కార్‌ను ఓవర్ టేక్ చేశాడని ఓ యువకున్ని కాల్చి చంపిన గయ ఎమ్మెల్సీ పుత్రరత్నం రాకీ…

ఢిల్లీలో గత నెల జరిగిన మెర్సిడెస్ హిట్ అండ్ రన్ కేసు గుర్తుందా? మదమెక్కిన ఓ కుర్రాడు ఓ వ్యక్తి నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాడు. కారును నిర్లక్ష్యంగా, అత్యంత వేగంగా నడుపుతూ ఆ వ్యక్తిని ఢీకొని అతని మృతికి కారణమయ్యాడు. ఆ సంఘటన మరువక ముందే సరిగ్గా దాదాపు అలాంటిదే మరో సంఘటన బీహార్‌లో చోటు చేసుకుంది. కాకపోతే అది యాక్సిడెంటల్‌గా జరిగింది మాత్రం కాదు. కొవ్వెక్కిన ఓ యువకుడు అధికారం ఉందన్న మదంతో చేసిన నిర్వాకం. ఫలితంగా మరో యువకుడి నిండు ప్రాణం బలి కావల్సి వచ్చింది.

aditya

బీహార్ రాష్ట్రంలోని గయ ప్రాంతానికి చెందిన ఆదిత్య సచ్‌దేవ (20) ఓ వ్యాపార వేత్త కుమారుడు. ఇటీవలే సీబీఎస్‌ఈ క్లాస్ 12 బోర్డ్ ఎగ్జామ్స్ పూర్తి చేసుకుని ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాడు. గత శనివారం రాత్రి బోధ్ గయలో స్నేహితుడి జన్మదిన వేడుకలకు హాజరైన ఆదిత్య అనంతరం ఇంటికి తన స్విఫ్ట్ కారులో తిరుగు ప్రయాణమయ్యాడు. కాగా రాత్రి 8.30 గంటల ప్రాంతంలో బోధ్‌గయ-గయ రహదారిపై మార్గమధ్యలో ఉన్న సెంట్రల్ జైల్, పోలీస్ లైన్ల వద్ద గయ జేడీ(యూ) ఎమ్మెల్సీ మనోరమా దేవి కుమారుడు రాకీ నడుపుతున్న ల్యాండ్ రోవర్ కారును తన కారుతో ఆదిత్య ఓవర్‌టేక్ చేశాడు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన రాకీ ఆదిత్య కారును వెంబడించి దాన్ని ఆపు చేయించాడు. అనంతరం ఆదిత్య దగ్గరికి వచ్చి, నా కార్‌నే ఓవర్ టేక్ చేస్తావా అంటూ పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో ఆదిత్యను రాకీ తన లైసెన్స్‌డ్ పిస్టల్‌తో కాల్చేశాడు. కాగా ఆ సమయంలో రాకీతోపాటు అతని బాడీ గార్డ్ రాజేష్ కుమార్, మరో ఇద్దరు స్నేహితులు కూడా కారులో ఉన్నారు. ఆదిత్యను స్థానికులు వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అతను అక్కడికి చేరుకునే లోపే మృతి చెందాడు.

ఎమ్మెల్సీ మరోరమా దేవి పుత్రరత్నం చేసిన నిర్వాకం పట్ల అంతటా నిరసనలు వ్యక్తమయ్యాయి. పలు పార్టీలకు చెందిన నాయకులు కూడా ఆందోళనలు చేపట్టారు. రాకీని వెంటనే అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. అయితే రాకీ మాత్రం పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే సంఘటన జరిగిన సమయంలో అతనితోపాటు ఉన్న రాజేష్ కుమార్, మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతోపాటు రాకీ తండ్రి బింది యాదవ్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

rocky

కాగా రాకీ అంతటి నిర్వాకం చేసినా ఎమ్మెల్సీ మనోరమా దేవి, ఆమె భర్త బింది యాదవ్‌లు మాత్రం తమ కుమారుడికి ఏమీ తెలియదని, ఆత్మరక్షణ కోసమే అలా చేశాడని చెప్పడం అత్యంత విడ్డూరాన్ని కలిగించే విషయం. రాకీ అంతటి మంచి వాడే అయితే సంఘటన జరిగిన వెంటనే పోలీసులకు విషయాన్ని చెప్పకుండా ఇప్పటికీ పరారీలో ఎందుకు ఉన్నట్టు? ఇప్పటికైనా పోలీసుల దగ్గరికి వచ్చి తన వెర్షన్ వినిపించుకోవచ్చుగా? అంటే దానికి మాత్రం వారి నుంచి జవాబులు లేవు. అంతేగా మరి! కాకి పిల్ల కాకికి ముద్దు, పంది పిల్ల పందికి ముద్దు. పుత్రులు ఎంతటి ఘన కార్యాలు చేసినా (అవి మంచివైనా, చెడ్డవైనా) తల్లిదండ్రులకు ఒకే రకంగా (మంచిగా) కనిపిస్తాయిగా. అందుకే వారు తమ కుమారుడ్ని వెనకేసుకు వస్తున్నారు. ఇది ఎక్కడైనా జరిగితే. అయినప్పటికీ ఓ బాధ్యతాయుతమైన ప్రజా ప్రతినిధిగా, ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత తనపై ఉండగా ఎమ్మెల్సీ మనోరమా దేవి ఈ విధంగా ప్రవర్తించడం పట్ల అక్కడి ప్రజలే కాదు, ఇతర పార్టీలకు చెందిన నాయకులు కూడా విమర్శిస్తున్నారు. సీఎం నితీష్ కుమార్ ఈ విషయమై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా బడాబాబుల పిల్లలు చేసే అకృత్యాలకు సామాన్యులు మాత్రం ఎప్పటికీ బలి పశువులే. ఆ విషయాన్ని మనమే గుర్తెరగాలి. లేదంటే ఓ ఢిల్లీ యాక్సిడెంట్, ఓ గయ గన్ షాట్‌లాంటి దుస్సంఘటనలు ఇంకెవరికైనా జరగవచ్చు కదా!

Comments

comments

Share this post

scroll to top