కాంగ్రెస్ ను వీడుతున్న నేత‌లు – ఖాళీ అవుతున్న కుర్చీలు

అటు దేశంలో ఇటు రాష్ట్రంలో సుదీర్ఘ‌కాలం పాటు అధికారంలో ఉన్న ..ఘ‌న‌మైన చ‌రిత్ర స్వంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో ఉనికిని కోల్పోయే ప‌రిస్థితిని కొని తెచ్చుకుంటున్న‌ది. పార్టీలో నెంబ‌ర్ వ‌న్, టు పొజిష‌న్‌లో ఉన్న వారంతా ఒక్కొరొక్క‌రుగా మాతృ సంస్థ‌ను వీడుతున్నారు. ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న కోసం జ‌రిగిన పోరాటాన్ని కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ..సోనియా గాంధీ నేతృత్వంలో సానుకూలంగా స్పందించింది. రాష్ట్రం ఇచ్చేంత దాకా నిద్ర పోన‌ని, ఢిల్లీ నుండి హైద‌రాబాద్‌లో కాలు పెట్ట‌నంటూ స‌వాల్ విసిరి..సాధించిన కేసీఆర్‌కు మ‌ద్ధ‌తుగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ. ఆ త‌ర్వాత కొత్త‌గా ఏర్ప‌డిన తెలంగాణ రాష్ట్రంలో మొద‌టిసారిగా ఎన్నిక‌లు జ‌రిగాయి. కాంగ్రెస్ హై క‌మాండ్ తాము అధికారంలోకి వ‌స్తామ‌ని..ఎందుకంటే తామే రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాము కాబ‌ట్టి జ‌నం ఓట్లేస్తార‌ని అతి ఆత్మ‌విశ్వాసంతో ఎన్నిక‌ల బ‌రిలోకి దిగింది. బొక్క బోర్లా ప‌డింది.

టు డిజిట్స్ కే ప‌రిమిత‌మైంది. టీఆర్ ఎస్ హోరు గాలికి మిగ‌తా పార్టీలు సింగిల్ డిజిట్స్‌కే ప‌రిమిత‌మై పోయాయి. ఆ త‌ర్వాత ఆప‌రేష‌న్ ఆకర్ష్ దెబ్బ‌కు చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. వారిలో నారాయ‌ణ‌పేట , మ‌క్త‌ల్ ఎమ్మెల్యేలు రాజేంద‌ర్ రెడ్డి, రామ్మోహ‌న్ రెడ్డిలు టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ విష‌యంపై అప్ప‌ట్లో కాంగ్రెస్ లో సీనియ‌ర్ నేత‌గా ఉన్న డికె అరుణ త‌న త‌మ్ముడిపై నిప్పులు చెరిగారు. రెండోసారి జ‌రిగిన ఎన్నిక‌ల్లో భారీ ఎత్తున విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది అధికార పార్టీ. రాష్ట్రంలో ఎన్నో ఏళ్లు పాల‌న సాగించిన కాంగ్రెస్ పార్టీని నామ రూపాలు లేకుండా చేయాల‌న్న‌ది ముఖ్య‌మంత్రి కేసీఆర్ టార్గెట్ చేశారు. గులాబీ ఊపున‌కు పార్టీల‌న్నీ బొక్క బోర్లా ప‌డ్డాయి. 86 సీట్ల‌ను గెలుచుకుని ప‌వ‌ర్‌లోకి వ‌చ్చారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో సైతం త‌మ ప్ర‌తాపాన్ని చూపించేందుకు రెడీగా ఉన్నారు.

ఇంత‌లోపే ఆయా పార్టీల‌కు చెందిన ఎమ్మెల్యేల‌ను త‌మ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ప్ర‌తిప‌క్షంలో ఉంటూ ఏం చేయ‌లేమ‌ని ఆలోచించిన ఇత‌ర ఎమ్మెల్యేలు వీరి బాట‌లోనే ప‌య‌నించే అవ‌కాశం ఉంది. ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాలో ఒకే ఒక్క సీటును కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గంలో జూప‌ల్లి కృష్ణారావును ఓడించిన బీరం విష్ణువ‌ర్ద‌న్ రెడ్డి సైతం గులాబీ వైపు చూస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. మొద‌టి నుంచి కాంగ్రెస్ పార్టీనే న‌మ్ముకుని ఉన్న సీనియ‌ర్లు సైతం గులాబీ వైపు చూస్తున్నారు. నిబ‌ద్ద‌త క‌లిగిన నాయ‌కుడిగా రాపోలు ఆనంద బాస్క‌ర్‌కు పేరుంది. ఆయ‌న కూడా పార్టీని వీడారు. ఏక వ్య‌క్తి పాల‌న కొన‌సాగుతోంద‌ని..పార్టీని భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్నారంటూ ఆరోప‌ణ‌లు చేశారు. ఉత్త‌మ్ కుమార్ రెడ్డి వ‌చ్చాక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డ‌మేమో కానీ ..ఉన్న పార్టీ ఖాళీ అయ్యేలా ఉంది.

స‌మాజ్‌వాది పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచి..ఆతర్వాత కాంగ్రెస్ పార్టీలో నెంబ‌ర్ టు గా చ‌క్రం తిప్పి..మంత్రిగా ప‌నిచేసిన ..అనుభ‌వం క‌లిగిన డికె అరుణ ..కాంగ్రెస్ పార్టీని వీడారు. ఉన్న‌ట్టుండి అమిత్ షా స‌మ‌క్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎంపీగా బీజేపీ నుండి పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీని వీడుతున్న వారు ఎక్కువ‌వుతున్నారు. అధికార పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. తాజాగా న‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన గండ్ర వెంక‌టర‌మ‌ణారెడ్డి కేటీఆర్ స‌మ‌క్షంలో గులాబీ కండువా క‌ప్పుకున్నారు. ఇంత జ‌రుగుతున్న అధిష్టానం కానీ ఇటు ఉత్త‌మ్ కానీ ప‌ట్టించుకోక పోవ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. ఇక నైనా హై క‌మాండ్ మేల్కోవాలి..పార్టీని కాపాడుకునేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టాలి.

Comments

comments

Share this post

scroll to top