అబద్ధం చెబితే పసిగట్టే లైడిటెక్టర్‌ ఎలా పనిచేస్తుంది?

ఒక వ్యక్తి అబద్ధ్దం చెబుతున్నప్పుడు తనకు తెలియకుండానే భావావేశానికి, ఉద్వేగానికి లోనవుతాడు. అపుడు అతని శరీరంలో కొన్ని సున్నితమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ సూత్రం ఆధారంగానే లైడిటెక్టర్‌ (Lie Detector)ను రూపొందించారు. ఇది మానవ శరీరంలో రక్తపోటు, గుండె చప్పుడు, శ్వాసక్రియ, చెమట పట్టడం లాంటి కొన్ని మార్పులను నమోదు చేస్తుంది. దీనిలో ఉండే న్యూమోగ్రాఫ్‌ ట్యూబు (pneumograph tube) అనే సన్నని రబ్బరు గొట్టాన్ని నిందితుని ఛాతీ చుట్టూ గట్టిగా కడతారు. ఒక పట్టీని రక్తపోటు కొలవడానికి జబ్బకు కడతారు. చర్మంలోని ప్రకంపనలను కొలవడానికి శరీర భాగాలలో కొద్ది మోతాదులో విద్యుత్‌ను ప్రవహింపజేసి అందులోని మార్పులను గ్రహించే ఏర్పాట్లు కూడా ఆ యంత్రంలో ఉంటాయి.

శరీరంలో కలిగే ప్రేరేపణలను, ఉద్వేగాలను సున్నితమైన ఎలక్ట్రోడుల ద్వారా గ్రహించి గ్రాఫు ద్వారా నమోదు చేస్తారు. ఈ యంత్రం ద్వారా లభించిన సమాచారాన్ని శాస్త్రీయంగా విశ్లేషించడం ద్వారా నిందితుడు అబద్ధ్దమాడుతున్నాడా లేదా అనే అంశంపై ప్రాథమిక అవగాహనకు వస్తారు. న్యాయవ్యవస్థ దీన్ని నేర విచారణలో ఒక సాధనంగానే గుర్తిస్తుంది కానీ కేవలం అది అందించే సమాచారం ఆధారంగానే నేర నిర్ధారణ చేయరు. ఈ పరికరాన్ని 1921లో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని జాన్‌లాగూన్‌ అనే వైద్య విద్యార్థి, ఒక పోలీసు అధికారి సాయంతో కనిపెట్టాడు.

లై డిటెక్టర్ టెస్ట్.. ఇది ఎవరికి చేస్తారు అంటే నిందితులపై చేస్తారని ఇట్టే చెప్పేస్తాం. అయితే ఇప్పటి నుంచి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కంపెనీకి రెజ్యూమ్ ఇస్తే.. లై డిటెక్టర్ టెస్ట్‌కు రెడీగా ఉండాల్సిందే. ఎందుకనుకుంటున్నారా.. హైదరాబాద్ నగరంలో కొన్ని కంపెనీలు ఇప్పటికే ఈ విధానాన్ని ప్రారంభించేశాయట. అభ్యర్థులు తమకు ఇచ్చే రెజ్యూమ్‌లలో చెప్పిన విషయాలు నిజమేనా కాదా అని తెలుసుకోవడానికి ఈ టెస్టులు నిర్వహిస్తున్నాయట. యూరోపియన్ దేశాలలో ఈ టెస్టులు సర్వసాధారణమంటున్నారు నిపుణులు. అభ్యర్థుల బ్యాక్ గ్రౌండ్ తెలుసుకోవడానికి కంపెనీలు పాలీగ్రాఫ్ టెస్టులు నిర్వహిస్తాయని చెబుతున్నారు.

Comments

comments

Share this post

scroll to top