కాలం సహకరించక పోతే అయినవారే కాకుండా పోతారు. తనకంటూ ఎదురే లేకుండా బీజేపీని ట్రాక్‌లో పెట్టి ..దేశంలోనే చరిస్మా కలిగిన నేతగా ఎదిగి..ప్రధానమంత్రి వంటి అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన నరేంద్ర మోడీ ఇపుడు స్వపక్షం నుండే వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారు. మోడీ అండ్ అమిత్ షా టీంకు గత నాలుగున్నర ఏళ్లుగా ఎదురే లేకుండా పోయింది. మోడీ ఏం చేబితే అదే శాసనం, అదే చట్టం. స్వచ్ఛ భారత్ పేరుతో ఇండియా అంతటా బీజేపీకి పెద్ద దిక్కుగా మారారు. యుపీఏ సర్కార్‌ను పవర్ లోంచి దించేశారు. తానే అన్నీ అయి వ్యవహరించారు. మోడీతో మాట్లాడాలంటే దమ్ముండాలి. దాని వెనుక నేపథ్యం ఉండాలి. ఓ రకంగా సైనికుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఆయనలో ఉన్నాయి. అంతగా క్రమశిక్షణతో పైకి వచ్చిన ఈ చాయ్ వాలా ఏది మాట్లాడినా ఓ సంచలనమే.
ఇండియాలో కమలం వికసించేందుకు అన్ని శక్తులు సర్వశక్తులు ధార పోశాయి. ఆర్. ఎస్. ఎస్, విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్, శివసేన , ఏబీవీపీ లాంటి సంస్థలన్నీ అంతర్గతంగా అహర్నిశలు కష్టపడ్డాయి. చాలా రాష్ట్రాలలో బీజేపీ భారీ విజయాలను నమోదు చేసుకుంది. అక్కడ కూడా అధికారాన్ని చేపట్టింది. ప్రతి చోటా పవర్ లోకి రావాలన్న కసితో మోడీ అండ్ షా పనిచేశారు. ఒంటెద్దు పోకడ పోయారన్న అపవాదును మూటగట్టుకున్నారు. కొన్ని నిర్ణయాలు చెప్పకుండా తీసుకున్నారనే విమర్శలను కొట్టి పారేశారు. భారతదేశానికి శక్తివంతమైన బ్రాండ్ గా మోడీ ఎదిగారు. తనను తాను మార్చుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో పీఎం హోదాలో పర్యటించారు. పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించారు. చైనాతో చేతులు కలిపారు. అమెరికాకు వెళ్లారు. అక్కడి వారి మనసుల్ని దోచుకున్నారు. ఐటీ , టూరిజం, లాజిస్టిక్ రంగాలకు ఊతమిచ్చారు. ప్రతి రంగంలో తనదైన ముద్రను వేశారు మోడీ.
ప్రస్తుతం బీజేపీ సర్కార్‌లో మోడీదే ముద్ర. ఏ విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా ప్రతిదీ పద్దతి ప్రకారం పీఎం చెప్పినట్టే జరిగాయి. అన్ని పార్టీలు నెత్తి నోరు బాదుకున్నా..జనం ఇబ్బందులు పడినా..తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని..వెనక్కి తగ్గేది లేదంటూ ప్రకటించారు. ఆయన చెప్పినట్టుగానే అర్ధరాత్రి నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం విత్త మంత్రికి తెలియకుండా డిసిషన్ తీసుకున్నారు. ప్రభుత్వం అంటే దానికో వ్యవస్థ, మందీ మార్బలంతో పాటు పలు శాఖలు, ఉన్నతాధికారులు, గవర్నర్ల వ్యవస్థ ఇలా ప్రతిదీ మోడీ మార్క్ తో నిండి పోయాయి. భారత ఆర్థిక వ్యవస్థకు ప్రాణప్రదమైన రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటిసారిగా ప్రజల్లో తన నమ్మకాన్ని పోగొట్టుకుంది. దీనికంతటికి మోడీయే కారణమన్న ఆరోపణలున్నాయి. ఇదే విషయం ఇటీవల ఊర్జిత్ పటేల్ రాజీనామాతో తేలిపోయింది. గత నాలుగున్నర ఏళ్లుగా మోడీ, షాలు ఏది చెప్పినా నడిచింది. అంతా వీరిద్దరే అయి దేశాన్ని నడిపించారు. ఏ నిర్ణయమైనా పార్టీ పెద్దలు, మంత్రులతో సంప్రదించకుండానే చేశారన్న అపవాదు మూటగట్టుకున్నారు మోడీ.
