13 గోల్డ్ మెడల్స్ సాధించిన గీత… పరుగు పందెంలో కాదు, వ్యవసాయం సేద్యపు చదువులో…

కర్నాటకలోని దొడ్డబళ్లాపూర్ తాలూకాలో వ్యవసాయ కుటుంబంలో జన్మించింది. తండ్రి నరసింహ మూర్తి, తల్లి చిక్కతాయమ్మ. వారికి వున్నది కేవలం ఎకరం భూమి. ఆ భూమి మీదనే ఆధారపడి బతుకుతున్నారు. తిండిగింజల ఖర్చు పోను ఏడాదికి 11వేల రూపాయలు మిగులుతాయి. అయితే… గీత మాత్రం నిజంగా నిలువెత్తు బంగారం. బెంగుళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శనివారం జరిగిన కాన్వకేషన్ లో 13 బంగారు పతకాలను అందుకుంది.
గీతను గ్రాడ్యుయేషన్ చదివించే స్తోమత తల్లిదండ్రులకు లేదు. దాంతో ఎడ్యుకేషనల్ లోన్ తీసుకొని గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఇప్పుడు అగ్రికల్చరల్ జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ లో పోస్టు గ్రాడ్యుయేట్ చేస్తోంది. భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఫెలోషిప్ సహాయంతో పీజీ చదువుతోంది.


‘‘ మా అమ్మానాన్నలకు డబ్బు లేకపోయినా. నేను బాగా చదువుకోవడానికి అన్ని విధాలా కష్టపడ్డారు. జెనెటిక్స్, ప్లాంట్ బ్రీడింగ్ లో రిసెర్చర్ అవాలన్నది నా ఆకాంక్ష. రైతులు పుట్టెడు కష్టాల్లో వుండడం నన్ను కదిలించివేసింది… ముఖ్యంగా ధరల పతనంవల్ల. ఈ విషయంలో నేను ఏమన్నా చేద్దామనుకుంటున్నాను. రైతులకోసం ఒక స్వచ్ఛంద సంస్థ కూడా నెలకొల్పాలన్నది కూడా నా ఆశయం’’ అంటోంది గీత. ‘‘ దయచేసి వ్యవసాయాన్ని వదిలేయకండి. అది మన వెన్నెముక’’… సేద్యాన్ని వదిలేసి ఉద్యోగాల వేటలో పట్టణాల బాట పడుతున్న యువతకు గీత ఇస్తున్న సందేశం ఇది.

10898244_10203805761975022_9210884109097757663_n


కాన్వకేషన్ లో 13 గోల్డ్ మెడల్స్ అందుకున్నాక.. పరుగున వెళ్లి తల్లిదండ్రులను కలుసుకొని వారి చేతి మీదుగా మిఠాయి తింటున్న గీతను ఫోటోలో చూడవచ్చు. నీకు వందనాలు తల్లీ. ఆంధ్రప్రదేశ్ కు చెందిన కుందూరు భరత్ కూడా తన గ్రాడ్యుయేషన్ కోర్సులో ఏడు బంగారు పతకాలు సాధించాడు. అతను కూడా వ్యవసాయ కుటుంబంనుంచే వచ్చాడు. అతను కూడా రిసెర్చర్ గా మారి రైతాంగానికి సేవ చేయాలనుకుంటున్నాడు. లాంటి భూమి పుత్రికలు, భూమి పుత్రుల అవసరం భారతదేశానికి చాలా అవసరం.

( ఉదయవాణి పత్రిక సౌజన్యంతో..)

Comments

comments

Share this post

scroll to top