన ప్ర‌తి సినిమాకు మీరు న‌న్ను ఆద‌రించారు కాబ‌ట్టి. మీ ప్రోత్సాహంతోనే నేను ఇంత న‌టిని అయ్యాను కాబ‌ట్టి. గ‌త 29 ఏళ్లుగా సినీ ఇండ‌స్ట్రీలో మీరు నాపై చూపించిన అభిమానానికి కృత‌జ్ఞురాలిని. ఎన్నిఅప‌జయాలు ఎదురైనా మీరు వెన్నంటి నిలిచి ఉన్నారు కాబ‌ట్టే న‌టిగా నేను మీ ముందు నిలుచోగ‌లిగా. “

ప్రేమ‌తో,
మీ,
గౌత‌మి.

ఇది సినీ న‌టి గౌత‌మి త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ”లైఫ్ అండ్ డెసిష‌న్స్” పేరిట ఉంచిన ట్వీట్. బ్లాగ్‌లో తాను రాసిన లేఖ‌ను ట్వీట్ ద్వారా అంద‌రికీ షేర్ చేసింది గౌత‌మి.

kamal-gouthami

గ‌త 13 ఏళ్లుగా న‌టుడు క‌మ‌ల‌హాస‌న్‌తో క‌ల‌సి స‌హ జీవ‌నం చేస్తున్న న‌టి గౌత‌మి అత‌నితో విడిపోతున్న‌ట్టు చెప్పింది. పై లేఖ‌ను ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేసింది. కాగా క‌మ‌ల‌హాస‌న్‌, గౌత‌మిలు క‌లిసి చేసిన చిత్రాలు వారికి మంచి పేరునే తెచ్చి పెట్టాయి. క్ష‌త్రియ పుత్రుడు, ద్రోహి, విచిత్ర సోద‌రులు త‌దిత‌ర సినిమాల్లో ఇద్దరూ న‌టించారు. వీరిద్ద‌రూ 2015లో చివ‌రిసారిగా పాప‌నాశ‌మ్ అనే సినిమాలో న‌టించారు. వ్యాపార‌వేత్త సందీప్ భాటియాను పెళ్లి చేసుకున్న గౌత‌మి అతనికి విడాకులు ఇచ్చాక క‌మ‌ల్‌తో స‌హ‌జీవ‌నం చేస్తోంది. క‌మ‌ల్ కూడా త‌న భార్య సారికను వ‌దిలి గౌత‌మితో క‌ల‌సి ఉంటున్నాడు. సారిక పిల్ల‌లే శృతి హాస‌న్‌, అక్ష‌ర హాస‌న్‌లు. ఈ క్ర‌మంలో గౌత‌మి, క‌మ‌ల‌హాస‌న్‌లు విడిపోవ‌డం ఇప్పుడు ఆ సినీ ప‌రిశ్ర‌మలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