మొదట్లో ఒకరిద్దరు నేతలు మోడీ సర్కార్‌పై తమ అభిప్రాయాలు చెప్పేవారు. ఇపుడు ఆ పరిస్థితి లేదు నిన్నటి దాకా. కానీ కాలం సహకరించడం లేదు కమలానికి. తన స్వంత మంత్రి వర్గంలో కీలక బాధ్యతలు చూస్తున్న మంత్రి గడ్కరీ ఏకంగా మోడీపైనే ఎక్కు పెట్టారు. అన్నీ నాకు తెలుసు అనుకోవడం నాయకుడికి మంచి పద్ధతి కాదంటూ పరోక్షంగా పీఎంను ఉద్ధేశించి చేసిన వ్యాఖ్యలు కమలదళంలో కలకలం రేపాయి. ఇపుడు గడ్కరీ కామెంట్స్ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. మరో వైపు బీజేపీ అనుబంధ సంస్థలు కొంత అసహనంతో ఉన్నాయి. ఇటీవల మూడు రాష్ట్రాలలో బీజేపీ అనూహ్యంగా అధికారాన్ని కోల్పోయింది. దీంతో స్వపక్షంలోని విపక్షీయులకు పెద్ద అవకాశం దొరికినట్టయింది. మెల మెల్లగా కామెంట్స్ చేసేందుకు సాహసిస్తున్నారు.
2019లో దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. మళ్లీ పవర్ లోకి రావాలంటే ఏం చేయాలో ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు మోడీ , షా. ఇదే సమయంలో కార్యకర్తల్లో మనో ధైర్యాన్ని ఇవ్వాల్సిన మోడీ మౌనంగా ఉండడంపై ఆ పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. రాఫెల్ కుంభకోణం మోడీని ఉక్కరి బికి్కరి చేస్తోంది. కోర్టు అనుకూలంగా తీర్పు చెప్పినా..రాహుల్ గాంధీ ఆగడం లేదు. ఈ సమయంలో గడ్కరీ మోడిపై మాట్లాడటం హాట్ టాపిక్ గా మారింది. నేను పార్టీ అధ్యక్షుణ్నయినపుడు, నా పార్టీ ఎంపీలు లేదా ఎమ్మెల్యేలు సరిగా పనిచేయనపుడు తప్పెవరిది? నాదే కదా. అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. నిరసన ధ్వనులన్నీ ఒక్కటవుతున్నాయి. వ్యక్తులు సరిగా పనిచేయక పోతే, ఆశించిన ఫలితం దక్కకత పోతే నాయకులే బాద్యత వహించాలంటూ గడ్కరీ ఆరోపించారు.
‘వ్యవస్థను సరిగా నడపాల్సిన బాధ్యత నాయకుడిదే. కిందివారు సరిగా పనిచేయనపుడు, కోరుకున్న లక్ష్యాలు నెరవేరనపుడు ఆ నాయకుడే దానికి బాధ్యత వహించాలి’’ అని పునరుద్ఘాటించారు. అంతేకాదు, భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రసంగాలంటే తనకు చాలా ఇష్టమని కూడా ఆయన వ్యాఖ్యానించారు. నెహ్రూ-గాంధీ విధానాలను శాశ్వతంగా చెరిపేయాలని ఓ పక్క మోదీ-షా ప్రయత్నిస్తున్న తరుణంలో గడ్కరీ మాట్లాడటం ఆ పార్టీ వర్గాలను ఆశ్చర్య పోయేలా చేశారు. ‘‘ఒక వ్యక్తి అద్భుతంగా ప్రసంగించినంత మాత్రాన ఓట్లు రాలవు. మీరు విద్వాంసుడే కావొచ్చు. అన్నీ నాకు తెలుసు అనుకుంటే మీరు పొరబడ్డట్లే. కృత్రిమమైన మార్కెటింగ్ ఎల్లకాలం నిలవదు’’ అని దుయ్యబట్టారు. పార్టీ ఓడిపోతే..దానికి గల కారణాలను పరిశీలించేందుకు ఒక్క సమావేశం ఏర్పాటు చేయలేదని ..గెలిస్తే సంబరాలు చేసుకోవడం, ఓడిపోతే తప్పు తమది కాదంటూ చెప్పడం భావ్యం కాదంటూ చేసిన కామెంట్స్ కమలనాథుల్లో కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. త్వరలో జరగబోయే ఎన్నికల్లో మోడీ మంత్రం పనిచేస్తుందా..షా ప్లాన్ వర్కవుట్ అవుతుందా..వ్యతిరేక శక్తులు బలం పుంజుకుంటాయా..లేక రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్, దాని అనుబంధ పార్టీలు పవర్ లోకి వస్తాయో లేదో వేచి చూడాలి. అంతదాకా ఆగాల్సిందే.