ఆ మేక ఏకంగా 33 నోట్లు ఉన్న రూ.2వేల క‌ట్ట‌ను తినేసింది. వింటే షాక‌వుతారు..!

మేకలు ఏం తింటాయి..? గ‌డ్డి, ఆకులు, కొమ్మ‌లు… ఇలా క‌న‌బ‌డిన‌వి క‌న‌బ‌డిన‌ట్టు తినేస్తాయి. మేక‌లు ఇత‌ర జంతువుల్లా కాదు, దాదాపుగా అన్ని వృక్షాల‌ను, కొమ్మ‌ల‌ను, మొక్క‌ల‌ను అది ఇది అని తేడా లేకుండా తింటాయి. కానీ ఇప్పుడు మేం చెప్ప‌బోయే ఓ మేక మాత్రం అలా కాదు. ఏకంగా రూ.2వేల నోట్ల‌నే అమాంతం న‌మిలి మింగేసింది. య‌జ‌మాని జేబులో ఉన్న ఆ నోట్లు మంచి మొక్క‌ల్లా కనిపించాయో ఏమో చ‌టుక్కున వాటిని లాగి మొత్తం తినేసింది. అలా రూ.66వేల నోట్ల‌ను ఆ మేక తిన్న‌ది. దీంతో ఆ వ్య‌క్తి ప‌డుతున్న బాధ అంతా ఇంతా కాదు. ఇంత‌కీ అస‌లు ఈ ఘ‌ట‌న ఎక్క‌డ జ‌రిగిందంటే…

ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లా శిలువాపూర్‌ గ్రామానికి చెందిన రైతు సర్వేశ్ కుమార్ పాల్ ఇంట్లో నిర్మాణ పనులను చేయిస్తున్నాడు. ఇందుకు గాను అవ‌స‌రం అయ్యే ఇటుకలు కొనుగోలు చేయడానికి అత‌ను రూ.66 వేలు నగదును తన ప్యాంటు జేబులో పెట్టుకున్నాడు. ఆ న‌గ‌దులో ఉన్న‌వ‌న్నీ రూ.2వేల నోట్లే. మొత్తం 33 నోట్లు రూ.2వేల‌వి ఉన్నాయి. వెర‌సి రూ.66వేల‌ను జేబులో పెట్టుకున్నాడు. అయితే ఆరు బ‌య‌ట ఉన్న మేక‌ను చూసేందుకు దాని ద‌గ్గ‌ర‌కు వెళ్లాడు. అలా మేకను చూస్తూ ఉండ‌గా వేరే వ్య‌క్తి రావ‌డంతో అత‌నితో మాట్లాడ‌డం మొద‌లు పెట్టాడు స‌ర్వేశ్‌.

అయితే స‌ర్వేశ్ జేబులో పెట్టుకున్న నోట్లు బ‌య‌టికి క‌నిపించాయి. అవి ఆక‌ర్ష‌ణీయంగా ఉండ‌డంతో తినే ప‌దార్థ‌మ‌ని భావించింది మేక‌. ఇంకేముందీ వెంట‌నే జేబులో ఉన్న నోట్ల క‌ట్ల‌ను లాగేసింది. అలా లాగుతూనే నోట్లోకి వాటిని అమాంతం తీసుకుని న‌మ‌ల‌డం మొద‌లు పెట్టింది. అది గ‌మ‌నించిన స‌ర్వేశ్ నోట్ల‌ను లాగే ప్ర‌య‌త్నం చేయ‌గా అప్ప‌టికే 31 నోట్లు మేక క‌డుపులోకి వెళ్లాయి. కేవ‌లం 2 మాత్ర‌మే బ‌య‌టికి వ‌చ్చాయి. అయితే అవి కూడా పాడైపోయాయి. దీంతో అత‌ను బావురుమ‌న్నాడు. ఇంట్లో నిర్మాణ ప‌నుల కోసం పెట్టుకున్న న‌గ‌దును అలా మేక గుట‌కాయ స్వాహా చేయ‌డంతో అత‌నికి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావ‌డం లేదు. అయితే ఏదో సామెత చెప్పిన‌ట్టుగా… ఓ వైపు ఇల్లు కాలిపోతుంటే చుట్ట వెలిగించాడ‌నే చందంగా… మేక నోట్ల‌ను తిన్న‌ద‌న్న బాధ‌లో స‌ర్వేశ్ ఉంటే చుట్టు ప‌క్క‌ల వారు ఆ మేక‌ను చూసేందుకు పెద్ద ఎత్తున వ‌స్తున్నార‌ట‌. దాంతో ఫొటోలు కూడా దిగుతున్నార‌ట‌. అవును మ‌రి, ఎదుటి వాడి బాధ‌లో ఆనందం వెదుక్కునే వారే ఎక్కువ‌య్యారు క‌దా, క‌నుక వారు అలాగే చేస్తారు లెండి..!

Comments

comments

Share this post

scroll to top