రాజ‌కీయంగా ఎద‌గ‌డం కోస‌మేనా..?
ఎన్నో ఏళ్లుగా స‌హ‌జీవ‌నం చేస్తున్న గౌత‌మి క‌మ‌ల‌హాస‌న్ నుంచి విడిపోవ‌డానికి గ‌ల కార‌ణాలు ఏమిటి..? ఇంత అర్ధాంత‌రంగా క‌మ‌ల్ నుంచి ఆమె ఎందుకు వేరేగా ఉండాల‌ని కోరుకుంటోంది..? అనే సందేహాల‌కు సినీ అభిమానులు ప‌లు విధాలుగా చ‌ర్చించుకుంటున్నారు. వాటిలో మొద‌టిది రాజ‌కీయ భ‌విష్య‌త్తు. మొన్నా మ‌ధ్య గౌత‌మి ప్ర‌ధాని మోడీని క‌లిసింది గుర్తుందా..? ఆ మీటింగ్‌లో త‌న స్వ‌చ్ఛంద సంస్థ కోసం స‌హ‌కారం అందించాల‌ని ఆమె మోడీని కోరింది. అయితే కేవ‌లం స్వ‌చ్ఛంద సంస్థ స‌హ‌కారం కోస‌మేనైతే ప్ర‌ధాని అంతటి వ్య‌క్తిని క‌ల‌వాల్సిన ప‌నిలేద‌ని, మంత్రిని క‌లిసినా చాల‌ని ప‌లువురు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. తాను బీజేపీలో చేరి రాజ‌కీయంగా ఎద‌గ‌డం కోస‌మే ప్ర‌ధాని మోడీతో ఆమె స‌మావేశమైంద‌ని, ఒక వేళ పార్టీలో చేరి ముందుకు సాగుతుంటే అప్పుడు ఈ స‌హ‌జీవ‌నం స‌మ‌స్య‌గా మారుతుంద‌ని, అందుకే పార్టీలో చేర‌క‌ముందే క‌మ‌ల్ నుంచి విడిపోతే త‌రువాత ఏ స‌మ‌స్యా రాద‌ని ఆమె భావించి ఉంటుంద‌ని, ఆ క్ర‌మంలోనే ఇప్పుడీ నిర్ణయం తీసుకుని ఉంటుంద‌ని అంద‌రూ అనుకుంటున్నారు.

కూతురు సుబ్బ‌ల‌క్ష్మి కోసం..?
క‌మ‌ల‌హాస‌న్ పెద్ద కుమార్తె శృతి హాస‌న్ సినిమాల్లో బాగానే పేరు తెచ్చుకున్న విష‌యం అందరికీ తెలిసిందే. చిన్న కూతురు అక్ష‌ర కూడా త‌న వంతు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అయితే వారిద్ద‌రికీ క‌మ‌ల్ బ్యాక్ స‌పోర్ట్ ఉండ‌బ‌ట్టే సినిమాల్లో అవ‌కాశాలు వ‌స్తున్నాయ‌ని టాక్‌. ఈ క్ర‌మంలో త‌న సొంత కూతుళ్ల‌ను మాత్ర‌మే క‌మ‌ల్ ప‌ట్టించుకుంటున్నాడ‌ని, త‌న కూతురు సుబ్బ‌ల‌క్ష్మిని స‌రిగ్గా చూడ‌డం లేద‌ని, అందుకే ఆమె క‌మ‌ల్ నుంచి విడిపోతుంద‌ని కూడా చ‌ర్చ వినిపిస్తోంది.

స‌మాజ సేవ కోస‌మా..?
మొన్నా మ‌ధ్యే గౌత‌మికి బ్రెస్ట్ క్యాన్సర్ రాగా దాన్ని విజ‌య‌వంతంగా ఆమె అడ్డుకోగ‌లిగింది. ఈ క్ర‌మంలో ఆమె క్యాన్స‌ర్ బాధితుల‌కు చేయూత‌ను అందించేందుకు లైఫ్ ఎగెయిన్ ఫౌండేష‌న్ పేరిట ఓ స్వ‌చ్ఛంద సంస్థ‌ను కూడా ఏర్పాటు చేసింది. అయితే ఆ సంస్థ పేరిట స‌మాజ సేవా కార్య‌క్ర‌మాలను చేయాల‌ని గౌత‌మి భావించింద‌ని, అందులో భాగంగానే త‌న‌కు ఉన్న ఈ బంధాల‌న్నింటినీ పూర్తిగా వ‌దిలించుకుని మొత్తం త‌న జీవితాన్ని స‌మాజ సేవ‌కే కేటాయించాల‌ని గౌత‌మి భావించింద‌ని, అందుకే క‌మ‌ల్ నుంచి విడిపోవాల‌న్న నిర్ణ‌యం తీసుకుని ఉంటుంద‌ని అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు. మ‌రి గౌత‌మి త‌న సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ప్రారంభిస్తుందో వేచి చూడాలి..!

Comments

comments

Share this post

scroll to top